66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా అన్ని భాషల చిత్రాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. ఏప్రిల్‌లోనే ప్రకటించాల్సిన ఈ అవార్డుల లిస్ట్ ఎన్నికల కారణంగా ఇప్పడు విడుదల చేశారు. జాతీయ ఉత్తమనటిగా మన మహానటి కీర్తి సురేష్ ఎంపికయ్యారు. మన తెలుగు చిత్రాలు రంగస్థలం, అ!, చి.ల.సౌలకు కూడా అవార్డులు దక్కాయి.గుజరాతీ మూవీ హెల్లారో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో వచ్చిన ఉరి డైరెక్టర్ ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.
అందాధున్ చిత్రంలో నకిలీ అంధుడిగా అద్భుతంగా నటించిన ఆయుష్మాన్ ఖురానా.. అలాగే.. ఉరి చిత్రంలో డైనమిక్ కమాండర్‌గా నటించిన విక్కీ కౌశల్ ఇద్దరికీ ఉత్తమ నటుడి అవార్డ్ దక్కింది. చంబక్ చిత్రంలో సూపర్బ్ నటనకి స్వానంద్ కిర్‌కిరేకి ఉత్తమ సహాయ నటుడు, బదాయ్ హోలో సున్నితమైన అంశానికి అద్భుత నటన ప్రదర్శించిన సురేఖా సిక్రీకి ఉత్తమ సహాయ నటి అవార్డులు లభించాయి.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచింది. పద్మావత్ మూవీకి ఉత్తమ సినిమాటోగ్రఫి అవార్డు, ఆ చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డ్ దక్కింది. గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్‌కి ఉత్తమ యాక్షన్ చిత్రం అవార్డ్ వరించింది. రంగస్థలం మూవీకి ఉత్తమ ఆడియోగ్రఫి, చిలసౌ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే,బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌కి మన అ!, కన్నడ కేజీఎఫ్ ఎంపికయ్యాయి.
కన్నడ చిత్రం నాతి చరామిలో మాయావి మాననే గీతాలాపనకు బిందుమాలినికి ఉత్తమ గాయని అవార్డు దక్కింది. పద్మావత్‌లో బింటేదిల్ పాటకు అద్భుత గాత్రాన్ని అందించిన అర్జిత్ సింగ్ ఉత్తమ గాయకుడిగా నిలిచారు. ఏటా జాతీయ పురస్కారాల్లో ప్రకటించే నర్గీస్‌దత్ అవార్డు ఈ సారి కన్నడ మూవీ ఒందల్లా ఎరదల్లాకి దక్కింది. ఉత్తమ సామాజిక చిత్రంగా ప్యాడ్‌మ్యాన్, పర్యావరణ పరిరక్షణ చిత్రంగా మరాఠి మూవీ పానీ నిలిచాయి.