June 7, 2023

గూఢచారి మళ్లీ మెప్పించాడు

గూఢచారి మళ్లీ మెప్పించాడు

మన సినిమా మారుతోంది ఎప్పుడు చూసినా అవే పాత్రలు, అవే కథనాలు, అవేపాటలు అనే వాళ్లను రెప్పార్పకుండా కట్టిపడేసే కథలతో, మరింత మెరుగైన, చురుకైన సాంకేతిక విలువలతో కూడిన సినిమా ఇప్పటి మన తెలుగు సినిమా. మహానటి, రంగస్థలం, భరత్ అనే నేను, అ అంతకు ముందు ఘాజీ ..! ఇలా చెప్పుకుంటూ పోతే నేడు మన ముందుకు వచ్చిన అడివి శేష్ గూఢచారి కూడా మనల్ని అబ్బుర పరచక మానదు. గతేడాది వచ్చిన మహేష్ మురుగదాస్ కాంబో స్పైడర్ బాక్సాఫిస్ అంచనాలను అందుకోలేనప్పటికీ ఓ మంచి ప్రయోగం అనే చెప్పుకోవాలి, అలాగే గత నవంబర్‌లో ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో డా.రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకుల మదిని దోచుకుంది.

సాధారణంగా మనం ఏ సినిమానైనా బాగుంది లేదా బాలేదు అని రెండు ముక్కల్లో తేల్చేస్తాం అంతే. కానీ, ఆ సినిమా తీసే వాళ్లకి, ఆ సినిమా కోసం పని చేసే వాళ్లకి అది కేవలం అంతే కాదు. అందరి సంగతి ఏమో కానీ, సినిమా పిచ్చిని(విపరీతమైన మక్కువ) నరనరాన వంటపట్టించుకున్న అడివి శేష్ లాంటి వాళ్లకి అది కేవలం అంతే కాదు. ఆ సినిమాలో వచ్చే పతీ సన్నివేశం వాళ్లని మెప్పించి తీరాలి, ప్రతీ పాత్రకి ఓ అర్థం ఉండాలి, చివరికి ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో సినిమాతో మమేకమైపోవాలి. నేను పైన చెప్పుకొచ్చిన విశేషాలన్నీ పుష్కలంగా ఉన్న కథ మన గూఢచారి. ఏమిటి వీడు కేవలం ఒక్కడి గురించే చెబుతాడు ఇంకెవరూ లేరా ఈసినిమాలో ..? అని అనుకుంటే, ఇదిగో అవీ చెబుతున్నాసినిమా పిచ్చి ఉన్నవాడిని, ఆ పిచ్చి ఉన్నవాడే అర్థం చేసుకోగలడు. అలాంటి ఇంకో సినిమా పిచ్చోడే మన దర్శకుడు శశికిరణ్ తిక్కా, మంచి కథని, కథనాన్ని సమర్ధవంతంగా నడిపించగలితేనే, అది మంచి సినిమాగా మన ముందుకు వచ్చేది, గూఢచారి లాంటి సినిమాని ఓ నిర్ణిత వ్యయంతో తీయాలంటే అది ఆషామాషీ కాదు. సముద్రం నుండి ఉప్పు వస్తుంది, అలాగని ఉప్పుకావాలంటే ఆ సముద్రాన్ని చూస్తూ కూర్చోలేం, నిర్మాతని ఒప్పించటం ఒక్కటే కాదుఒప్పించాక వారు ఇచ్చిన డబ్బుతో మన కథకి ఎలా న్యాయం చేయాలో తెలుసుకుంటూ, ప్రణాళికలు వేసుకుంటూ, ఒక్కో అడ్డంకినీ దాటుకుంటూ సాగటం ఓ యుధ్ధం. ఆ యుద్ధాన్ని నేర్పూ, ఓర్పులతో నెగ్గుకొచ్చిన వీరుడు మన దర్శకుడు శశికిరణ్. ఇతర పాత్రలు..?

రమణ్ రాఘవ్ 2.0 తో మనముందుకొచ్చిన తెలుగమ్మాయి శొభిత ధూళిపాల గుర్తుండే ఉంటుంది. తెనాలిలో పుట్టి, విశాఖలో పెరిగి, అవకాశాలకోసం, పైచదువులకోసం తను ముంబై వెళ్లింది. అంటే తనకి నటి అవ్వాలన్న కోరిక ఎంత బలంగా ఉండి ఉంటుందో ఆలోచించండి. ఇలా సినిమాని అమితంగా ప్రేమించేవారంతా ఓ చోట చేరినప్పుడు వారు తీసిన సినిమాని మనం ప్రేమించక ఇంకేం చేస్తాం. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మధు శాలినీ, అనీష్ , వెన్నెల కిషోర్ ఇలా అందరూ చాలా చక్కగా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. వెన్నెల కిషోర్ ని వాడుకున్న విధానం చాలా బాగుంది. అక్కడమ్మాయ్ఇక్కడబ్బాయ్ తో మన ముందుకు వచ్చిన అక్కినేని గారి మనవరాలు సుప్రియ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో తళుక్కుమన్నారు…. అసలు ఏముంది ఈ సినిమాలో ..?

కథకి ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా సాఫీగా సాగిపోతూ మనల్ని ఉత్కంఠకి గురిచేస్తూ తరువాత ఏంటి అని ఆసక్తిని రేపే కథనం, ఆ కథనాన్ని తన భుజాలపై మోస్తూ అందరిని ఆ కథలోకి తీసుకెళ్లగలిగే శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం, సందర్భోచితమైన అబ్బూరి రవి సంభాషణలు, గ్యారీ బీహెచ్ కూర్పు, షనిల్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే మన తెలుగులో జేమ్స్‌బాండ్‌ తరహా సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే ఈ తరహా కథలతో సినిమాలు చేసి విజయాలు సాధించగలిగారు. ఆయన చేసిన తొలి బాండ్‌ సినిమా గూఢచారి 116. ఆ స్ఫూర్తితోనే అనుకుంటాఈ సినిమా పేరు గూఢచారి, ఉపశీర్షిక త్రినేత్రా-116, చివరిలో అడివి శేష్‌ని ఏజెంట్ గోపీ గా అభివర్ణించటం, ఆయనకి కొత్త మిషన్ అప్పగించటం చూస్తే కృష్ణగారిలా ఈ తరహా కథలు ఇంకా చేయాలనే ఆలోచన అడివి శేష్ కి ఉందని అర్థం అవుతోంది, అన్నట్టు కృష్ణ గారి ఏజెంట్‌ గోపీ కూడా సూపర్‌ హిట్‌. మొత్తం కథంతా చెప్పేసి.. థ్రిల్‌ పోగొట్టేయడం ఏం బాగుంటుంది. ఊహించని ట్విస్ట్‌లతో సాగే సినిమాని వెండితెరపై చూస్తేనే ఆ కిక్కు. మరిఆలస్యం చేయకుండా ఈ వారాంతంలో మిషన్ త్రినేత్రా ఏంటో చూసేయండి.

చివరిగా : గూఢచారి మెప్పిస్తాడు .. మళ్లీ ఏజెంట్ గోపీగా ఎప్పుడొస్తాడో చూద్దాం

రవి తేజ

 

 

 

 

 

 

 

 

 

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *