ఎన్నో అడ్డంకుల తర్వాత మొత్తానికి బజాజ్ అనుకున్నది చేసి చూపిస్తోంది. భారత దేశంలో తొలిసారిగా ఇండియన్ మేడ్ క్వాడ్రా సైకిల్‌ని పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.ఆటో ఇండస్ట్రీలో బజాజ్ కింగ్. ట్రెండ్ సెట్టర్ బైక్స్ పల్సర్, డిస్కవర్, అవెంజర్‌లను పరిచయం చేసిన బజాజ్ ఇప్పుడు క్వాడ్రా సైకిల్ ఇండస్ట్రీలో దిగింది.
ఏమిటీ క్వాడ్రా సైకిల్ ?
ఆటోకి ఎక్కువ, కారుకి తక్కువ క్వాడ్రా సైకిల్. నాలుగు చక్రాలున్నా ఆటో లాంటి కారన్నమాట. చూడ్డానికి చిన్నగా ఉన్నా నలుగురు ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ. ముఖ్యంగా పార్కింగ్ సమస్య మరీనూ. నగరాల్లో హ్యాప్పీగా ప్రయాణించేందుకు అనువుగా క్వాడ్రా సైకిల్‌ని తయారు చేస్తోంది బజాజ్. బైక్ పార్కింగ్‌కి డబుల్ ప్లేస్ ఉంటే చాలు ఈ చిట్టి కారుని పార్క్ చేసేయొచ్చు. ఇలాంటి వాహనాల తయారికి 2018లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతకు ముందు 2102 లోనే ఈ వెహికల్‌ని బజాజ్ కంపెనీ పరిచయం చేసింది. 2016లో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది. అయితే పెద్ద కార్ల కంపెనీల నుంచి భారీగా అడ్డంకులు వచ్చాయి. రెండు నుంచి మూడు లక్షల్లో వచ్చే ఈ క్వాడ్రా సైకిల్ మార్కెట్లోకి వస్తే… తమ కార్ల బిజినెస్‌లకు ఎక్కడ గండి పడుతుందో అని మిగిలిన కంపెనీలు భయపడ్డాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా బజాజ్ అనుకున్నది సాధించింది. ఈ కార్లను కమర్షియల్, డొమెస్టిక్ రెండిటికీ వాడుకోవచ్చు. బజాజ్ ఈ క్వాడ్రా సైకిళ్లలో పెట్రోల్, సీఎన్‌జీ రెండు వర్షన్లు తయారు చేస్తోంది. పెట్రోల్ వర్షన్ రేటు రూ.2.64 లక్షలు. సీఎన్‌జీ అయితే రూ. 2.84 లక్షలు. బజాజ్ కంపెనీ ఈ వెహికల్‌ని 16 దేశాల్లో విడుదల చేస్తోంది. ఒక్క లీటర్ పెట్రోల్ కొడితే చాలు 36 కిలోమీటర్లు రయ్ రయ్‌మని వెళ్తుందని కంపెనీ చెప్తోంది. మాగ్జిమమ్ స్పీడ్ మాత్రం గంటకు 70 కిలోమీటర్లు. అంటే.. బండి ఫుల్ కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. మధ్య తరగతి వాళ్లకు ఈ క్వాడ్రా సైకిల్‌తో… కంఫర్ట్బుల్ జర్నీ సూపరే మరి. ఇంకా వివరాలు కావాలంటే కింద ఈ వీడియో చూడండి.