మళయాళంలో మోహన్‌లాల్, మమ్మూట్టీలు ఆ రాష్ట్రానికి మెగాస్టార్లు. వయసు మీద పడ్డాక వాళ్లు ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మిగిలిన పెద్ద హీరోలు వాళ్లను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్నది 12th మ్యాన్ గురించి. దృశ్యం సినిమా అనగానే మనకు మోహన్‌లాల్, జితూ జోసెఫ్ గుర్తొస్తారు. ఆ కాంబో నుంచి వచ్చిన మరో అద్భుతమైన థ్రిల్లర్ 12 TH Man. ఒక్క చిన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు కిక్కిచ్చే మ్యాజిక్ చేశాడు. హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్. వైవిధ్యమైన పాత్రలో మరోసారి మోహన్‌లాల్ సినిమా మొత్తాన్ని నిలబెట్టేశారు.

ఒక ఐదు జంటలు, మరో కొలీగ్ మొత్తం 11 మంది సరదాగా పార్టీ చేసుకునేందుకు ఒక రిసార్ట్‌కి వెళ్తారు. అక్కడ వారంతా డిన్నర్‌కి కూర్చున్న సమయంలో ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఏంటంటే.. అందరూ ఫోన్‌లను ముందు పెట్టుకోవాలి. ఏ కాల్ వచ్చినా లౌడ్ స్పీకర్‌లో మాట్లాడాలి. ఏ మెసేజ్ వచ్చినా అందరికీ చెప్పాలి. సహజంగా అందరికీ రహస్యాలు ఉంటాయి. ఒక్కసారి మన మొబైల్‌ని ఎవరైనా చూస్తే మన పర్సనల్స్ అన్నీ బయటపడతాయి. ఈ గేమ్‌లో ఓ రహస్యం బయటపడి గొడవ జరుగుతుంది.ఆ తర్వాత ఒకరు అనుమానాస్పద స్థితిలో లోయలో పడి చనిపోతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఈ కథలో 12 వ వ్యక్తి, ఈ గ్రూప్‌తో సంబంధం లేని వ్యక్తి మోహన్ లాల్ క్యారెక్టర్. ఆల్కహాలిక్ అయిన మోహన్‌లాల్‌కి ఈ గ్రూప్‌తో సంబంధం ఏమిటి. హత్య చేసినది ఎవరు? అన్నదే మిగిలిన కథ.

1948లో అల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన రోప్ అనే సినిమా వచ్చింది. అందులో ఓపెనింగ్ షాటే ఓ హత్య. ఆ హత్య చేసినది ఎవరో ముందే రివీల్ చేస్తారు. హంతకుడిని నిరూపించే కథ అంతా ఒక గదిలోనే నడుస్తుంది. రోప్ సినిమా ఒక క్లాసిక్. సరిగ్గా ఇదే స్క్రీన్‌ప్లేని జీతు జోసెఫ్ ఉపయోగించారు. ఈ సినిమాకి ఫ్రెంచ్ సినిమా నథింగ్ టూ హైడ్ ప్రేరణగా కనిపిస్తోంది. సినిమా మొత్తం ఇంటర్వెల్ వరకు ఒక రిసార్ట్‌లో, ఇంటర్వెల్ తర్వాత అంతా ఒక కాన్ఫెరెన్స్ రూమ్‌లోనూ జరుగుతుంది. నిజానికి ఇది పెద్ద రిస్క్. స్క్రీన్‌ప్లే సరిగ్గా లేకపోతే బోర్ కొట్టేస్తుంది. కానీ ఈ సినిమాలో ఎక్కడా బోర్ కొట్టదు. హంతకుడు ఇతనే అనుకునే లోపు మరొకరిపై అనుమానం వస్తుంది. అలా ప్రతీ సీన్‌ని అద్భుతంగా తీశారు జితు జోసెఫ్. సెకండ్ ఇన్సింగ్స్‌లో మోహన్‌లాల్ అదరగొట్టేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన బ్రోడాడీ మూవీలోనూ డిఫరెంట్ క్యారెక్టర్. ఇందులోనూ ఒక సస్పెన్స్ క్రియేట్ చేసే క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో పాపులర్ హీరోలు ఎలాంటి క్యారెక్టర్స్ ఎంచుకోవాలో మోహన్ లాల్, మమ్ముట్టీలను చూసి మన పెద్ద హీరోలు ఫాలో కావొచ్చు. మొత్తాన్ని 12 TH Man సినిమా గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఒక్క మొబైల్ మన జీవితాలను ఎలా మార్చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.