మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, నిండు నూరేళ్లు బతకాలంటే రోజుకి కనీసం అరగంటైనా ప్రాణాయామం చేయాలని పతంజలి యోగ శాస్త్రం చెప్తోంది. నిత్యం ధ్యానం, యోగం చేసేవారి ముఖం ఎప్పుడూ తేజస్సుతోనే ఉంటుంది. ఈ యోగం గానీ, ధ్యానం గాని, ప్రాణాయామం గాని ఏకాగ్రతతో చేయాలంటే అందుకు వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కూడా ఇదే చెప్తాడు. భారత దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి రెండటికీ లంకె ఉంది. అందుకు సాక్ష్యమే పంచ భూత లింగాలు. ఎక్కడైనా దేవుడి విగ్రహం గుడిలో ఉంటుంది, దండం పెడతాం. కానీ పంచభూతాల పేర్లతో ఎక్కడా ఆలయాలు ఉండవు. ఒక్క భారతదేశంలోనే ఆ ప్రత్యేకత ఉంది. అందులోనూ ఆ పంచభూత క్షేత్రాలు ఆది యోగి అయిన పరమ శివుడి ఆలయాలు. అసలు పంచ భూతాలకు, ఆ ఆలయాలకు సంబంధమేంటి? పంచభూతాలకు శివయ్యకు సంబంధమేంటి? అవి నిజంగా ఆలయాలేనా లేక తపస్సు లేదా ధ్యానం చేసే యోగ కేంద్రాలా? ఇప్పుడు చూద్దాం…

ఈ సృష్టి అంతా పంచభూతాలమయం. మన శరీరం కూడా పంచభూతాలతో ఏర్పడిందే.భూమికి ఉండే గురుత్వాకర్షణ తత్వంతో మన శరీరం ఉంటుంది. అందుకే భూమి మీద మన శరీరం నిలబడుతోంది. ఆకాశ తత్త్వమే మన మనసుగా ఉంది. అదే ఆలోచనలకు ఆధారం. ఆలోచనలే మన జీవితం. వాయువు… గాలి లేనిదే ప్రాణ వాయువు లేదు. ప్రాణ వాయువు లేనిదే మనకు ప్రాణం లేదు. నీరు… నీరు లేకపోతే మనకు ఆహారం లేదు, ఆహారం లేకపోతే మనుష్య జాతే లేదు. అగ్ని.. మన శరీరంలో ఉండే జఠరాగ్నే మనకు శక్తి. ఆకలి వెయ్యాలన్నా, తిన్న ఆహారాన్ని అరిగించాలన్నా అంతా జఠరాగ్ని పని. మన శరీరంలో వేడే మన ప్రాణం. వేడి పోయిందంటే… ఈ శరీరం శవమైపోతుంది. ఇలా మన శరీరం పంచభూతాలతోనే నడుస్తోంది.
ఈ పంచభూత తత్వానికి, ఆ పంచభూత ఆలయాలకు సంబంధమేమిటి? విశ్వ సృష్టి, విశ్వాన్ని నడిపించడం బ్రహ్మ, విష్ణువుల చేతుల్లో ఉన్నాయి. కానీ పుట్టుక, గిట్టుట ఈ రెండూ శివయ్య చేతుల్లో ఉన్నాయి. శివం లేని శరీరమే శవం. విశ్వంలో మనకు అవసరమయ్యే పంచభూతాలను మన శరీరంలో లయం చేసి ప్రాణంగా మలిచిన విశ్వనాథుడే శివుడు. పంచభూత తత్వాలన్నీ ఆయన ఆధీనం. పంచభూతాల్లో ఒక్కో శక్తికి ఒక్కో శివలింగం క్షేత్రంగా ఉంది.

