May 30, 2023

మరి రజనీ నుంచి ‘శంకరాభరణం’ వస్తుందా?

మరి రజనీ నుంచి ‘శంకరాభరణం’ వస్తుందా?

దర్బార్‌ గురించి ఏవేవో రివ్యూలు రాశారు. మురుగదాస్‌ ఏంటి ఇలా తీశాడని కొందరు, రజనీ స్టైల్స్‌ తప్ప ఇంకేమీ లేదని కొందరు. రజనీ నుంచి దర్బార్‌ లాంటి సినిమా కాకుండా శంకరాభరణం వస్తుందా? రజనీ మూవీ అంటేనే ఫ్యాన్స్‌ మూవీ. కథ గురించి ఆలోచించేవాళ్లు తక్కువ. వెళ్లామా, చూశామా, నాలుగు విజిల్స్ వేశామా, ఆ రెండు గంటలు ఎంజాయ్‌ చేశామా లేదా అన్నదే పాయింట్‌. ఒక్కొక్కరికీ ఒక్కో క్రేజ్‌ ఉంటుంది. ఆ క్రేజ్‌కే జనం నీరాజనాలు పడతారు. దర్బార్‌ లాంటి సినిమా కమల్‌ చేస్తే చూడగలమా? స్వాతిముత్యమో, శంకరాభరణమో రజనీ చేస్తే చూస్తామా? ఆ మధ్య ఎప్పుడో కుచేలుడు అనే సినిమాలో రజనీ మంచి క్యారెక్టర్‌ వేశాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రజనీ, చిరు లాంటి హీరోలు పీక్స్‌లో ఉన్నప్పుడు తమలో నటులను సంతృప్తి పరుచుకోడానికి చేసిన ఆర్ట్‌ ఫిల్ములు ఏవీ హిట్‌ అవలేదు. చిరు వెండితెరను ఏలుతున్న సమయంలో రుద్రవీణ అనే అద్భుతమైన సినిమా చేశారు. అది క్లాసిక్కే, జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. కానీ అప్పట్లో జనం చూడలేదు. కమర్షియల్‌గా ఆడలేదు. ఆ తర్వాత యముడికి మొగుడు వచ్చింది. ఫలితం తెలిసిందే. సూపర్‌ డూపర్‌ హిట్‌. ఆ తర్వాత చిరంజీవి చాలా ఏళ్లు ప్రయోగాల జోలికి వెళ్లలేదు. చిరంజీవి అంటే డ్యాన్సులు ఫైట్లు ఉండాల్సిందే. అలాగే రజనీ కూడా స్వామి రాఘవేంద్ర లాంటి సినిమాలు తీశారు ఫ్యాన్సే చూడలేదు. రజనీ అంటే స్టైల్‌, వెండితెర మీద గోల ఉండాల్సిందే. కబాలి ట్రైలర్లో ఉన్న స్పీడు, సినిమాలో లేదు అందుకే అది ఫ్లాప్‌. కాలా కూడా అంతే. బాషా, నరసింహల్లో కూడా అదిరిపోయే కథలేమీ లేవు. అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చూసిన కథలే. కాకపోతే అక్కడ ఫ్లేవర్‌ రజనీ. చిరు, రజనీ, అమితాబ్‌ లాంటి వాళ్లు సిల్వర్‌ స్క్రీన్‌పై పవర్‌ ప్లే చూపించేస్తారు. అంటే పక్కన ఎవరున్నా మన దృష్టి హీరో మీద మాత్రమే ఉంటుంది. వాళ్ల పక్క విశ్వ సుందరీమణులు ఉన్నా వృధా. అంతటి సమ్మోహన శక్తి ఉంది కాబట్టే వాళ్లు మెగా స్టార్లయ్యారు. దర్బార్‌ గురించి చెప్పాలంటే తమిళ అభిమానులకు రజనీ.. పొంగల్‌ని వారం ముందే తెచ్చేశారు. ముందు వచ్చిన పేట తమిళనాడులో బాగానే ఆడింది. కానీ రజనీ స్టైల్స్‌ని పూర్తి స్థాయిలో చూపించిన సినిమా అయితే కాదు. అరివీర రజనీ ఫ్యాన్‌ అయిన మురుగదాస్‌… తనకు రజనీ మీద ఉన్న అభిమానమంతా ఈ సినిమాలో చూపించేశాడు. ఏ డైరెక్టర్‌ అయినా రజనీతో సినిమా మొదలు పెట్టాక ఆయన సమ్మోహనానికి వశమైపోవాల్సిందే. ఆ మధ్య శంకర్‌ తీసిన శివాజీ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఫస్ట్‌ ఆఫ్‌ వరకు శంకర్‌ సినిమా, సెకండాఫ్‌ రజనీ సినిమా అయిపోయింది. అందుకే ఆ సినిమా అంతగా ఆడలేదు. రజనీకి సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఇచ్చిన కేఎస్‌ రవి కుమార్‌ కూడా వయసు పైబడిన రజనీని ఎలా చూపించాలో అర్థం కాక లింగా లాంటి దారుణమైన ఫ్లాప్‌ ఇచ్చాడు. రజనీకి బాషాలాంటి ట్రెండ్‌ సెట్టర్‌ని ఇచ్చిన సురేష్‌ కృష్ణ బాబా లాంటి అట్టర్‌ ఫ్లాప్‌ ఇచ్చారు. నరసింహా, బాషాలు రజనీ స్టైల్‌తో ఆడాయి. అదే డైరెక్టర్లు తీసిన బాబా, లింగాలు రజనీలో కొత్త కోణాన్ని చూపించాలనే ప్రయత్నంలో బెడిసికొట్టాయి. అంటే రజనీని రజనీలా మాత్రమే చూపించాలన్నది ఫార్ములా. అదంతే.. అంతకన్నా ఏదో చేస్తే మాత్రం రజనీ సినిమాకు విజిల్స్‌ పడవు. ఫ్యాన్సే ఒప్పుకోరు. కనుక.. అందువల్ల.. అందు చేత.. రజనీ స్టైల్స్‌ ఇష్టపడే వారికి దర్బార్‌ ఓ ఫీస్ట్‌. ముఖ్యంగా తమిళనాడులో దర్బార్‌ దుమ్ములేపుతోంది. ఈ వయసులోనూ రజనీ కలెక్షన్ల దుమ్ము లేపుతున్నాడంటే… అది రికార్డే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *