అమె పరిగెడితే తుఫాన్, ఆమె వేగం సైక్లోన్. ఆమె ఇంటర్నేషనల్ స్ప్రింటర్ హిమదాస్. ఇప్పుడీ పేరు అథ్లెటిక్స్ ప్రపంచంలో సంచలనం. ఆమె మెరుపులా పరిగెడుతుంటే భారతమాత పులకించింది. ఓ పక్క క్రికెట్‌లో ప్రపంచ కప్ రాలేదన్న బాధలోనే ఉన్నారు. కానీ మరో పక్క జరిగిన అద్భుతాన్ని గుర్తించేంత తీరిక ఎవరికీ లేకపోయింది. ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో కేవలం 20 రోజుల్లో 5 గోల్డ్ మెడళ్లు సాధించిన హిమదాస్‌ను చూసి దేశమంతా పులకిస్తోంది. నరేంద్ర మోదీ సహా ప్రముఖులంతా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
జులై 2 పోలాండ్‌లో పోజ్నాం అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ జరిగింది. 200 మీటర్ల పరుగు పందెం. కేవలం 23.65 సెకన్లలో క్రాస్ చేసి దుమ్ము రేపింది. స్వర్ణాన్ని ముద్దాడింది మన హిమదాస్. జస్ట్ ఐదు రోజుల గ్యాప్‌లోనే జులై 7న పోలాండ్‌లోనే జరిగిన కుట్నో అథ్లెటిక్ మీట్‌లో అదే 200 మీటర్ల పరుగుని 23.97 సెకన్లలో ముగించి మరో గోల్డ్ సాధించింది. జులై 13 చెక్ రిపబ్లిక్. క్లాడ్నో అథ్లెటిక్ మీట్. అక్కడా 200 మీటర్ల పరుగు పందాన్ని మెరుపులా కేవలం 23.43 సెకన్లలోనే మెరిసి ఇంకో స్వర్ణాన్ని భరతమాతకు అందించింది హిమదాస్. జులై 16. చెక్ రిపబ్లిక్‌లోనే జరిగిన టాబర్ అథ్లెట్ మీట్‌లో 200 మీటర్ల పరుగు పందాన్ని తుఫాన్ మెయిల్‌లా 23.25 సెకన్లలో అధిగమించి నాలుగో స్వర్ణాన్ని తెచ్చింది. చివరిగా జులై 20న చెక్ రిపబ్లిక్‌లోనే జరిగిన నావే మేస్టోలో ఈ సారి 400 మీటర్లను జస్ట్ 52 సెకన్లలో ముగించింది ఈ చిరుత. ఈ సారి ఐదో గోల్డ్. అంటే 18 రోజుల్లో 5 స్వర్ణాలు. అంతే కాదు సరిగ్గా ఏడాది క్రితం ఫిన్లాండ్‌లో టాంపెరేలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్లలో చిరుతలా పరిగెత్తి స్వర్ణం గెలిచింది హిమ. ఈ గెలుపుతోనే IAAF వరల్డ్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన
తొలి భారత అథ్లెట్‌గా హిమదాస్ ఓవర్ నైట్ స్టార్ అయింది. అథ్లెటిక్స్‌లో ఇదొక చరిత్ర. క్రికెట్‌లో ఓడిపోయినా రోజంతా చూపించే మీడియా… హిమదాస్ సాధించిన ఈ అద్భుతాన్ని మాత్రం గ్రాండ్‌గా ప్రెజెంట్ చేయలేకపోయింది. ఇప్పుడు 200, 400 మీటర్ల ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో హిమదాస్‌దే హవా.ఏడాదిగా ఆమె భీకర ఫామ్‌లో ఉంది. ప్లేస్ ఏదైనా, ట్రాక్ ఎక్కడున్నా.. హిమదాస్ అడుగు పెడితే.. ఇక పరుగుల తుఫానే. 19 ఏళ్ల వయసులో ఇన్ని విజయాలు, ఇన్ని స్వర్ణాలు అనితర సాధ్యం. ఈ విజయాల వెనుక హిమదాస్ కసి ఉంది. వెనకబాటు, వివక్షల మధ్య నలిగిన ఆమె జీవితాన్ని ఒక్కో మెట్టు ఎక్కిన లైఫ్ స్టోరీ ఎవరినైనా కదిలించాల్సిందే.
ఈశాన్య భారతంలో మారుమూల రాష్ట్రం అసోం. అసోం రాజధాని గౌహతికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న థింగ్ అనే చిన్న పల్లెటూరు. అక్కడ ఇప్పటికీ అడుగడుగునా వివక్షకు గురయ్యే షెడ్యూల్ తెగలకు చెందిన అమ్మాయి హిమదాస్. హిమదాస్ కుటుంబం తరతరాలుగా కులవివక్షను చూసింది. ఆ కుటుంబాల్లో బిడ్డ పుడితే భవిష్యత్తు ఎలా అని భయపడే పరిస్థితి. హిమదాస్ తండ్రి ఒక పేద రైతు. నలుగురు పిల్లల్లో చివరి అమ్మాయి హిమ. చిన్నతనంలో తండ్రితో పొలం పనులకు వెళ్లేది. చిన్ననాటి నుంచి ఆటలంటే పిచ్చి. అక్కడి పొలాల్లో అబ్బాయిలతో కలిసి ఫుట్‌బాల్ ఆడేది. అబ్బాయిలకు బాల్ అందకుండా వేగంగా పరుగెత్తేది. అదీ ఒట్టి కాళ్లతోనే. ఎందుకంటే ఆమెకు కనీసం బూట్లు కొనిచ్చే పరిస్థితి కూడా ఇంట్లో లేదు. అలా ఒట్టి కాళ్లతోనే చాలా కాలం పరిగెత్తి పరిగెత్తి కాళ్లు రాటు దేరిపోయాయి. కానీ ఆమె వేగంలోని మెరుపుని మొదటి సారి గుర్తించిన వ్యక్తి ఆమె చదివే స్కూల్‌లోని ఫిజికల్ ట్రైనర్. అతని ద్వారానే హిమదాస్‌కి కోచ్ నిపాస్ దాస్ పరిచయం అయ్యారు. ఇది హిమ జీవితాన్ని మలుపు తిప్పింది. నిపాన్ దాస్ లాంటి గురువు దొరకడమే హిమ అదృష్టం. ఆయన హిమ తల్లిదండ్రులను ఒప్పించి గౌహతీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చేర్చారు. తన స్వంత ఖర్చులతో బూట్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చారు. ఆమె పరుగుకి మరింత మెరుగులు దిద్దిన మరో కోచ్ నవజీత్ మలకర్. వివక్ష మధ్య నలిగిపోయిన హిమ… ప్రపంచానికి తనేమిటో చూపించాలనుకుంది. హార్డ్ వర్క్.. హార్డ్ వర్క్… హార్డ్ వర్క్. పరుగు తప్ప మరో లోకం తెలియనంతగా ప్రాక్టీస్ చేసింది. వంద, రెండు వందల మీటర్ల పరుగులో అద్భుత టైమింగ్ హిమ సొంతమైంది. నేషనల్ లెవల్ పోటీల్లో ఆమె చిరుతలా పరిగెత్తింది.
ఈ విజయాల తర్వాత హిమని ఇంటర్నేషనల్స్‌కి పంపించాలని సెలెక్టర్స్ డిసైడ్ అయ్యారు. ఫస్ట్.. నైరోబీలోని వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌కి సెలెక్ట్ చేశారు. కానీ, హిమ దగ్గర డబ్బుల్లేవు. సరైన గురువు వెనకుంటే శిష్యుడు సముద్రమైన ఈదేయగలడు. హిమ పరిస్థితి గమనించిన కోచ్ నిపాన్ దాస్, నవజీత్‌లు అప్పులు చేసి మరీ హిమదాస్‌ని నైరోబీ పంపించారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ రేస్‌లో ఐదో స్థానంలోనే నిలిచినా… ఆమె పరుగులో మెరుపు వేగాన్ని… అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోచ్ గలేనా బుఖారియా దృష్టిలో పడింది. అదే హిమ జీవితంలో మరో పెద్ద మలుపు. గలేన్ ట్రైనింగ్‌లో హిమ మరింత రాటు దేరింది. ఇంటర్నేషనల్ అథ్లెట్‌గా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 18 ఏళ్ల వయసుకే IAAF వరల్డ్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా అరుదైన రికార్డ్ సాధించింది. ఆ స్వర్ణం గెలిచిన రోజు ఉద్వేగంతో ఇండియన్ ఫ్లాగ్ వెదికిన హిమదాస్‌ని ఎవరూ మర్చిపోరు. ఈ ఏడాది జస్ట్ 20 రోజుల్లో 5 స్వర్ణాలు సాధించి… భరతమాతకు అద్భుతమైన బహుమతి ఇచ్చింది.
ఇప్పుడు హిమదాస్ పరుగు ఓ సంచలనం. హార్డ్ వర్క్‌తో వచ్చిన విజయం ఊరికే వదిలిపోదు. ఛాలెంజ్ లేని జీవితం వృధా అంటుంది హిమ. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమంటోంది. ఒలంపిక్స్ స్వర్ణం కోసం ఎంత కష్టానికైనా సిద్ధమని ఉద్వేగంగా చెప్పింది హిమదాస్. స్వర్ణాన్ని మించిన ఆభరణం ఆమె వినయం. కష్టం అంటే ఏంటో తెలుసు. అందుకే అసోం వరద బాధితులకు తనకు తోచిన ఆర్థిక సాయం అందించింది. వరదబాధితుల కోసం ట్విటర్‌లో పిలుపు ఇచ్చింది. ఈ స్ప్రింటర్ జీవిత కథ ఎందరికో inspiration. ఈ మధ్య అంతా బయోపిక్‌ల కాలం. హిమదాస్ రియల్ స్టోరీని సినిమాగా తీయాలని ఉందని అక్షయ్ కుమార్ ఈ మధ్య చెప్పారు. ఇన్ని వండర్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం నుంచి హిమదాస్‌కి అనుకున్నంత ప్రోత్సాహమేమీ లేదు. చిన్న చిన్న ఘనతలకే భారీ భారీ నజరానాలు ప్రకటించే రాష్ట్ర ప్రభుత్వాలు… ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో ఇండియన్ ఫ్లాగ్‌ని గర్వంగా నిలబెట్టిన హిమదాస్‌ని గుర్తించకపోవడం… సో పిటీ. అయినా అవేవీ హిమదాస్ పట్టించుకోలేదు, పట్టించుకోదు కూడా. తన లోకం పరుగు.. ఆమె పతకాల కోసం పరిగెడుతూనే ఉంటుంది.