June 7, 2023

1947 నుంచి టీం ఇండియా ఆస్ట్రేలియా టూర్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి 2018 వరకు మనం కంగారూలతో 44 టెస్టులాడితే గెలిచినవి ఐదంటే ఐదు మాత్రమే. అది కూడా 2018 వరకు ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ సీరీస్ గెలిచిందే లేదు. కానీ 2018, 2020ల్లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా ఆ ఫెయిల్యూర్ హిస్టరీని చెరిపేసింది. ఆ రెండు సీజన్లలో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై నాలుగు టెస్ట్‌ విజయాలతో పూర్తి పట్టు సాధించింది. అంతకు ముందు కూడా మరీ ఘోరపరాజయాలు కావు. కొన్ని సిరీస్ లలో చాలా దగ్గరకు వచ్చి గెలుపు మిస్సయింది. ఆ రివైండ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం.

వినూ మన్కడ్

1947లో స్వతంత్రం వచ్చాక ఏర్పడిన మొదటి టీమ్ ఇండియా… ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లింది. అప్పడు ఆస్ట్రేలియా కెప్టెన్ డాన్ బ్రాడ్‌మన్‌. దిగ్గజ కెప్టెన్ బ్రాడ్ మన్.. ఆయన వ్యూహాల ముందు ఓటమి తప్పలేదు. 4 మ్యాచులు ఆడితే నాలుగూ ఓటమే. కానీ ఆ సిరీస్ లో మన టీమ్ నుంచి ఫస్ట్ వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఆయనే వినూ మన్కడ్. ఆ సిరీస్ లో వినూ మన్కడ్ 2 సెంచరీలు చేశారు. 12 వికెట్లు తీశారు.

ML జయసింహ

ఆ తర్వాత మళ్లీ 1967లో అంటే 20 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లింది. అప్పుడు కూడా అదే పరాభవం. 4-0. అయితే ఈ సారి అంత సలభంగా కాదు. మూడో టెస్టులో.. ఇదే బ్రిస్బేన్లో మన వాడు ఒకడు అస్ట్రేలియాకి చుక్కలు చూపించాడు. అతడే స్టైలిష్ హైదరాబాదీ బ్యాట్స్ మెన్ ML జయసింహ. అది కూడా స్పిన్నర్ చంద్రశేఖర్ గాయపడితే ఆయన ప్లేసులో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. అలా రీప్లేస్ లో వచ్చిన జయసింహ.. ఆ మ్యాచ్ లో సింహ గర్జన చేశాడు. చందుబోర్డేతో కలిసి 101 పరుగులు చేశాడు. ఆ రోజు ఆయన ఆడిన ఆ పవర్ ప్లే వల్లే భారత్.. జస్ట్ 39 పరుగుల తేడాతో వెనకబడింది. లేకుంటే ఆ రోజూ భారీ పరాజయం తప్పేది కాదు. ఆ మ్యాచ్‌ని ఇప్పటికీ ఓ థ్రిల్లర్ గా చెప్తారు.

స్పిన్నర్ చంద్రశేఖర్

1977లో ఇండియా ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లింది. ఐదు టెస్టుల ఆ సిరీస్‌లో భారత్ 2 గెలిచింది. ఆస్ట్లేలియాలో టెస్ట్ పరాజయాలకు బ్రేక్ వేస్తూ… మొదటి సారి గెలిచిన సంవత్సరం. అది కూడా ఫోర్త్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లను మన వాళ్లు ఛేదించారు. మొదటి మూడు మ్యాచ్‌లు కూడా తక్కువ స్కోర్ల తేడాతోనే చేయి జారాయి. మెల్ బోర్న్ టెస్ట్ లో స్పిన్నర్ చంద్రశేఖర్ 52 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. అప్పటికి అది ఒక రికార్డు.

1980.. అది కపిల్ లాంటి ఉద్దండులున్న టీమ్‌ ఇండియా. అప్పటికీ ఇంకా టీమ్ ఇండియాని చిన్న టీమ్ గానే చూస్తున్నారు. అయితే ఈ టెస్ట్ సిరీస్ తో టీమ్ ఇండియా తడాఖా ప్రపంచ క్రికెట్‌కి తెలిసొచ్చింది. 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌. 1-1తో సమం. అప్పటికి అది భారీ విజయమే. ఆస్ట్రేలియాలో ఇదే తొలి చారిత్రక విజయం. కపిల్ దేవ్ బుల్లెట్ బౌలింగ్‌కి ఆస్ట్రేలియా వణికిపోయింది. 28 పరుగులు ఇచ్చి కపిల్ 5 వికెట్లు తీశాడు. 143 పరుగుల చిన్న లక్ష్యాన్ని చేధించలేక 83 పరుగులకే ఆస్ట్రేలియా చతికిలపడింది. అందుకే ఫస్ట్ హిస్టారికల్ విన్ ఇదే అని చెప్పాలి.

ఆ తర్వాత మళ్లీ 1985లో ఇండియా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లింది. 3 మ్యాచులు జరిగితే మూడూ డ్రానే. ఈ సిరీస్‌లో క్రిష్ణమాచారి శ్రీకాంత్, సునీల్‌ గవాస్కర్, శివలాల్ యాదవ్‌లు మెరిశారు. 1991 ఆస్ట్రేలియా టూర్‌ మళ్లీ గత కాలం నాటి పరాభవమే ఎదురైంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో పరాజయంతో వెనక్కు వచ్చాం. అయితే ఆ టూర్‌లో సచిన్‌, అజారుద్దీన్‌ అద్భుతంగా రాణించి ఇండియన్ క్రికెట్‌కి గొప్ప భరోసా ఇచ్చాడు. కపిల్‌ 400 వికెట్లు పూర్తి చేసుకున్నది ఈ టూర్‌లోనే. ఈ టూర్‌లో ప్రతీ మ్యాచ్‌ చాలా తక్కువ స్కోరుతోనే చేజారింది. అందువల్ల ఘోర పరాజయం అనలేం. బిగ్‌ ఫైట్‌ అనాలి.

1999… అస్ట్రేలియన్ టూర్‌లోనూ 3-0తో టెస్ట్‌ సిరీస్‌ చేజారింది. అయితే ఈ టూర్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ అనే ఆణిముత్యం బయటపడింది. లక్ష్మణ్‌ ఆటకు ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. సిడ్నీ మ్యాచ్‌లో అతను కొట్టిన 167 రన్లు ఒక క్లాసిక్‌ ఇన్నింగ్‌. అలా టీం ఇండియా గొప్ప ప్లేయర్లతో పటిష్టంగా మారింది. అది 2003. కంగారూలను మన సింహాలు కంగారు పెట్టిన సంవత్సరం. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1-1 తో డ్రా అయితేనేం… లక్ష్మణ్‌-ద్రవిడ్ క్లాసిక్‌ ఇన్నింగ్‌ ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఫాలోఆన్‌గా దిగి ద్రవిడ్‌ 233, లక్ష్మణ్‌ 148 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడించిన ఇన్నింగ్‌ని ఏ క్రికెట్‌ అభిమాని మరిచిపోడు.

2007, 2011, 2014లో ఆస్ట్రేలియా టూర్లలో టెస్ట్‌ సిరీస్‌ కొట్టలేకపోయాం. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన జట్టు మనది. 2018 ఆస్ట్రేలియా టూర్లో ఆ పాత పరాజయాలన్ని మరిచిపోయేలా అద్భుతంగా సిరీస్‌ గెలిచాం.మూడు సెంచరీలతో 521 పరుగులు చేసి విరుచుకుపడిన ఛతేశ్వర్‌ పుజారా ఆ సిరీస్‌ హీరో. తాజాగా ఈ సిరీస్‌లో నిజానికి పెద్ద ఆటగాళ్లు ఎవరూ లేకుండానేఅస్ట్రేలియా మెడలు వంచారు మన కుర్ర టీమ్. అసలు గెలుస్తామా అన్న సందేహం నుంచి కప్పు తెచ్చే వరకు… ఈ సిరీస్‌ అంతా సంచలనమే. ముఖ్యంగా చివరి మ్యాజ్‌లో రిషబ్‌ పంత్‌ చేసిన మ్యాజిక్‌ మరో క్లాసిక్ ఇన్నింగ్‌ అనే చెప్పాలి.మొత్తానికి ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు కంగారూలను ఓడించగలిగే టీమ్‌ లేదని విర్రవీగేవారు. కానీ.. టీం ఇండియా ఒక్కసారి కుదురుకుంటే ఎక్కడైనా జెండా పాతేయగలదు.

సతీష్‌ కొత్తూరి, సీనియర్‌ జర్నలిస్ట్

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *