June 7, 2023

ARTICLE BY పార్థసారథి పోట్లూరి, న్యూస్ ఎనలిస్ట్‌

ఫ్రీడం ఆఫ్ స్పీచ్, ఫ్రీడం ఆఫ్ ప్రెస్ అనే పెద్ద పెద్ద మాటలు బ్రిటన్‌ చెప్తోంది. అసలు వాటి స్పెల్లింగ్‌ కూడా బ్రిటన్‌ మీడియాకు తెలీదు. అసలు BBC ఎలా పుట్టిందంటే...1922 అక్టోబర్ 18 న బ్రిటీష్ బ్రాడ్‌క్యాస్టింగ్‌ కంపెనీ పేరుతో ఒక ప్రైవేట్ వార్తా సంస్థగా BBCస్టార్ట్‌ అయింది. అయితే ఇందులో కేవలం బ్రిటన్‌ పారిశ్రామికవేత్తలకి మాత్రమే షేర్లు కొనే హక్కు ఉండేది. BBC స్థాపించిన మొదట్లో ప్రజల నుండి మద్దతు లభించలేదు కానీ 1926లో బ్రిటన్‌లో జరిగిన సార్వత్రిక సమ్మె మీద ప్రసారం చేసిన రేడియో వార్తలు ప్రజలను ఆకర్షించాయి. దాంతో అదే సంవత్సరం అంటే 1926లో అప్పటి బ్రిటన్ పార్లమెంట్.. బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని పబ్లిక్ ఎంటీటీగా మారుస్తూ బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్‌గా మార్చింది. అప్పటి నుంచి BBC బ్రిటన్ పార్లమెంట్‌కి జవాబుదారిగా ఉంటూ వచ్చింది. అలా అని బ్రిటన్ పార్లమెంట్ BBC మీద పెత్తనం చలాయించలేదు. ప్రతీ 10 ఏళ్లకి ఒక సారి బ్రిటన్ హోమ్ సెక్రటరీ నుండి లైసెన్స్ తీసుకోవాలి BBC. అలాగే ప్రతీ 10 ఏళ్లకి లైసెన్స్‌ని రెన్యువల్ చేసుకోవాలి కూడా. కానీ రాయల్ ఛార్టర్ గీసిన గీత మేరకే BBC నడుచుకోవాలి. ఆ గీత దాటకూడదు. రాయల్‌ చార్టర్‌ నిబంధనల్లో ముఖ్యమైనవి రెండు. అవి వార్తలను పక్షపాతం లేకుండా తగిన ఆధారాలతో తెలియచేయాలి. రెండోది టీవీ ప్రసారాల కార్యక్రమాలు ప్రజలకి అర్ధమయ్యేలా గ్రేట్ బ్రిటన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలి. కానీ BBC అలాంటి నిబంధనలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేసింది. తన అజెండాకి సూట్ అయ్యేవిధంగానే BBC వార్తలుంటాయన్న విషయం ప్రపంచమంతా తెలుసు.

2017 వరకు BBC ఒక ట్రస్ట్ పరిథిలో పనిచేసేది. ఈ ట్రస్ట్‌లో ఒక ఎక్జిక్యూటివ్ బోర్డ్, ఇంకా బ్రిటన్ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉండే రెగ్యులేటరీ బోర్డ్ ఉండేది. ప్రభుత్వ రెగ్యులేటరీ ఆధారిటీ పేరు ఆఫ్కామ్ [Ofcom]. 2016లో బిబిసి ట్రస్ట్ మీద ఒక పరిశీలక బృందం అధ్యయనం చేసింది. అప్పుడు తేలిన విషయం ఏమిటంటే BBC ట్రస్ట్ అంతా లోపాల పుట్ట అని. దాంతో BBC ట్రస్ట్ ని రద్దు చేసి కేవలం బ్రిటన్ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉండే రెగ్యులేటరీ ఆధారిటీకి BBC వ్యవహారాలు అప్పగించారు. అయితే ఇది బ్రిటన్ వరకు మాత్రమే. బ్రిటన్ బయట… మిగతా ప్రపంచం మొత్తం BBC… ట్రస్ట్ నియంత్రణ కిందే పనిచేస్తోంది.

ఈ BBCకి ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది ?

బ్రిటన్‌లో బిబిసి చానెల్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ! ఏడాదంతా SUBSCRIPTION ద్వారా ఆదాయం వస్తుంది. ఇది కాక బిబిసి స్టూడియోస్, బిబిసి స్టూడియో వర్క్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ది గార్డియన్ పత్రిక ఇచ్చిన సమాచారం మేరకు ఏటా 3.2 బిలియన్ పౌండ్ల ఆదాయం BBCకి వస్తుంది. అయితే బిబిసి రూపొందించే ప్రోగ్రామ్స్ కోసం అయ్యే ఖర్చు పెరిగిపోతూ వస్తోంది. మరో వైపు Netflix, ఇతర ఓటీటీల టఫ్‌ కాంపిటీషన్‌ని BBC తట్టుకోలేకపోతోంది. వీటి వలన తన ప్రోగ్రామ్స్ మీద పెడుతున్న ఖర్చులని తగ్గించుకొని బాలన్స్ షీట్ ని అదుపులో ఉంచడానికి ప్రొడక్షన్‌ ఖర్చులను తగ్గిస్తూ వస్తోంది. ఈ ఖర్చుల కోత విలువ మిలియన్స్‌లో ఉంటోంది.

2022 లో బ్రిటన్ ప్రభుత్వం BBC సంవత్సర చందా మీద నిషేధం విధించింది. రెండేళ్ల పాటు అంటే 2022 నుంచి 2024 వరకు BBCకి ఎలాంటి ఆదాయం ఉండదు. ఎలాంటి చందా కట్టకుండానే free to Air ప్రసారాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2027 కల్లా సంవత్సర చందా సిస్టమ్‌నే బ్రిటన్ గవర్నమెంట్‌ ఎత్తేస్తోంది. So ! అంటే ఏమైనా చందాల రూపంలో దండుకుంటే BBCకి ఉన్న సమయం ఈ 2024 నుంచి 27 వరకు అంటే 4 ఏళ్లే.

2022 నుండి 24 వరకు చందా రద్దు చేశారు కాబట్టి 2024 వరకు BBCకి చందాల రూపంలో ఆదాయం రాదు. 2024 నుండి 2027 వరకు అంటే 4 ఏళ్లు మళ్ళీ చందా వసూలు చేసుకోవచ్చు. ఆ తరువాత చందాలే లేవు కనుక.. BBC భవిష్యత్తు కష్టమే. అందువల్లే BBC అటు బ్రిటన్ లోనూ, ఇటు విదేశాలలోనూ ఆదాయాల్లో తప్పుడు లెక్కలు చూపిస్తోంది అనేది ఆరోపణ. తమ ఉద్యోగుల ఇన్స్యూరన్స్ ప్రీమియంనే ఎగ్గొట్టిన ఘన చరిత్ర BBCది. ఇన్ని తప్పుల తడకల BBC పై మన దేశ పన్ను శాఖ సర్వే చేస్తే నొప్పి దేనికి ?

అనైతిక ప్రవర్తన BBCకి కొత్తకాదు?

ఇది ఆ దేశ ప్రముఖులు అన్న మాటే. చాలా కాలంగా బ్రిటన్‌లో BBC మీద ఉన్న అభిప్రాయం ఏమిటంటేఆ సంస్థలో పని చేసే సిబ్బంది ‘లెఫ్ట్ లిబరల్ ‘ అని. ఇది మరీ ముఖ్యంగా బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ ధాచర్ హయాం నుండి వినపడుతున్న విమర్శే. మార్గరెట్‌కి BBC కొమ్ము కాస్తోందని ఏకంగా మార్గరెట్ ధాచర్ పార్టీ సభ్యులే ఘాటు విమర్శలే చేశారు. మరో సంఘటనబ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా వద్దా అనే అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది BBC. చివరికి ప్రజాభిప్రాయం బ్రెగ్జిట్‌కి అనుకూలంగా వచ్చింది. BBC తప్పులు అప్పుడు కూడా బయటపడ్డాయి.

2020లో టిమ్ డేవీని BBCకి డైరెక్టర్ జెనెరల్ గా నియమించినప్పుడు ఆ సంస్థలో మూర్ఖంగా వ్యవహరించే సిబ్బందిని తొలగిస్తాను అని హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే BBCలో పనిచేసే ఉద్యోగులని ఉద్దేశించి మీరు పక్షపాతంగా లేకుండా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. BBC కాలమిస్టులను ఉద్దేశించి టీమ్ డేవీ మరో ఘాటు వ్యాఖ్య చేశాడు. మీరు BBC లో వ్రాసే వ్యాసాల్లో మీ మూర్ఖపు ఆలోచనా సరళిని నింపితే సంస్థను వదిలి వెళ్లిపోండి అన్నాడు. అఫ్కోర్స్ ఇంత ఘాటుగా హెచ్చరించినా వాళ్ళలో మార్పు ఏమీ రాలేదు.

2022 లో రిచర్డ్ షార్ప్ బిబిసి ఛైర్మన్‌ అయ్యాడు. ఆయన కూడా సిబ్బంది ఆలోచనా ధోరణి, వార్తల ప్రెజెంటేషన్‌ బయాస్‌గానే ఉన్నాయని విమర్శించాడు. ఈ రిచర్డ్ షార్ప్ BBC ఛైర్మన్ కాక ముందు ఋషి శునాక్‌కి సలహాదారుగా పనిచేశాడు. బ్రిటన్ లోని కన్జర్వేటివ్ పార్టీ సభ్యులే కాదు లేబర్ పార్టీ సభ్యులు కూడా BBCని విమర్శిస్తారు. 2019 బ్రిటన్ జెనరల్ ఎలెక్షన్స్ టైమ్‌లో అప్పటి లేబర్ పార్టీ చీఫ్ జెరెమి కోర్బిన్ మద్దతు దారులు బహిరంగంగానే BBC వ్యవహార శైలిని విమర్శించారు. BBC నిస్సిగ్గుగా బోరిస్ జాన్సన్ కోసం పనిచేస్తోంది అని అప్పట్లో పెద్ద దుమారమే లేచింది.

పత్రికా స్వేచ్చ- వాక్ స్వాతంత్ర్యం గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్న బ్రిటన్‌తో పాటు యూరప్‌, అమెరికాలు చేస్తున్నది, చేసిందీ ఏమిటి ? ప్రజాస్వామ్యం, పత్రిక స్వేచ్చ,వాక్ స్వాతంత్ర్యం ఇవన్నీ ఎదుటి వారికి చెప్పడానికే, వాటిని ఆ దేశాలు ఏనాడూ పాటించలేదు.

  • G7 దేశాలు RT [Russia Today ] ని తమ దేశాల్లో ఎందుకు నిషేధించాయి? పశ్చిమ దేశాల ప్రయోజనాలకి అనుగుణంగా RT కధనాలు లేవు అన్న కారణంతోనే కదా ? మరి అప్పుడు ఈ పత్రికా స్వేచ్చ, ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ గుర్తుకు రాలేదా?
  • 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 8,000 ట్విట్టర్ అక్కౌంట్లని ఎందుకు బ్లాక్ చేశారు ఎందుకు? అవి రష్యాకి అనుకూలంగా ఉన్నాయనే కదా ? మరి ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఏమయింది ?
  • జర్మనీ ఎందుకు 17 మంది జర్నలిస్టు లని తొలగించింది ? వీళ్ళు అందరూ కూడా జర్మనీ లోని ప్రముఖ పత్రికలకి పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్టులే ! ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఎక్కడికి పోయింది ? రష్యాకి అనుకూలంగా వార్తలని వ్రాస్తున్నారు అనే నెపం తోనే కదా వీళ్ళని తొలగించింది ?
  • పులిట్జర్ అవార్డ్ గ్రహీత, ఒకప్పుడు ప్రజాస్వామ్య హీరోగా కీర్తించిన జర్నలిస్ట్ సేమో ఉర్ హెర్ష్ అనే జర్నలిస్ట్ ఏమయ్యాడు ? పత్రికా స్వాతంత్ర్యంకి ప్రతీక, హీరో అని కీర్తించబడ్డ హేర్ష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నిజాలు వ్రాసినందుకు కనిపించకుండా పోయాడా? బాల్టిక్ సముద్రంలో రష్యా నుండి జర్మనీ కి నాచురల్ గ్యాస్ సరఫరా చేసే నోర్డ్ స్ట్రీమ్ పైపు లైన్ ని పేల్చింది అమెరికా అని, కానీ దీనిని అమెరికా రష్యా మీదకి నెట్టింది అని నిజాలు బయటపెట్టినదుకు హేర్ష్ ని బహిష్కరించింది ఈ మధ్య బయటపడిన నిజమే కదా ?
  • నిజాలు బయటపెట్టినందుకు జూలియస్ అసాన్జెని ఎందుకు ఇన్నాళ్ళూ జైల్లోనేఉంచారు ? ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది అవుతుంది కానీ సమాధానాలు దొరకవు.

అసలు భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ఏళ్ల తరబడి విచారించి భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద మోపిన అభియోగాలకి ఎలాంటి ఆధారాలు లేవని, నరేంద్ర మోడీ నిర్దోషి అని తీర్పు చెప్పాక కూడా మళ్ళీ మళ్ళీ అదే హాఫ్ బేక్డ్ ప్రచారాలని ప్రసారం చేస్తోంది BBC. అలాంటి ఛానెల్‌ మన దేశానికి అవసరమా? ఇది ప్రస్తుతం చాలా మంది భారతీయుల ప్రశ్న.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *