June 7, 2023

భయాన్ని కాదు భవిష్యత్తుపై ధైర్యాన్ని పెంచండి !

భయాన్ని కాదు భవిష్యత్తుపై ధైర్యాన్ని పెంచండి !

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది నిజమే. ఇన్నాళ్లు టెక్నాలజీ టెక్నాలజీ అంటూ మనిషిని మించిన వాడు ఈ లోకంలోనే విర్రవీగిన వాడికి తేరుకోలేని ఝలక్‌ ఇచ్చింది కరోనా. కంటికి కనిపించని ఓ సూక్ష్మ క్రిమిని చంపలేకపోతున్నాడు మనిషి. దేవుడు లేడన్న వాడు ఈ రోజున ఆ దేవుడి మీద భారం వేసి తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చున్నాడు. వైద్యరంగాన్ని ఎప్పుడూ ప్రయారిటీగా తీసుకోని ప్రభుత్వాలు ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక లాక్‌డౌన్‌ లాక్‌డౌన్‌ అంటున్నాయి. లాక్‌డౌన్‌ అంటే ఫర్వాలేదు.. కానీ కరోనాని మనం జయించగలం అనే ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. జనాల్లో భయాన్ని పెంచుతున్నాయి. ఇప్పుడు పెంచాల్సింది భయాన్ని కాదు. ధైర్యాన్ని. ఆ పని ఎవరూ చేయడం లేదు. బతికుంటే చాలు అని ప్రభుత్వాలే అంటుంటే… ప్రజల్లో ఇక ధైర్యం ఎలా ఉంటుంది. లాక్‌డౌన్‌ పద్మవ్యూహం నుంచి బయటపడేదెప్పుడు? అని ప్రశ్నిస్తే ప్రభుత్వాల దగ్గర నో ఆన్సర్‌. ఆన్సర్‌ లేకపోయినా ఫర్వాలేదు. మళ్లీ మనం మునుపటి జీవితాల్లోకి వెళ్తాం… ధైర్యంగా ఉండండి అన్న స్లోగన్‌ ఏ నాయకుడి నుంచి వినిపించడం లేదు. ప్రజలందరి మీదా కరోనా మానసికంగా ఎప్పుడో దాడి చేసింది. ఇప్పుడు అందరి మనసులో కరోనానే. నిజంగా కరోనా సోకిన బాధ కంటే.. ఈ సైకలాజికల్‌ ఫీలింగ్‌ చాలా ప్రమాదకరమైనది. బాధకు మందులున్నాయి. మానసిక బాధలకు మందుల్లేవు. ప్రజల ఆరోగ్యాల కన్నా రాజకీయాల మీదే మన దేశంలో ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది. దాని ఫలితమే ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇక మీడియాలో కూడా కరోనా వార్తలు చూస్తుంటే లేని పోని భయాలు సృష్టిస్తున్నట్టే కనిపిస్తోంది. ప్రపంచాన్ని కరోనా కబళించేసింది. ఇక ఏం లేదు అన్నట్టే వార్తలు ఇస్తున్నారు. ఇది ప్యానిక్‌ కాదా? లాక్‌డౌన్ తప్ప వేరే దారిలేదు, లాక్‌డౌన్‌ ఇంకా పొడిగిస్తారు ఇవే వార్తలు. ప్రభుత్వాలే చెప్పి ప్రజలను మానసికంగా సిద్ధం చేయిస్తున్నాయా? లేదా ఛానెల్స్‌ ఊహించి రాసేస్తున్నాయో తెలీదు. సోషల్‌ మీడియా సంగతి సరేసరి. మనిషి చాలా శక్తిమంతుడు. దేన్నైనా తట్టుకోగలడు. ప్లేగ్‌ని తట్టుకున్నాడు, స్పానిష్‌ ఫ్లూని తట్టుకున్నాడు, మలేరియా లాంటి ఘోరమైన వ్యాధులను తన్ని తరిమేశాడు. అలాంటిదే ఈ వైరస్‌ కూడా. నిజానికి ఈ వైరస్‌ వల్ల చనిపోయిన వారిలో 70 శాతం కన్నా ఎక్కువ వృద్ధులే. ఆ వృద్ధుల్లోనూ ఇతర వ్యాధులు ఉండడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్‌ అయ్యారు. 