May 30, 2023

పూజలు చేసినా, దేవాలయానికి వెళ్లినా కొబ్బరి కాయ కొట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అసలు కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి. చాలా మందికి వచ్చే సందేహమిది. ఆ సందేహానికి వివరణ చూద్దాం. కొబ్బరికాయ మనిషిలో మనసుకి ప్రతిబింబంగా చెప్తారు. మన మనసు మంచిదే… కానీ దాని చూట్టూ అహంకారాలు ఉంటాయి. అవి మనతో తప్పులు చేయిస్తాయి. కొబ్బరి కాయలో ఉండే నీరు ప్రాకృతికంగా ఏర్పడే పవిత్రమైన జలం. మంచి ఆలోచనలు కూడా అలాంటివే. మన మనసు ఆ నీళ్ల చుట్టూ ఉండే కొబ్బరి లాంటిది. అది కూడా ఎంతో శుద్ధమైనది. కానీ.. వాటిని ఆవరించి ఉండే కొబ్బరి పెంకు మాత్రం అహంకారానికి సూచిక. ఒక పట్టాన కొడితే గానీ కొబ్బరి పగలదు. అలా మనిషి అహంకారాన్ని గెలవడం కూడా అంత సులభం కాదు. దానికి ఎంతో సాధన, ఆధ్యాత్మిక చింతనా కావాలి. అలాంటి అహంకారాన్ని వదిలేస్తున్నాను అని భగవంతుని ముందు చేసే ప్రమాణమే కొబ్బరి నివేదనం. భగవంతుని ఆశ్రయిస్తే అహంకారం లాంటి లోపాలన్నీ పారిపోతాయి. తెల్లటి కొబ్బరి లాంటి మంచి మనసున్నవారే నిజమైన మనుషులు. కొబ్బరి కొట్టడం వెనుక అంతరార్థం ఇదే. అయితే దేవుడికి నివేదించే కొబ్బరి కాయ విషయంలో కొన్ని సదాచారాలు ఉన్నాయి. దేవుడికి నివేదించే కొబ్బరికాయకు ఎప్పుడూ కుంకుమ పెట్టకూడదు. ఎందుకంటే నైవేద్యం శుద్ధంగా ఉండాలి. ఇంటి బయట, వాహనాల ముందు కొట్టే దిష్టి కొబ్బరికాయలకు మాత్రమే కుంకుమ పెట్టాలి. ఇలా కొట్టే దిష్టి కొబ్బరికాయలను బలి హరణం అంటారు. అంటే మనకు తెలియని నెగెటివ్ ఎనర్జీస్ ని వెళ్ళగొట్టేందుకు దిష్టి తీస్తాం కాబట్టి ఆ పేరు. దేవుడికి కొట్టే కొబ్బరికాయను నేరుగానే సమర్పించాలి.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *