వేదం ఎప్పుడు, ఎవరు రాశారు ? అసలు ఎక్కడి నుంచి వచ్చిందీ వేదం? వేదాన్ని ఎవ్వరూ రాయలేదు. ఎప్పటిదో ఎవ్వరికీ తెలీదు. మన చరిత్రకారులు చాలా లెక్కలు చెప్పారు కదా అంటారా. ఒక్కోరు ఒక్కో లెక్క. ఎవరి నోటికొచ్చింది వారు చెప్పారు. ఇప్పుడు మనం వింటున్న చరిత్ర… మన దేశ ప్రతిష్టను తగ్గించేందుకు పనిగట్టుకుని బ్రిటిష్ వాళ్లు రాసిన చరిత్ర. మాక్స్ ముల్లర్, మెకాలే లాంటి అజ్ఞానులకు మన చరిత్రను వదిలేశాం. వారు రాసిందే చరిత్ర అని, చచ్చినట్టు అదే చదవండని, చరిత్రకు మసి రాసి… భావి తరాలకు సరైన చరిత్రను అందించని పాపం మాత్రం… మన దేశ సోకాల్డ్ మేధావులదే. వేదం కాలాన్ని నిర్ణయించేంత మేధావిత్వం ప్రస్తుతం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే అది పరబ్రహ్మ నుంచి వచ్చి దివ్య సందేశం. వేదం గురించి తెలుసుకోవాలంటే ముందు పరబ్రహ్మాన్ని అంటే సృష్టి ఆవిర్భావ కాలాన్ని చెప్పగలగాలి. ఎందుకంటే… విష్ణుపురాణంలో చెప్పినట్టు… సృష్టి ఆవిర్భావం ఒక బిందువు నుంచి మొదలై… పెద్ద గాలిబుడగతో ప్రారంభమైంది. ఆ బుడగ నుంచి న్యూక్లియర్ ఫ్యూజన్ థీయరీ ప్రకారం… విచ్ఛిత్తి చెందుతూ ఒక గోళం నుంచి వందలు వేలు గోళాలు ఏర్పడ్డాయని.. అలా సృష్టి ప్రారంభమైందని విష్ణుపురాణంలో చాలా స్పష్టంగా కాస్మో థీయరీని మొదటి పది పేజీల్లోనే వివరించారు పరాశర మహర్షి. పరాశరుడు విశిష్టుని మనుమడు, వ్యాసుని తండ్రి. ఇప్పుడు… వేదం గురించి మాట్లాడుకోవాలంటే వేదం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నను వెదుక్కుంటూ వెళ్లాలి. వెళ్దాం. సృష్టి ఆవిర్భావ క్రమంలో ఆ పెద్దగోళం పేలి గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడ్డాయి. మరి పెద్దగోళం పేలింది కదా. దాన్నే మన సైంటిస్టులు బిగ్‌బ్యాంగ్ అంటున్నారు కదా. అంత అంత పెద్ద పేలుడు ఏర్పడినపుడు శబ్దం రాదా? వస్తుంది. ఆ బిందువే పరబ్రహ్మం, ఆ బిందువు మహా పదార్ధంగా మారి సృష్టిగా రూపాంతరం చెందిన వైనమే విశ్వరూపం. అదే మన “విశ్వ” రూపం. విశ్వం ఏర్పడినప్పుడు దిక్కులు దద్దరిల్లేలా వచ్చిన ఆ శబ్దమే… మన వేదాలకు మూల వ్యాకరణం.. అదే ఓంకారం. సృష్టికి కారణమైన ప్రధమ అణువు (బ్రహ్మాండం) నుంచి పుట్టినదే ప్రణవం.
ప్రణవోహి పరబ్రహ్మా – ప్రణవః పరమం పదం
ప్రణవం సర్వవేదాద్యం – సర్వదేవ మయం విదుః.
ఇది ప్రణవ మంత్రం. అర్థమేంటంటే… “ప్రణవమే పరబ్రహ్మం. ప్రణవమే ముక్తి, ప్రణవమే సర్వవేదాలకు మూలం. ప్రణవం సకల దేవతలమయం.” సింపుల్‌గా చెప్పాలంటే సృష్టికి, సృష్టిని నడిపిస్తున్న శక్తులకు మూలం ప్రణవం. సృష్టి నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అంటే సృష్టి ప్రారంభమైన కోర్ ప్రాంతం నుంచి ఈ ఓంకార ఘంకారం వస్తూనే ఉంటుంది… నిరంతరం. పక్కనే ఏదైనా చిన్న వస్తువు పడితేనే శబ్దం వినిపిస్తుంది కదా? మరి అన్ని గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు.. సృష్టి కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయి. నక్షత్రాలు పేలిపోతుంటాయి. ఎన్నో వేల న్యూక్లియర్ బాంబుల పేలిన శబ్దం.
ఆ శబ్దం ఎందుకు వినపడదు? వినపడింది… మన యోగులు, ఋషులకు పరబ్రహ్మ మాట (ఓంకారం) వినపడింది. ఎలా అంటే.. మన సెల్‌ఫోన్‌లో ఏ వైర్లు లేకుండానే అమెరికా నుంచి ఇక్కడి వారితో ఎలా మాట్లాడుతున్నాం ? మన వాయిస్‌ని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చే టవర్‌కి మీడియం ఏంటి? శబ్ద తరంగాలు.. అయస్కాంత శక్తి తరంగాలుగా మారి.. మళ్లీ శబ్ద తరంగాలుగా మనకు వినిపిస్తాయి. ఇది సృష్టి ఆవిర్భావ సమయం నుంచే ఉన్న శక్తి. ఫిజిక్స్ భాషలో ఆ మీడియం పేరు ఎలక్ట్రో మేగ్నటిక్ ఎనర్జీ. మన భూమి శూన్యంలో ఉంది. శూన్యంలో మన భూమికి ఆధార శక్తి… ఈ భూమిని సృష్టించిన పరబ్రహ్మం నుంచి వస్తోంది. మనం పుట్టినప్పుడు అమ్మ పేగుతో పుడతాం.ఆ కనెక్షన్ వల్లే మనకేం అయినా.. తల్లికి తెలిసిపోతుంది. దీన్ని సైంటిఫిక్‌గా నిరూపించాలంటే నిజంగా ఆ దేవుడే దిగిరావాలి. అలాంటి కనెక్షనే మన భూమికి, ఈ సృష్టి మూలకణమైన ఆ పరబ్రహ్మానికి ఉంది. ఆ పరబ్రహ్మం పేగు బంధమే ఈ గ్రహాలు, నక్షత్రాలు. మన భూమి అందులో ఒకటి కదా. కనుక.. ఆ పరబ్రహ్మం నుంచి వస్తున్న శక్తి… ఈ సృష్టి మొత్తం ఆవిరించి ఉంది. భూమి చుట్టూ కూడా. ఈ భూమి మీదే పుట్టిన మన చుట్టూ కూడా. ఆ పరబ్రహ్మ తన జ్ఞానాన్ని ఈ కర్మభూమికి ఇవ్వాలనుకున్నాడు. అది మన అదృష్టం. అలా ఈ భూమి మీద అద్భుత మేధావులకు, ఋషులకు తన స్వరాన్ని వినిపించాడు. వినిపించే శక్తిని వారికిచ్చాడు. అదే ఓంకారం. అక్కడి నుంచే పుట్టింది మంత్రం. అదే వేదానికి మూలం. మన చుట్టూ ఉంటే మనకెందుకు వినిపించదు? మనిషి 20 హెర్జ్‌లకు తక్కువ, 20 వేల హెర్జ్‌లకు ఎక్కువ ఉన్న సౌండ్లే వినలేడు. మరి సృష్టి ఆవిర్భావ సమయంలో ఏర్పడిన విశ్వ శబ్దాన్ని వినే శక్తి ఉంటుందా? తిరుపతిలో వేంకటేశ్వరుడి నిలువెత్తు విగ్రహాన్ని 10 సెకన్లు చూస్తేనే తన్మయం చెందిపోతాం. అదే నిజంగా సాక్షాత్కరిస్తే చూసే శక్తి మన కళ్లకు లేదు. కళ్లు తిరిగి పడిపోతాం. ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తూ అరిస్తే చిరాకు పడి వాళ్ల మీద అరిచేస్తాం. మనకెందుకు వినిపిస్తుంది ఓంకారం చెప్పండి? తపస్సు.. ఈ కాలం భాషలో సైంటిఫిక్ రిసెర్చ్.తన మూలాలు తెలుసుకోవాలని తాపత్రయే పడే, అందుకోసం తపస్సు చేసిన, ఆ తపస్సు తప్ప వేరే ఏదీ పట్టించుకోని రీసెర్చ్ స్కాలర్స్(ఋషులు)కి వినిపిస్తాడు భగవంతుడు. ప్రపంచంలో మహా మేధావులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకు వారే మేధావులయ్యారు? అని ప్రశ్నించుకుంటే… ఆర్యభటలా మనమెందుకు ఆలోచించలేదు? ఐన్‌స్టీన్ థీయరీ ఆఫ్ రిలేటివిటీ మన బుర్రకెందుకు తట్టలేదు? అని అడిగినట్టే ఉంటుంది. అది వారివారి కర్మలను బట్టి, వారి ఆలోచనను బట్టి ఉంటుంది. కారణ జన్ములని కొందరుంటారు. వారే ఈ అతీత శక్తులను గ్రహించే విద్వత్తు కలిగుంటారు. వారే పరబ్రహ్మానికి, మన భూమికి ఉన్న పేగుబంధం (ఎనర్జీ మీడియం)ని వాడుకోగలరు. వారే ఓంకారాన్ని (voice of god) వినగలిగారు. దివ్య శక్తులుంటాయా? అని ఓ వెకిలి నవ్వు నవ్వేస్తారు చాలామంది. కచ్చితంగా ఉంటాయి. మనిషికి సిక్త్‌సెన్స్ ఉంటుంది. ఇది ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది. ఆ సిక్త్‌సెన్స్‌ని మాత్రమే ఉపయోగించడం తపస్సు. తపస్సులో ఉన్నవారి శరీరం నేల మీదే ఉన్నా.. మెదడు ఎన్నో డైమెన్షన్లో టైమ్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మనకైతే ఒక నానుడే ఉంది. పిలిచినా పట్టించకోని వాళ్లను.. ఏ లోకంలో ఉన్నావురా బాబూ అంటుంటాం కదా. నిజంగానే మనసుని వేరే లోకాలకు తీసుకెళ్లే శక్తి మన మెదడులో సహస్రార చక్రానికి ఉంది. ఆ చక్రాన్ని యాక్టివేట్ చేయడమే ఘోర తపస్సు. ఆ మధ్య వచ్చిన హాలివుడ్ సినిమా ఇనసెప్షన్ ఈ కాన్సెప్ట్‌లో తీసిందే. మన ముందరి తరం ఋషులు రామకృష్ణ పరమహంస, వివేకానందులకు ఈ శక్తి ఉంది. వారి జీవిత చరిత్రలు ఒక్కసారి చదవండి. ఆ ట్రాన్స్‌లో ఋషులు అనంత లోకాల్లో ఎలా విహరించగలిగారో ముందుముందు ఇంకా చర్చించుకుందాం. అలా మన ఋషులు గ్రహించిన ఓంకారమే వేదానికి తొలి పాఠం. అక్కడి నుంచి నేరుగా భగవంతుని నుంచి గ్రహించిన శాస్త్ర విజ్ఞానమే వేదమైంది. వేదం ఎవరో రచించింది కాదు. వేదం అపౌరుషేయం. అంటే… ఏదో శక్తి నుంచి గ్రహించిన మంత్ర శబ్దాలను.. మేధావులైన ఋషులు వారి జ్ఞానశక్తితో గ్రహించి నిక్షిప్తం చేశారు. మొదట వేదాలు నాలుగుగా లేవు. ఒక్కటే వేదం. వేద ఋషుల వంశానికే చెందిన వాడు వ్యాసుడు. వ్యాస అంటే విభజన అని అర్థం. వేదాలను, వేదాంగాలను విభజించి ప్రజలకు అర్థమయ్యే విజ్ఞానంగా అందించిన ఘనుడు కాబట్టి వ్యాసుడయ్యాడు. వ్యాసుడు విష్ణువు మరో అవతారమే అంటారు. ఈ వ్యాసుడు ఒక్కరు కాదట. 21 మంది వ్యాసులు ఉన్నారట. వ్యాసుడు… వశిష్ఠుని మనుమడైన పరాశరుని కుమారుడు. వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. చాలామందికి ఓ సందేహం వచ్చి ఉండొచ్చు. సృష్టి ఆవిర్భావం సమయంలో ఏర్పడిన ఆ శబ్దం ఓంకారమే ఎందుకవ్వాలి? ఇంకేదైనా కావొచ్చు కదా? అసలు ఓంకారం మనచుట్టు తిరిగితే వేదం ఎలా అయింది? వీటికి ఆన్సర్లు నేనేదో చెప్పడం కాదు… ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు.. తమ ఆధునిక పరిజ్ఞానంతో నిరూపించిన వాస్తవాలున్నాయి. వాళ్లే చెప్పారు ఓంకారం నిజమని, సృష్టి ఆవిర్భావం గురించి వేల ఏళ్ల క్రితమే భారతీయులకు తెలుసని ఒప్పుకున్నారు. ఆ వివరాలు తర్వాత ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం. ఓంకారం తర్వాత.. వేదం, ఒక్కో వేదంలో ఏముంటుంది? వేదాన్ని ఎలా విభజించారు.. ఇలాంటి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
–సతీష్ కొత్తూరి