చాలా రోజుల నుంచి నలుగుతున్న తిరుమల మహా సంప్రోక్షణ సమయం వచ్చింది. తిరుమలలో మహా సంప్రోక్షణం, భక్తుల కట్టడి అనగానే ఎందుకు వివాదం వచ్చిందంటే…. తిరుమల వేంకటేశుడు అర్చా మూర్తి. అంటే స్వయం వ్యక్త మూర్తి. ప్రపంచంలో ఇలాంటి స్వయంభూ విగ్రహం మరోటి లేదు. అలాంటి స్వయం వ్యక్త మూర్తికి నిజానికి సంప్రోక్షణ అవసరం లేదట. అయితే తిరుమల చరిత్రలో ఎన్నెన్నో మార్పులు జరిగాయి. రామానుజుల వారు తిరుమలలో కైంకర్యాలన్నీ వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించాలని నిర్దేశించారు. అప్పటి నుంచి వైఖానస ఆగమం ప్రకారం సంప్రోక్షణ నిర్వహిస్తూ వస్తున్నారు. 12 ఏళ్లకు నదీ సంరక్షణ కోసం చేసే పుష్కరాలు ఎలాగో… ఈ మహాసంప్రోక్షణా అలాంటిదే. కొన్ని చోట్ల ఈ సంప్రోక్షణనే కుంభాభిషేకం అని కూడా అంటారు. ఈ శనివారం అంకురార్పణతో మొదలై ఆగస్ట్ 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతీ పన్నెండేళ్లకోసారి బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మహా సంప్రోక్షణ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఈ వివరాలతో పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకుందాం.
11వ తేదిన అంకురార్పణ….మహా సంప్రోక్షణ కార్యక్రమం అన్ని ఆలయాల్లోనూ జరుగుతుంది. అలాగే తిరుమల ఆలయంలోనూ సంప్రోక్షణ జరుగుతోంది. తిరుమలలో ఇంకెక్కడా లేని విధంగా స్వామి వారు అర్చా మూర్తిగా స్వయంభువుగా వెలిశారు. స్వయంభువు మూర్తికి ఆగమోక్తంగా ఈ వైదిక కార్యక్రమం జరుగుతుంది. ఋత్వికులు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆవు పాలు, నెయ్యి, పంచకం, పేడ, పెరుగుతో పంచగవ్య ఆరాధన చేస్తారు. ఆ కార్యక్రమం అనంతరం అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణం తర్వాత శ్రీవారి ఆలయంలో పాత కళ్యాణోత్సవ మండపంలో 28 యజ్ఞ కుండలాలు ఏర్పాటు చేస్తారు. బ్రహ్మోత్సవాల విధివిధానాల లాగే.. ఈ అంకురార్పణకూ విష్వక్‌సేనులు తిరువీధుల్లో ఊరేగి మహా సంప్రోక్షణకు దేవతలను ఆహ్వానిస్తారు.
12వ తేదీన ఏం జరుగుతుందంటే…? అంకురార్పణ జరిగిన తరువాత బాలాలయ వైదిక క్రతువు ప్రారంభమవుతుంది. అంకురార్పణ మర్నాడు యాగశాలలో ఏర్పాటు చేసిన 28 కుండలాలను శుద్ధి చేసి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ఆ తర్వాత నూతన యాగశాలలో వాస్తు హోమాం నిర్వర్తిస్తారు. శ్రీ వారి ఆలయంలో మూల విరాట్టుకు నిత్యపూజలు నిర్వహించి.. ఆ తర్వాత యాగశాలలో అగ్నిప్రతిష్ఠ చేస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి మూలవిరాట్టులో వున్న దైవిక శక్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ విధానాన్ని కళాకర్షణ అంటారు. మూల విగ్రహంలో 38 కళలుంటాయి. మూల విరాట్టులో ఒక్కో అవయవంలో ఒక్కో కళ, ఒక్కో దేవత కొలువై ఉంటారు. ప్రతిష్ఠ సమయంలో విగ్రహంలో ఆ కళలను ఆవాహనం చేస్తారు. సంప్రోక్షణ సమయంలో ఆ కళలను కుంభంలో ఆవాహన చేస్తారు. గర్భాలయంలో వున్న ఉత్సవ మూర్తులను కూడా యాగశాలకు తరలిస్తారు. అప్పటి నుంచి సంప్రోక్షణ పూర్తయ్యే వరకు.. ఆ కుంభమే.. స్వామివారు. యాగశాలే బాలాలయం.
13వ తేదీన ఏం చేస్తారంటే..? 13వ తేదీన బాలాలయంలో ఉదయం 6 నుంచి12 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు పారాయణలు, హోమాలు నిర్వహిస్తారు. అష్టబంధనకు ఉపయోగించే వస్తువులు, ద్రవ్య పదార్థాలను శుద్ధి, పుణ్యాహవచనం చేస్తారు. ఏమిటీ అష్ట బంధనం..? సాధారణంగా ఆలయాల్లో మూర్తులను ప్రతిష్ఠించేటప్పుడు విగ్రహాన్ని పీఠానికి గట్టిగా బిగించేందుకు 8 రకాల ద్రవ్యాలు వినియోగిస్తారు. ఆ ద్రవ్యాలతో చేసిన పదార్ధాన్ని విగ్రహానికి, పీఠానికి మధ్య కూర్చి కదలకుండా చేస్తారు. ఈ విధానాన్నే అష్ట బంధనం అంటారు. అష్ట బంధనం పట్టు లేదా శక్తి 12 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ అష్టబంధనం చేయాలి. ఆ 8 రకాల పదార్థాలు ఏంటంటే… తేనే, మైనం, ఎర్రమట్టి, పత్తి గింజలు, నల్లబెల్లం, అరటి పళ్లు, నెయ్యి, శంఖం పొడి, చక్కెర. వీటిని నిర్దేశిత పాళ్లలో కలిపి.. రోకలితో దంచి.. ఆ వచ్చిన సన్నటి పాకాన్ని విగ్రహానికి, పీఠానికి మధ్య కూరుతారు. రోట్లో ఈ ఎనిమిది పదార్థాలను దంచే విధానాన్ని శత బంధనం అంటారు. అదే మూకుడులో వేడిచేస్తే ఉష్ణ బంధనం అంటారు. అర్చా మూర్తులు, ఋషులు ప్రతిష్ఠించిన విగ్రహాలకు, స్వయంభు విగ్రహాలకు శత బంధనం చేస్తారు. అంటే మూల విరాట్టు విగ్రహానికి మరమ్మత్తులన్నమాట. ఈ మహా సంప్రోక్షణ కేవలం తిరుమల శ్రీనివాసుడి గర్భాలయానికి మాత్రమే కాదు. గరుడాళ్వార్, శ్రీవారి విమానం, పడి, ప్రసాద పోట్లలో ఉన్న తాయర్లు, వరద రాజ స్వామి, విష్వక్సేన, యోగ నరసింహ స్వామి, వేణు గోపాల స్వామి, బేడీ ఆంజనేయ స్వామి ఆలయాలకూ కూడా సంప్రోక్షణ ఈ సమయంలోనే జరుగుతుంది.
14, 15వ తేదీల్లో జరిగే కార్యక్రమాలు… 14న ఉదయం 5.30నుంచి 9గంటల వరకు అష్టబంధనం జరుగుతుంది. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య, రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య హోమాలు నిర్వహిస్తారు. 15న యాగశాలలో మహాశాంతి, హోమగుండంలో పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మూల విరాట్టు శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని గర్భాలయంలోకి శాస్త్రోక్తంగా తీసుకువెళ్తారు. 14 కలశాలతో మూలవర్లకు మహాశాంతి, తిరుమంజనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ సమయంలోనే యాగశాలలో ఉన్న ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమం జరుగుతుంది.
16వ తేదీ కార్యక్రమాలు…. మహా సంప్రోక్షణ చివరి రోజున ఉదయం 10.16 నుంచి 12 గంటల మధ్య తులా లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. కళా ఆవాహనతో కుంభం నుండి మూలవిరాట్టుకు స్వామి వారి శక్తిని పునరావాహనం చేస్తారు. యాగ శాలలో చివరి ఘట్టం పూర్ణాహుతి కూడా పూర్తయ్యాక… గర్భాలయంలో ఉత్సవమూర్తుల కుంభాలకూ మహా సంప్రోక్షణ ఉంటుంది. అనంతరం 108 కలశాలతో అభిషేకం నిర్వహిస్తారు. గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగింపుతో మహా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తవుతుంది.
ఇవీ ఈ ఐదు రోజులు తిరుమలలో జరిగే విశేషాలు. ఈ కార్యక్రమానికి భక్తులను ఆపాల్సిన అవసరం లేదు. తిరుమలను దిగ్బంధనం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సాధారణంగా జరిగే అంశాన్ని అదేదో జరిగిపోతోంది అన్నంతగా కల్పించి.. తిరుమల తిరుపతి దేవస్థానం.. అనవసరంగా విషయాన్ని పెద్దది చేసింది. ఈ మహా సంప్రోక్షణ నేపథ్యంలో ఇప్పటికే భక్తులను కట్టడి చేసింది. ఒక్క శనివారం 50 వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన ఐదు రోజులు గరిష్టంగా 30 వేల మందికే అనుమతి ఇచ్చారు. కాలినడక భక్తుల దివ్య దర్శన టోకెన్లనూ నిలిపివేశారు. మూల విరాట్టుకి జరిగే సేవలు ఎలాగూ ఆపాలి.17వ తేదీ నుంచి మహా సంప్రోక్షణానంతర ప్రత్యేక కళతో స్వామి వారు భక్తులకు మరింత కనువిందు చేస్తారు. వెళ్లి దర్శించుకోవచ్చు.