50 ఏళ్ల లోపు వారు ఈ వ్యాధి సోకినా చనిపోయింది కేవలం నాలుగు శాతం. ఇన్ఫెక్షన్‌ అనేది కామన్‌. మామూలుగా జ్వరం వచ్చినా మూడు రోజులు ఉంటుంది. కరోనా 14 రోజులు ఉంటుంది. ఇంకాస్త ముదిరితే 28 రోజులు ఉంటుంది. ఇన్ఫెక్షన్‌ ఉన్నా ఇంట్లోనే సరైన చికిత్స చేసుకుని కరోనా నుంచి బయటపడినవారు ఉన్నారు. ఆ స్టోరీలు ఎందుకు ఇవ్వడం లేదు? యువతని ఈ కరోనా ఏమీ చేయలేకపోతోంది అన్న స్టోరీలు ప్రభుత్వం ఎందుకు సరిగ్గా ప్రచారం చేయడం లేదు? కరోనాకి ప్రభుత్వాలే భయపడిపోతే.. ఇక ప్రజలు ఏం కావాలి? ప్రభుత్వాలూ ధైర్యంగా ఉండండి. కరోనా మనల్ని ఏమీ చేయలేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు… “ధైర్యం క్యాన్సర్‌ ఉన్నోడిని కూడా ఏమీ చేయలేదు, భయం అల్సర్‌ ఉన్నోడిని కూడా చంపేస్తుంది”. ఈ డైలాగ్‌లో మనం మొదటిది తీసుకుందామా? రెండోది తీసుకుందామా? మనిషి ధైర్యంగా ఉంటే శరీరంలో విడుదలయ్యే రోగనిరోధకాలు వేరు. భయం ఉంటే మనిషి సగం ఛస్తాడు. ఇక రోగనిరోధకాలు ఏం పనిచేస్తాయి? కరోనా కన్నా బతుకు భయమే ఎక్కువగా ఉంది. వాటి మీద ప్రభుత్వాలు ధైర్యాన్ని ఇవ్వాలి. అలాంటివేవీ లేవు. మళ్లీ జనం రోడ్ల మీదకు వస్తేనే రాష్ట్రాలు నడుస్తాయి. లేకపోతే రాష్ట్రాలు కూడా దుకాణాలు మూసుకోవాల్సిందే. కరోనాకు ఫాస్ట్‌ సొల్యూషన్‌ కావాలి. ఇప్పటికి ఇండియాలోకి వ్యాధి వచ్చి నెల రోజులు దాటిపోయింది. ఇదేం తక్కువ సమయం కాదు. ఒక్క నెల అటూ ఇటు అయితే ప్రభుత్వమే ఫుల్‌ శాలరీలు ఇవ్వలేకపోయింది. కనుక నెల రోజులు అంటే చాలా చాలా ఎక్కువ సమయమే అనుకోవాలి. అమెరికా చెయ్యలేకపోతోంది కదా, ఇటలీకి కూడా చేతకావడం లేదు కదా.. అనొచ్చు. అంటే వాళ్లు పరిష్కారం కనిపెట్టేవరకు మనం ఏమీ చేయొద్దా? మనకంటూ ఓ ప్లాన్‌ ఉండాలి కదా? భారతీయుల్లో ఓ ప్లస్‌ పాయింట్‌… ధైర్యం నింపితే ప్రతీ ఒక్కడూ హనుమంతుడే. ఆ ధైర్యమే మనకు శ్రీ రామ రక్ష. అందుకే వ్యాక్సీన్‌లు మందులు లేకపోయినా… కనీసం ధైర్యాన్ని అయినా ఇంజక్ట్ చేయండి. బతికుంటే చాలు, రెండు పూటలు తినేది ఓ పూట తినండి.. ఇలాంటి నెగటివ్‌ థింకింగ్‌ని ఇంజక్ట్ చేయడం… ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి మాటలు వ్యాధి కన్నా మనోవ్యాధిని పెంచుతాయి. మనో వ్యాధి క్యాన్సర్‌ కన్నా ప్రమాదం.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *