అనాథ ఆశ్రమాల్లో ఆడపిల్లలు భద్రమేనా? మా పిల్ల కనిపించడం లేదు అని వస్తున్న కంప్లైంట్ల సంఖ్య ఎంత? వాటిలో పోలీసులు పరిష్కరించినవి ఎన్ని? వీటికి ఇప్పుడు జవాబులు కావాలి. అనాథ ఆశ్రమాల ముసుగులో వ్యభిచార కూపాలు నడుపుతున్న సంఘటనలు చూస్తున్నాం. బిహార్ ముజఫర్‌పూర్‌లో జరిగిన దారుణం. అక్కడి అనాథ యువతులను వ్యభిచార కూపంలో లాగి చిత్రహింసలకు గురిచేసిన వైనం ఇంకా కళ్లముందే ఆడుతోంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని దోరియాలో కూడా ఇలాంటి దారుణాల పరంపర బయటపడింది. ఒక అనాథ ఆశ్రమం నుంచి ఓ పదేళ్ల బాలిక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తప్పించుకుంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి… తను ఉంటున్న అనాథ ఆశ్రమంలో జరిగే నీఛమైన దారుణాలను కళ్లకు కట్టినట్టు వివరించింది. ప్రతీ రోజూ తెలుపు, నలుపు, ఎరుపు కార్లు తమ ఆశ్రమం ముందు ఆగుతాయని, రోజూ వాటిలో అమ్మాయిలను ఎక్కడికో తీసుకువెళ్లి మళ్లీ పొద్దున్నే తీసుకొచ్చేవారని, తిరిగొచ్చిన అమ్మాయిలు ఏడుస్తూ తమలో తామే కుమిలిపోయేవారని, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండేవారని, అప్పడప్పుడు తననూ బెదిరించారని… ఆ చిన్నారి పంటిబిగువున ఇన్నాళ్లు దాచుకున్న బాధను కన్నీటితో బయటపెట్టింది. పొద్దున్న ఆశ్రమానికి వచ్చాక కూడా వాళ్లను చావ చితక్కొట్టి ఇంటి పనంతా చేయించేవారని ఆ బాలిక చెప్పింది. ఇంకా నయం ఆ పోలీస్ స్టేషన్‌లో అవినీతిపరులు ఉండుంటే.. ఈ విషయం బయటకు పొక్కేది కాదేమో. తక్షణం చర్యలు తీసుకున్న ఆ పోలీసులను అభినందించాల్సిందే. ఆ ఆశ్రమంలో ఉన్న 24 మంది బాలికలను రక్షించారు. వీరంతా తప్పిపోయిన చిన్నారులే. ఆశ్రమ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఆదివారం జరిగిన ఘటన. నెల రోజుల వ్యవధిలోనే బిహార్, ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న ఈ ఘటనలు చూస్తుంటే… అనాథ ఆశ్రమాల తెరవెనుక జరుగుతున్నదేమిటి. అన్ని ఆశ్రమాలను అనుమానించలేం. కానీ… ఖచ్చితంగా అక్కడున్న ప్రతీ ఒక్కరినీ కదిలించి వారి జీవితాలెలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర ప్రదేశ్, బిహార్‌లోనే కాదు.. దేశమంతా విస్తరించిన ట్రాఫికింగ్ క్రిమినల్ యాక్టివిటీ ఇది.
ట్రాఫికింగ్ ఎలా జరుగుతోందో తెలుసా?
