May 30, 2023

కమల దళానికి ఎదురు లేదు

కమల దళానికి ఎదురు లేదు

కాంగ్రెస్‌ అంతో ఇంతో ఆశపెట్టుకున్న మహారాష్ట్రలోభారతీయ జనతా పార్టీ దూసుకుపోయింది. ఎవరు ఎన్ని అనుకున్నా సరే… ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకే. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. సాకులు చెప్పే ప్రభుత్వాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. సూటిగా సుత్తి లేకుండా నిర్ణయాలు తీసుకునే నాయకుడికే ప్రజలు పట్టం కడుతున్నారు. మోదీ అవినీతి మరక లేకుండా సెకండ్ టెర్మ్‌ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనలో బలమైన నాయకుడిని ప్రజలు చూశారు. 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనం, కాంగ్రెస్‌పై వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చాయి. కానీ 2019లో కూడా ప్రజలు మోదీని నమ్మారు. గత ఐదేళ్లలో మోదీ పాలనపై విమర్శలు లేవా అంటే ఉన్నాయి. నిర్ణయాలపై కొన్ని వ్యతిరేకతలూ ఉన్నాయి. కానీ… దేశానికి బలమైన నాయకత్వం అసవరం. నిర్ణయాల్లో ధైర్యం అవసరం. ఆ రెండూ ఇప్పుడున్న కాంగ్రెస్‌ నాయకుల్లో లేవని ప్రజలు నమ్మారు. ముఖ్యంగా దేశ రక్షణ ప్రాధమిక అంశం. ఆ విషయంలో మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం. ప్రభుత్వం, పరిపాలన మోడల్‌ మార్చి వాటికి మోడ్రన్‌ థింకింగ్‌ చేసిన నాయకుడు మోదీ. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. దేశంలో చాలా సమస్యలూ ఉన్నాయి. వాటికి సొల్యూషన్స్‌ మోదీ ఇస్తారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్‌, యూపిఏ ఈ ప్రభుత్వాలు ఉన్నన్నాళ్లు కూడా కొంత మంచి జరిగింది. కానీ అవినీతి చాలా ఎక్కువగా జరిగింది. నాయకుల్లో సమర్థత కరువైంది. రాహుల్‌ని ఇప్పుడప్పుడే భారతీయులు నమ్మే పరిస్థితి లేదు. రాహుల్‌నే కాదు కాంగ్రెస్‌లో ఉన్న ఏ వృద్ధ నాయకుడిని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ చాలా మారాలి. నేటి తరానికి తగ్గట్టుగా పార్టీ మారాలి. కానీ ఆ పార్టీలో అలాంటి సంకేతాలేవీ లేవు. కనీసం యూత్‌ని ఆకట్టుకునే చర్యలు అసలు లేవు. అలాంటప్పుడు కాంగ్రెస్‌ని ఎలా యువత నమ్ముతారు. ఆర్థికంగా ప్రపంచమే మందగమనంలో ఉంది. అలాంటి మందగమనంలో కూడా ఇప్పటి ప్రభుత్వం ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తోంది. మోదీ భరోసాని ప్రజలు నమ్ముతున్నారు. లేకుంటే మహారాష్ట్రలో ఈ విజయం సాధ్యం కాదు. కాంగ్రెస్‌ కూటమి తమ ట్రెండ్‌ని మార్చుకోనంత కాలం ఇలాంటి ఫలితాలు తప్పవు. దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరని ఆలోచిస్తే కాంగ్రెస్‌లో ఒక్కరూ కనిపించరు. ఇందుకు కారణం కూడా కాంగ్రెస్సే. అప్పట్లో పీవీ నరసింహరావు లాంటి ఉద్ధండులు కనిపించిన కాంగ్రెస్‌లో ఇప్పుడు ఒక బలమైన నాయకుడే కనిపించడం లేదు. ఇప్పటికీ అవే జీ హుజూర్‌ రాజకీయాలు. దేశంలో యువ ఓట్లు కోట్లలో పెరిగాయి. మీడియా విస్తృతి పెరిగింది. క్షణక్షణం రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు స్మార్ట్‌ ఫోన్స్‌లో తెలిసిపోతున్నాయి. యువతలో రాజకీయ వార్తల పరిణితి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలు చెల్లవని ప్రజలు చెప్తున్నారు. దేశానికి, యువతకు తగ్గ ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నారు.అందుకే ఇప్పుడప్పుడే భారతీయ జనతా పార్టీకి ఎదురు లేనట్టే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *