డై హార్డ్… హాలీవుడ్ సూపర్ సక్సెస్ సినిమాల సీరీస్. బ్రూస్ విల్లీస్ హీరోగా నటించిన ఆ సినిమాలు బాక్సాఫీస్ హిట్లు. ఆ సీరీస్‌లో నాలుగో భాగం డై హార్డ్ 4.0. ఇందులో విలన్ అమెరికాలో ఉన్న అన్ని వ్యవస్థలను హ్యాక్ చేస్తాడు. ఆఖరికి ట్రాఫిక్ లైట్లతో సహా అంతా ఒక చిన్న కంటైనర్‌లో కూర్చుని కంట్రోల్ చేస్తాడు. అతని అసలు ఉద్దేశం అమెరికా పవర్ గ్రిడ్‌ని కంట్రోల్ చేయడం. ఆ సమయానికే హీరో ఆ విలన్ ఎత్తుని చిత్తు చేస్తాడు. పవర్ గ్రిడ్‌ని కంట్రోల్ చేస్తే ఇంకేముంది నగరమంతా చీకటిలోఉంటుంది. అలాగే నగరంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయి. సరిగ్గా ఇలాగే చైనా మన దేశం మీద పంజా విసిరిందని అనుమానాలు బయటపడుతున్నాయి. యుద్ధ కాంక్ష, అధికార మదం ఈ రెండూ తప్ప చైనాకి వేరే పనేలేదు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్పీడు చైనాకు ప్రాణ సంకటంగా మారింది. చైనా సరుకు లాగే ఆ దేశం మీద కూడా ఎవరికీ నమ్మకం లేదు. వేరే గతిలే పాకిస్తాన్ మాత్రమే ఆ దేశానికి జీ హుజూర్ అంటోంది.
అసలు విషయమేంటంటే.. బోర్డర్‌లో చైనా కాలుదువ్వుతోంది. అదంతా సరిహద్దు వివాదం. చైనా అక్కడితో ఆగలేదు. మన నగరాల్లోకి కూడా సైబర్ చొరబాట్లు మొదలు పెట్టింది. గత ఏడాది తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా చేసిన రచ్చ తెలిసిందే. కొన్ని నెలల పాటు రెండు దేశాల మధ్య ఆ వేడి రాజుకుంటూనే ఉంది. ఆ సమయంలో చైనా మన పవర్ సెక్టార్‌పై గురి పెట్టిందని షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చైనా మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూపులు చాలానే ఉన్నాయి. ఆ గ్రూపు సహాయంతో మన విద్యుత్ సంస్థల కంప్యూటర్ నెట్‌వర్క్‌లు. లోడ్ డిస్పాచ్ సెంటర్లను హాక్ చేసినట్టు అనుమానాలున్నాయి. అమెరికాకి చెందిన ఓ సంస్థ చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం బయటపడింది. గత ఏడాది అక్టోబర్ 12న ముంబయ్‌లో చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అయింది. చాలా ప్రాంతాల్లో రైళ్లు కూడా చాలా సేపు ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రోజంతా కరెంట్ లేదు. ఈ కరెంట్ కట్‌కి, చైనా బోర్డర్ డిస్ప్యూట్‌కి సంబంధం ఉందని అమెరికాకి చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ చెప్తోంది. సరిహద్దు వివాదంలో భారత్ వెనక్కు తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందన్న హెచ్చరికలో భాగంగానే చైనా సైబర్ అటాక్ చేసిందిని ఆ సంస్థ చెప్తోంది. అదే జరిగితే.. అమ్మో ఊహించుకోడానికే భయమేస్తోంది. చైనా హ్యాకర్లు పవర్ సప్లై సెంటర్లలో 21 ఐపీ అడ్రస్‌లను హ్యాక్ చేసినట్టు ఆ సంస్థ వివరించింది. గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత ఈ అనుమానాలు భారత ప్రభుత్వానికీ వచ్చాయి. చైనాలో తయారయ్యే విద్యుత్ పరికరాల్లో మాల్ వేర్ ఉన్న అంశంపై తనిఖీలు పెంచాలని సెంట్రల్ పవర్ మినిస్టర్ ఆర్.కె.సింగ్ ఓ సారి అన్నారు. ఆయన ఆ మాట అన్న కొన్ని నెలలకే గ్రిడ్ ఫెయిల్ కావడం సీరియస్ విషయమే.
అత్యంత కీలకమైన పవర్, టెలికామ్ రంగాల్లో వనరుల కోసం భారత్ ఎక్కువగా ఇంపోర్ట్స్‌పైనే ఆధారపడుతోంది. ఇది ఎప్పటికైనా ప్రమాదనమే. పైగా వాటిలో ఆ వంకర చైనా పరికరాలే ఎక్కువ. భారత్‌లో వాడే రూటర్లతో ఎక్కువ చైనావే. అందుకే వారు సులువుగా హ్యాకింగ్ చేయగలుగుతున్నారు. ఎప్పటికైనా ఇవన్నీ కొంప ముంచే విషయాలే. ఈ రోజుల్లో అల్లకల్లోలం సృష్టించాలనే ఆయుధాలు, యుద్ధాలు అవసరం లేదు. ఒక్క కంప్యూటర్, ఇంటర్‌నెట్ చాలు. ఇలాంటి విషయాల్లో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చైనా నుంచి వచ్చే ప్రతీ వస్తువుకి సీక్రెట్ ఐ ఉంటుందనే అనుకోవాలి.