పృథ్వీ లింగం కంచిలో ఉంది. అక్కడి భగవంతుడిని ఏకామ్రేశ్వరుడు అంటారు. ఇసుకతో ఏర్పడిన సైకత లింగాన్ని అక్కడ పూజిస్తారు. భూ తత్వానికి సూచిక ఆ లింగ.
ఆకాశ లింగం చిదంబరం. ఆకాశంలో ఉన్న శూన్యతకు చిహ్నంగా అక్కడ ఒక కిటికీలో చూపించే శూన్యమే చిదంబర రహస్యం. విశ్వ ఆవిర్భావ క్రమాన్ని వివరించే నటరాజ స్వామి ఇక్కడి పరమేశ్వరుడు.
జల లింగం… శ్రీ రంగం పక్కనే ఉన్న జంబుకేశ్వరంలో ఈ జల లింగం ఉంది. అక్కడి శివలింగం చుట్టూ ఇప్పటికీ నీరు ఊరుతూనే ఉంటుంది.
అగ్ని లింగం… అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరుడు అగ్ని లింగం. ఇప్పటికీ అక్కడి గర్భగుడిలో శివలింగం సుమారు 40 డిగ్రీల వరకు వేడిని విడుదల చేస్తుంది. అక్కడ ఉన్న అరుణ గిరి నుంచి ఇంతే వేడి వస్తుంటుంది.
వాయులింగం- మొదటి నాలుగు తమిళనాడులో ఉంటే.. ఈ వాయులింగం ఒక్కటి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళ హస్తిలో ఉంది. ఇక్కడి గర్భగుడిలో గాలిచొరబడని చోట వెలిగించిన దీపం గాలి వీచినట్టుగా కొట్టుకుంటూ ఉంటుంది. ప్రాణవాయువుని స్వీకరించే లింగంగా శ్రీ కాళహస్తీశ్వరుడు పూజలందుకుంటాడు.

ఈ ఐదు క్షేత్రాలు నిత్యం మనం చూసే ఆలయాల్లాంటివి కావు. ధ్యానం కోసం, తపస్సు కోసం ప్రత్యేకంగా నిర్మించిన యోగ కేంద్రాలు. ఇవన్నీ సాధనా స్థలాలు. పూజల కోసం నిర్మించినవి కావని చెప్తారు. మిగిలిన చోట్ల పెద్దగా కనిపించదు కాని.. అరుణాచలం ఇప్పటికీ సాధనా కేంద్రంగానే ఉంది. అక్కడికి మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా వచ్చి యోగ సాధన చేస్తారు.
యోగ సాధనకు మన శరీరంలో పంచభూతాలు మనకు అనుకూలంగా ఉండాలి. వాటిని మన మనసు నియంత్రించడమే యోగం. ప్రతీ మనిషి పంచభూతాల్లో ఐదింటినీ నియంత్రించడం సాధ్యం కాదు. అలా నియంత్రించగలిగితే ఆ వ్యక్తి యోగి అవుతారు.
అందుకే ఈ పంచభూత కేంద్రాలు ఆ ఉద్దేశంతోనే వెలిశాయి. భూతత్వంలో మనకు సాధన కావాలంటే కంచిలో చేయాలి, మనసు నియంత్రణలోకి తెచ్చుకునే సాధన చేయాలంటే చిదంబరం వెళ్లాలి. ప్రాణాయామం బాగా సాధన చేయాలంటే శ్రీ కాళహస్తి అనువైన ప్రదేశం. మనలో జలతత్వం నియంత్రణలోకి రావాలంటే జంబుకేశ్వరంలో సాధన చేయాలి. మనలో అగ్ని ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న మానసిక సమస్యలు వస్తాయి. అలాగే పంచభూతాలు నియంత్రణ తప్పినా ఒత్తిళ్లు వస్తాయి. పంచభూతాలు నియంత్రణలో ఉండాలంటే మనలో ఉన్న అగ్నులు శాంతించాలి. అందుకే అరుణాచలంలో ధ్యానం చేయాలి. అందుకే మానసిక ప్రశాంతత కోసం, తనను తాను తెలుసుకోవాలి అనుకునే వారి కోసం అత్యుత్తమ సాధనా కేంద్రం అరుణాచలం.

ఇప్పటికీ ఆ అరుణ గిరికి వెళ్తే… అక్కడ కొండ చూట్టూ, ఆలయాల్లో, అక్కడ ఉన్న ఎన్నో ఆశ్రమాల్లో గంటల గంటలు ధ్యానం చేసేవారు చాలా మంది కనిపిస్తారు. అక్కడ శివలింగం విడుదల చేసే వేడి ఒక ఎలక్ట్రిక్ థెరపీలా పనిచేస్తుంది. అందువల్ల ఎంత సేపు ధ్యానం చేసినా ఏకాగ్రత చెదిరిపోదు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి జాగ్రఫీ ఉన్న ప్రాంతం మరోటి లేదు.
అలా మన ఆరోగ్యాలను, ఆయుష్షును యోగం ద్వారా పెంచుకునేందుకు అద్భుతమైన సాధనా కేంద్రాలుగా ఏర్పడినవే పంచభూత లింగాలు. ఆ కేంద్రాల్లో ఆయా పంచభూతాల లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరంలో తగ్గిన పంచభూత లెవల్స్‌ని పెంచుతాయి. ఇది ప్యూర్ నేచురో థెరపీ.
అందుకేనేమో చాలా విచిత్రంగా, అసలు ఊహకు అందని విధంగా ఈ ఆలయాల నిర్మాణాలు జరిగాయి. ఎలా అంటే ఆకాశం, ఆకాశం నుంచి భూమి, భూమి నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, వాయువు అగ్ని కలిస్తే జలం. ఇదే ఆర్డర్‌లో ఈ పంచభూత క్షేత్రాలు ఉండడం ఆశ్చర్యం. ఇప్పుడంటే లాంగిట్యూడ్‌లు అవీ వచ్చాయి.అప్పట్లో వాటి గురించి ఇప్పటికి మించిన నాలెడ్జ్ ఉండి ఉండాలి. ఎందుకంటే సరిగ్గా 79 డిగ్రీల లాంగిట్యూడ్‌కి కాస్త్ అటు ఇటులోనే ఆకాశ లింగమైన చిదంబరం, పృథ్వి లింగమైన కంచి, వాయు లింగమైన శ్రీ కాళ హస్తి స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. మిగిలిన రెండు ఆలయాలు అంటే అరుణాచలం, జంబుకేశ్వరం కూడాకూడా.. ఇప్పుడున్న ఆలయాలకు 3 డిగ్రీల లాంగిట్యూడ్‌కి అటూ ఇటుగా ఉన్నాయి. అంటే ఒక వరుసలో పంచభూత క్షేత్రాలు స్వయంభుగా ఏర్పడడం శివుని లీల తప్ప.. మానన నిర్మితాలు మాత్రం కాదు.

అంతే కాదు ఇదే 79 డిగ్రీల లాంగిట్యూడ్ కాస్త ఇటు ఇటుగా అదే స్ట్రైట్ లైన్‌పై ఈ పంచభూత క్షేత్రాలతో పాటు, తెలంగాణలోని కాళేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరం, హిమాలయాల్లోని కేదారేశ్వరం కూడా ఉన్నాయి. అందుకే ఈ భూమి మీద 79 డిగ్రీల లాంగిట్యూడ్‌ని శివ శక్తి రేఖ లేదా డివైన్ యాక్సిస్ అని పిలుస్తున్నారు. ఏ టెక్నాలజీ లేదని చెప్తున్న రోజుల్లో ఇంత పర్‌ఫెక్ట్‌గా ఒకే సరళ రేఖ ఇన్ని గొప్ప క్షేత్రాలు నిర్మించడం వెనుక సైన్స్ ఉంది. యోగ సాధకులు… పంచభూత క్షేత్రాల్లో సాధన వరుసగా చేసి.. చివరికి హిమాలయకు చేరుకోని సిద్ధి పొందాలన్నదే ఈ రేఖ ఉద్దేశం కావొచ్చు.