దేశంలో అత్యంత పేద ప్రాంతాల బాలికలు ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్, బెంగాల్‌లో పరిస్థితి మరీ దారుణం. మన సౌత్‌లో కూడా ఈ ట్రాఫికింగ్ తీవ్రత ఎక్కువే. నేపాల్, బంగ్లాదేశ్ ట్రాఫికింగ్ రాకెట్‌కి భారత్ అడ్డాగా మారింది. ప్రాంతాల వారిగా ఒక్కో ఏజెంట్‌ని నియమించి టార్గెట్లు పెట్టి మరీ బాలికలకు వల వేస్తున్నారు. 10 నుంచి 16 ఏళ్ల బాలికలే వాళ్ల లక్ష్యం. ఈ ఏజెంట్లు ప్రేమ పేరుతో మభ్య పెట్టడం లేదా మత్తు మందు ఇచ్చి బాలికలను తీసుకెళ్లిపోవడం, అప్పటికీ కుదరకపోతే కొట్టి కిడ్నాప్ చేయడం.. ఇవీ… కొన్ని ఎన్జీఓలు ట్రాఫికింగ్ మీద చేసిన పరిశోధనల్లో బయటపడిన వాస్తవాలు. పాపం.. తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టినా… చాలా చోట్ల కేసులను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. రీఛార్జ్ చేసుకునే సమయంలో మారుమూల గ్రామ బాలికలు ఫోన్ నంబర్ చెప్తారు. ఆ ఫోన్ నంబర్‌ని వంద రూపాయలకు రీచార్జ్ సెంటర్ వాళ్లు అమ్మేస్తున్నారు. ఆ నెంబర్ పట్టుకుని ట్రాఫికింగ్ మోసగాళ్లు బాలికలను ట్రాప్ చేస్తున్నారని స్వచ్ఛంద సంస్థల పరిశోధనల్లో తెలిశాయి. అమ్మాయిలూ.. మీ ఫోన్ నంబర్ అపరిచితులకు ఇవ్వకండి. ఈ మధ్య ఏజెంట్లు, మోసగాళ్లు సోషల్ మీడియాతో మోసాలు చేస్తున్నారు. ఫేక్ ఐడీలతో అమ్మాయిలను ట్రాప్ చేయడం, వారిని నమ్మించి ప్రేమ ముసుగు వేయడం, ఈ వెధవలని నమ్మి వచ్చిన బాలికలను అమ్మేయడం లాంటి ఘటనలు నాగాలాండ్‌లో జరిగాయి. వాట్సాప్ గ్రూపుల్లో బేరాలు సాగిపోతున్నాయి. జార్ఖండ్ ఈ దందాకు ప్రమాదకరమైన అడ్డా. ఇక్కడ గిరిజన బాలికలను టార్గెట్ చేస్తున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా పరిగణించే రెడ్ కారిడార్‌లో కొన్ని నెలల క్రితం 80 మంది ట్రాఫికర్లను పట్టుకున్నారు.

ఏజెంట్లకు బందీలుగా మారిన బాలికలను వ్యభిచార కూపాల్లోని బ్రోతల్స్‌కు అమ్మేస్తారు. అప్పడు ఆ బాలికలకు ముఠాలు పెట్టే పేరేంటో తెలుసా… “ తేరీ సామాన్ ఆయా…”. 50 వేల నుంచి లక్షల్లో బాలికలను అమ్మేస్తున్నారు దుర్మార్గులు. ఒక్కో బ్రోతల్ 50 నుంచి 100 మంది బాలికలను ఈ రొంపిలోకి దింపి నరకం చూపిస్తుంది. తాజాగా బీహార్, ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన సంఘటనలకు ఈ లెక్కలకు లింకు కుదురుతోంది. సత్యార్థి స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం ఒక్కో బాలిక ద్వారా ఏడాదికి 3 నుంచి 14 లక్షల రూపాయలు సంపాదిస్తారట. ఒక ఏడాదికి ఒక బ్రోతల్ సంపాదన 2 నుంచి 14 కోట్లు! ఇదంతా గుట్టుగా సాగిపోతున్న వ్యవహారమేమీ కాదు. అందరికీ తెలుసు. కానీ.. కఠిన చర్యలు కనిపించవు. అదెందుకో ప్రభుత్వానికే తెలియాలి?
నివేదికలు ఏం చెప్తున్నాయి? చర్యలేవి?
వారణాసికి చెందిన గురియా స్వచ్ఛంద సంస్థ వ్యభిచార కూపాల్లో చిక్కుకున్న బాలికలకు 3 దశాబ్దాలుగా పునరావాసం కల్పిస్తోంది. వారి తరపున ఎన్నో వందల కేసులకు సపోర్ట్‌గా నిలిచి చాలా మందిని ఆ రొంపిలోంచి బయటకు తీసుకొచ్చింది. వారు 2006-12 మధ్య ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల వివరాలు సేకరించారు. పాత సర్వేనే.. కానీ..ఇప్పటికి ఇంకా పెరిగి ఉండవచ్చని అర్థం చేసుకోవాలి. ఆ లెక్కల ప్రకారం.. భారత దేశంలో 30 లక్షల మంది సెక్స్ వర్కర్లున్నారు. వీరిలో 40 శాతం మైనరు బాలికలే. వీరిలోనూ 75 శాతం మంది ట్రాఫికింగ్ రాకెట్‌కి చిక్కిన అభాగ్యులు. మొత్తం బాధితుల్లో కనీసం 80 శాతం మంది పేద వర్గాలకు చెందినవారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంచనాల ప్రకారం ప్రతీ ఏటా కనీసం లక్ష మంది చిన్నారులు కనిపించకుండా పోతున్నారు. వీరిలో చాలా మిస్సింగ్‌లు అనుమానాస్పదం. 2016లో స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకి ఓ నివేదిక ఇచ్చింది. ఆ ఏడాది అక్రమ రవాణా ద్వారా కనిపించకుండా పోయిన బాలికల సంఖ్య 19,223. ఏటేటా ఈ సంఖ్య 25 శాతం పెరుగుతోంది. నిజానికి ఈ సంఖ్య కూడా తక్కువే. నోబెల్ బహుమతి గ్రహీత సత్యార్థి స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ మార్చ్ ఎగైనిస్ట్ చైల్డ్ లేబర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం దేశంలో జరుగుతున్న వ్యభిచార రాకెట్ల బిజినెస్ 35 బిలియన్ డాలర్లట. HAQ సెంటర్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ కూడా ట్రాఫికింగ్‌పై నివేదికలు ఇస్తూ ఉంటుంది. వాటి ప్రకారం మన దేశ బాలికలును 18 దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు.
అనాథ ఆశ్రమాల్లో ఆడపిల్లలకు భద్రత ఉందా?
ప్రస్తుతం ఆశ్రమాల ముసుగులో పేరిట బయటపడుతున్నదారుణాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి. వ్యభిచార కూపాలు గల్లి గల్లీలోకి విస్తరించాయి. తప్పిపోయిన పిల్లలు, ఇంట్లోంచి పారిపోయిన బాలికలకు షెల్టర్ చాలా అవసరం. అలాంటప్పుడే ఆనాథ ఆశ్రమాల పేరిట వారిని ఓదార్చి, ఆకట్టుకుని తమను తాము “దీదీ“లు, “మేడంజీ“లుగా పరిచయం చేసుకుని వాళ్లకు గూడు ఇస్తున్నారు. ఆ తర్వాత వారికిచ్చే ఆహారంలో మత్తు మందు కలిపి కార్లలో తరలించడం బీహార్‌లో బయటపడిన విషయమే. ఉత్తర ప్రదేశ్‌లో కూడా సుమారుగా ఇలాంటి వ్యవహారమే. అనాథలే కాదు… పేదరికంలో మగ్గుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన కుటుంబాల్లో బాలికలను మాత్రమే ఎంచుకుని… వారికి మంచి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇలాంటి షెల్టర్లలోకి తీసుకొస్తున్నారు. ముందు కూలి పనులు ఇప్పించడం, ఆ తర్వాత రొంపిలోకి దింపడం లేదా దుబాయ్ షేకులకు అమ్మేయడం. ఇలా ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో సమాధి అవుతున్న జీవితాలెన్నో. ఈ అక్రమ ఆశ్రమాల వ్యభిచార నెట్‌వర్క్ అంతా ఒకటేనని అర్థమవుతోంది. వుమెన్ ట్రాఫికింగ్ రాకెట్ తమ క్రైమ్ స్వరూపాన్ని మార్చుకుని ఇలా ఆశ్రమాల రూపంలో విస్తరించిందా? తవ్వితే అనాథ ఆశ్రమాల ముసుగులో వందల కేసులు బయటపడే అవకాశం ఉంది. చాలా రోజుల కిందట సమాచార హక్కు ద్వారా ఓ నిజం బయటపడింది. దేశంలో ఉన్న NGOల్లో చాలా వరకు ఫేక్ అని.. వాటికి వస్తున్న విరాళాలు, వేరే వనరుల ద్వారా వస్తున్న సొమ్ములకు లెక్కల్లేవని ఆర్టీఐ ద్వారా బయటపడిన వాస్తవం. వరుస సంఘటనలు బయటపడుతున్న నేపథ్యంలో ఆశ్రమాలపై ప్రభుత్వాల పర్యవేక్షణ కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. వుమెక్ ట్రాఫికింగ్ అనేది అభివృద్ధి చెందుతున్న భారత్‌కు అతి పెద్ద మచ్చ.
బాలికల అక్రమ రవాణాకి అడ్డెప్పుడు?
ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్-1956, చిన్నారులపై లైంగిక దాడుల వ్యతిరేక చట్టం– POCSO, జువైనల్ జస్టిస్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్‌లో ఇంకెన్నో సెక్షన్లున్నా.. ఇవేవీ ట్రాఫికింగ్‌ని అదుపు చేయలేకపోతున్నాయి. ఈ రాకెట్‌తో చాలా మంది పెద్దలకు లింకులుండడం, కొంత మంది పోలీసుల అవినీతి, ఇంకెన్నో కారణాలు… ట్రాఫికింగ్ నియంత్రణకు అవరోధాలుగా మారాయి. పొలిటికల్ విల్‌పవర్‌తోనే ఇలాంటి ముఠాలను తుదముట్టించడం సాధ్యం. అంతవరకు అబలల ఆక్రందనలు ఆగవు. వారి ఆక్రందనలు ఆగనంత కాలం ఆడపిల్లలకు భద్రత లేనట్టే.