12 ఏళ్లకోసారి తిరుమలలో జరిగే అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణ సమయంలో తిరుమలేశుని దర్శనాలు నిలిపివేస్తున్నామన్న TTD నిర్ణయానికి భక్తుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో మంగళవారం TTD పాలక మండలి సమావేశమైంది. మహా సంప్రోక్షణ జరిగే ఆగస్ట్ 11 నుంచి 16 వరకు అంటే రోజులు దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు నిర్ణయించింది. గత నిర్ణయాన్ని సడలిస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. పరిమిత సంఖ్యలో భక్తులను, అదీ నిర్దేశిత సమయంలోనే దర్శనాలకు అనుమతిస్తామని, ఆ పరిమిత సంఖ్య ఎంతనేది ఓ రెండు రోజుల్లో తెలియ చేస్తామని టీటీడీ పాలక మండలి ఛైర్మన్ సుధాకర్ యాదవ్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. పరిమిత సంఖ్యలో అనుమతించిన భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. గతంలో తీసుకున్న దర్శనాల నిలిపివేత నిర్ణయంపై TTD… భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. 33 శాతం భక్తులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు, 8 శాతం మంది ఆ రోజుల్లో దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలని తెలిపారు. TTD నిర్ణయానికి అనుకూలంగా 22 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారని ఈవో సింఘాల్ వివరించారు. ఆ 6 రోజుల్లో పరిమిత దర్శనాలు మినహా… VIP దర్శనాలు సహా అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.
ఈ మధ్య జరిగిన ఎన్నో సంఘటనలతో టీటీడీ పాలక మండలిపై భక్తుల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహా సంప్రోక్షణ పేరుతో టీటీడీ తీసుకున్న దర్శనం నిలిపివేత నిర్ణయంపై సహజంగానే అనుమానాలు మొదలయ్యాయి. అందులోనూ సీసీటీవీలనూ అపేస్తామనడం, ఆ రోజుల్లో కొండపైకి భక్తులను రానీయ్యమని చెప్పడం… వివాదాస్పదమైంది. ఇప్పటికే తిరుమలలో ఏదో జరుగుతోందన్న సందేహాల మధ్య.. మహా సంప్రోక్షణ పేరిట తీసుకున్న నిర్ణయాలు అసంబద్ధంగా ఉన్నాయని భక్తులు సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ చేశారు. 2006లో కూడా మహ సంప్రోక్షణ సమయంలో ఇలాంటి అవాంతరాలు లేవు. ఆ సమయంలోనూ రోజుకు సుమారు 30 నుంచి 40 వేల మంది భక్తులు దర్శనాలకు వచ్చేవారు. ఇప్పుడు భక్తుల రద్దీ పెరిగిన మాట వాస్తవమే. కానీ, మొత్తం ఆలయానికే రావద్దనడం.. దానికి ఆగమ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకోడం విచిత్రంగా ఉంది. దర్శనాలు నిలిపేస్తామన్న నిర్ణయాన్ని భక్తులే కాదు.. తిరుమల ప్రజలు కూడా వ్యతిరేకించారు. ఇప్పటికీ పరిమిత సంఖ్యలో భక్తుల అనుమతి అన్నారు. ఎంతమందిని అనుమతిస్తారో ఎల్లుండో, అవతలినాడో చెప్తారు. అంత వరకు వేచి చూడాలి.