వాజ్‌పేయి గురించి అద్వానీ కన్నా ఎవరికి తెలుస్తుంది. ఇద్దరూ ప్రాణ మిత్రులు. ఒకే భావజాలం. ఆలోచనల్లో కాస్త భావ సారూప్యత కనిపించవచ్చు. కానీ.. ఇద్దరి గమనం ఒక్కటే. అద్వానీ తన జీవితంలో విషయాలను వివరిస్తూ రాసిన ఆత్మకథ.. నా దేశం నా జీవితం పుస్తకం. ఆ పుస్తకంలో వాజ్‌పేయ్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అద్వానీ రాజకీయ జీవితం ప్రారంభం నుంచి… ఆయన జీవితంలో వాజ్‌పేయ్ అంతర్లీన భాగస్వామి. 50 సంవత్సరాల స్నేహం వారిద్దరిదీ. నాయకత్వ లక్షణాల్లో అద్వానీకి కాస్త దూకుడెక్కువ. వాజ్‌పేయి శాంతి స్వరూపుడు. అందుకే నిండు మేఘం లాంటి వ్యక్తిత్వం ఉన్న వాజ్‌పేయి నాయకత్వాన్నే తాను శిరోధార్యంగా భావించానని అద్వాని తన ఆత్మకథలో రాసుకున్నారు.
అటల్ 1948లో జాతీయవాద వార పత్రిక పాంచజన్యకు ఎడిటర్‌గా పనిచేశారు. అప్పటికి అద్వానీ, అటల్‌కి నేరుగా పరిచయం లేదు. శక్తివంతమైన కలం వాజ్‌పేయి సొంతం. ఆయన రచనల్లో ఫైర్ ఉండేది. అలా పాంచజన్యంలో వాజ్‌పేయి రాసిన వ్యాసాలు, వెన్నెల తరకల్లాంటి కవితలు చదివి అద్వానీ ఉత్తేజితులు అయ్యేవారు. అద్వానీయే కాదు వాజ్‌పేయి రచనలకు ఆనాడు చాలా మంది యువత ఫ్యాన్స్. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను పాంచజన్యం పత్రిక ద్వారా పరిచయం చేసింది వాజ్‌పేయి. ఆ ఆదర్శాలే తర్వాత బీజేపీకి ఆదర్శ వాక్కులయ్యాయి. పాంచజన్యం పత్రికకు వాజ్‌పేయి కేవలం రచయితగానే కాదు proof reader, కంపోజర్, బైండర్, మేనేజర్‌గా కూడా పనిచేశారు. అన్నీ తానై పనిచేసిన ఆ పత్రిక.. స్వాతంత్ర్యానంతర కాలంలో జాతీయ భావాలు నింపిన పత్రిక. ఆ పత్రిక తనకెన్నో పాఠాలు నేర్పిందని అద్వానీ తన ఆత్మకథలో ప్రత్యేకంగా రాసుకున్నారు.
1952లో తొలిసారి అద్వానీ.. అటల్‌జీని కలిశారు. అప్పటికి అటల్‌జీ భారతీయ జనసంఘ్ యువ కార్యకర్తగా పనిచేస్తున్నారు. రాజస్తాన్‌లోని కోటాలో అప్పటికి అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పనిచేస్తున్నారు. భారతీయ జనసంఘ్ పార్టీ ప్రచారం కోసం డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీతో అటల్ తిరిగేవారు. యువరాజకీయ నేతగా ఉన్నప్పుడు అటల్ చాలా సన్నగా ఉండేవారు. ఆ 28 ఏళ్ల వయసుకే ఎంతో పరిణితి చెందిన వ్యక్తిత్వం ఆయనది. అప్పటికే ఆయన ప్రసంగాలు ఎంతో ఉత్తేజపరిచేవి. కవితాత్మక హిందీ భాషపై అటల్‌కి ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. తీవ్రమైన అంశాలపై కూడా చమత్కారంగా, వ్యంగ్యంగా వ్యక్తీకరించగలిగేై గొప్ప సామర్ధ్యం.. అటల్‌ని మహా నాయకుడిని చేశాయి. ఇవే తనపై ఎంతో ప్రభావాన్ని చూపాయని అద్వానీ తన ఆత్మకథలో ప్రత్యేకంగా వివరించారు. ఆనాడే భారతదేశానికి నాయకత్వం వహించగల ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అద్వానీ గుర్తించారు.
1957లో అటల్‌జీ పార్లమెంటుకి ఎన్నికయ్యారు. అప్పుడే ఢిల్లీలో అటల్‌జీకి సహాయపడాల్సిందిగా దీన్‌దయాళ్.. అద్వానీకి పని అప్పచెప్పారు. అప్పటి నుంచి వాజ్‌పేయ్, అద్వానీ స్నేహం పెనవేసుకుంది. జనసంఘ్, తర్వాత బీజేపీ.. ఇలా ప్రతీ రాజకీయ పరిణామ దశలోనూ ఇద్దరూ కలిసికట్టుగా పనిచేశారు. లోక్‌సభలో అప్పటికి జన్‌సంఘ్‌కి సంఖ్యాబలం లేదు. అయినా వాజ్‌పేయి ప్రసంగానికి అధికార, విపక్షమన్న తేడా లేకుండా చప్పట్లు వినిపించేవి. ఒక నాయకుడిగా ఆయన ప్రతిష్ట పెరిగింది. 1968లో దీన్‌దయాళ్‌జీ విషాద మరణం తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు వాజ్‌పేయికి వచ్చాయి. క్లిష్టమైన ఆ పరిస్థితుల్లో పార్టీని విజయవంతంగా నడిపించిన నేత వాజ్‌పేయి. అందుకే కార్యకర్తలు వాజ్‌పేయిని… “అంథేరీ మే ఏక్ చిన్గారీ… అటల్ బిహారీ” అని గౌరవించారని.. అద్వానీ ఆయన రాజకీయ విజయాలను వివరించారు.
1996లో అటల్‌జీ 13 రోజుల ప్రధానిగా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఇది ఓటమిగా ఏనాడు వాజ్‌పేయి భావించలేదు. అందుకే 1998లో విజయవంతంగా అధికారాన్ని చేపట్టగలిగారు. ఈ విజయానికి కారణం వాజ్‌పేయ్ నాయకత్వంపై దేశానికి ఉన్న నమ్మకమే. వాజ్‌పేయి వ్యూహాత్మక ఆలోచనల వల్లే ఎన్‌డీయే ఏర్పాటైందని, ఆ వ్యూహాల్లో తాను భాగమవడం అదృష్టమని అద్వానీ, వాజ్‌పేయి స్నేహాన్నీ వర్ణించారు. వాజ్‌పేయికి ఎవరూ పోటీ కారు. పోటీ లేరు కూడా. అద్వానీకి, వాజ్‌పేయికి మధ్య కొన్ని సందర్భాల్లో అభిప్రాయ బేధాలుండేవి. ఎందుకంటే వారిద్దరీ ఆలోచనలు వేరు. మొదట దేశం, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాత వ్యక్తి ప్రయోజనానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందిన బీజేపీ సిద్ధాంతాలు, ఆదర్శాలు ఇప్పటికీ ఆ నేతలు ఆచరిస్తున్నారు. ఒక్క అడుగుతో మొదలైన బీజేపీ ఈనాడు మహా వృక్షమై దేశం దిశా నిర్దేశం చేస్తోందని అందుకు కారణం.. అటల్‌జీ.
వాజ్‌పేయికి, తనకి ఉన్న స్నేహం గురించి తన ఆత్మకథలో అద్వానీ ఆసక్తికర విషయాలు రాశారు. వారిద్దరూ సినిమాలు బాగా చూసేవారు. ఢిల్లీ రీగల్ థియేటర్లో ఎన్నో సినిమాలు చూశారట. 1970ల్లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసంఘ్ విజయం సాధించలేకపోయింది. కార్యకర్తలంతా నిరాశలో ఉంటే… ఛలో కోయి సినిమా దేఖ్‌నే చల్ తే హై.. అని అద్వానీతో అన్నారట. అలా వాళ్లిద్దరూ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న ఆ సినిమా పేరు రాజ్ కపూర్ నటించిన ఫిర్ సుబహ్ హోగీ. ఇలా వాజ్‌పేయిలో అసలైన ఋషిని తెలుసుకోవాలంటే… అద్వానీ ఆత్మకథ.. నా దేశం జీవితం చదవాల్సిందే.