రైతులకు కనీసం మద్దతు ధర పెంపు శుభ పరిణామమే. సామాజికంగా ఉపయోగపడే పప్పు దినుసులు, నూనె గింజల, తృణధాన్యాలకు ఈ పెంపు వర్తింప చేయడం మంచిదే. కానీ, హరిత విప్లవం దిశగా అడుగులే పడడం లేదు. హరిత విప్లవాన్ని బీజేపీ సాధ్యం చేస్తుందనుకుంటే ఇంకా కనీస మద్దతు ధరల పెంపు దగ్గరే ఆగిపోతున్నాం. హరిత విప్లవం సాధించినప్పుడే రైతుకి పండుగ. అప్పటి వరకు ఈ తాయిలాలు కంటితుడుపు చర్యలు మాత్రమే. రైతు విషయంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్యాలకు ఏ ప్రభుత్వమూ పరిష్కారాలు చూపడం లేదన్నది వాస్తవం. ఏటా బడ్జెట్ లో మొదటి పేజీ వ్యవసాయానికే ఇచ్చే ప్రభుత్వం… వారికి ఆర్థిక చేయూత, ప్రోత్సాహం, స్వావలంబన విషయంలో ఎప్పుడూ చివరి పేజీనే. ఎన్నికలు దగ్గర పడినప్పుడు తప్ప రైతు ఆత్మఘోష పార్లమెంటుకి వినిపించదు.ఏ పంట వేయాలి, ఏ పంటను నిరుత్సాహ పరచాలి.. ఈ విషయంలోనూ అవగాహన లోపాలు రైతు కొంప ముంచుతున్నాయి. ఉదాహరణకు పత్తి. దేశంలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నది పత్తి రైతులే. కారణాలనేకం.. వస్త్రపరిశ్రమకు చౌకధరల్లో కావల్సినంత పత్తి దొరుకుతోంది. గిరాకీ పెద్దగా లేకపోయినా ముందస్తు అవగాహన లేక ప్రాణాలు పెట్టి పత్తి పండిస్తున్నాడు రైతు. ఆ పంటను నిరుత్సాహ పరిస్తే.. అన్నదాత వేరే పంటకు మళ్లుతాడు. ప్రజల నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ పంటలే ఎక్కువగా వేసేట్టు రైతుల్లో అవగాహన పెంచాలి. ఒక్కోసారి పంట దిగుబడి అమాంతం పెరిగితే ధరలు పడిపోతాయి. మరోసారి దిగుబడి తగ్గి ధరలు అమాంతం పెరుగుతాయి. కారణం ప్రత్యామ్నాయ పంటలు, ప్రజలకు అవసరమైన దినుసుల సాగుపై రైతులకు దిశానిర్దేశం లేకే. ప్రభుత్వం ఇలాంటి విషయాలను పట్టించుకోవడం లేదు. అందుకే స్వామినాథన్ సిఫార్సులను కేంద్రం అమలు చేయాలని రైతు సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నా మద్దతు ధరలతోనే సరిపెడుతోంది ప్రభుత్వం. ఇది తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కాదు.
కనీస మద్దతు ధర ప్రతిపాదించే ముందు ప్రభుత్వం కొన్ని పద్ధతులు పాటిస్తుంది. రైతు స్వయంగా పెట్టుబడి పెట్టే విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ ఖర్చు… కూలీలు, యంత్రాల ఖర్చులను కలిపి A2 అంటే యాక్చువల్ కాస్ట్ గా లెక్కిస్తారు. పైన చెప్పిన యాక్చువల్ కాస్ట్ లెక్కకి రైతు, ఆయన కుటుంబం పడే శ్రమ విలువను జోడిస్తారు. ఇది A2+FL (FAMILY LABOR). ఈ లెక్కకు సాగు భూమి అద్దె, పెట్టుబడిపై వడ్డీ కలిపి C2 అంటే సమగ్ర వ్యయంగా లెక్కిస్తారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఈ సమగ్ర వ్యయంపై 50 శాతం పెంపుని కనీస మద్దతు ధరగా ప్రకటించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన మద్దతు ధర A2+FL (FAMILY LABOR) విధానంలో లెక్కవేసింది. ఇది కూడా దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. అయినా దేశమంతా ఒకే లెక్క అమలవుతుంది. కనీసం సమగ్ర వ్యయంపై మద్దతు ధర పెంచితే రైతుకి మరింత ఊతం అయ్యేది. బడ్జెట్ లో కూడా ప్రోడక్షన్ కాస్ట్ మీద 1.5 రెట్ల మద్దతు ధర పెంచుతామని ప్రకటించారు. ప్రొడక్షన్ కాస్ట్ అంటే సమగ్ర వ్యయం అంటే C2. స్వామినాథన్ సిఫార్సులు అమలైన రోజే అన్నదాతకు నిజమైన పండగ. పోనీ మద్దతు ధరల ప్రక్రియ సక్రమంగా అమలవుతుందా అంటే అదో ప్రహసనం. రాష్ట్రాలు బాధ్యత తీసుకోవు, కేంద్రం ముందుకు రాదు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎఫ్.సి.ఐ, నాఫెడ్ లాంటి సంస్థలకు మొత్తం పంటలు కొనే శక్తి లేదు. ఇక మిగిలింది వ్యాపారమే ముఖ్యంగా సాగే ప్రైవేటు సంస్థలు. చివరికి జరిగేదేమిటంటే.. ప్రైవేట్ మార్కెట్ ఏది నిర్ణయిస్తే అదే ధరగా సాగిపోతాయి. వారు మద్దతు ధరకు మద్దతిస్తే సరే.. లేకుంటే రైతేం చేయగలడు. పోరాడే శక్తి లేనివాడు, కాడెద్దులు మట్టిని నమ్ముకున్నవాడు. నాట్లు వేయమంటే వేస్తాడు గానీ, పోరాడలేదు. కనుక.. మద్దతు ధర ప్రకటించగానే సరి కాదు. వాటి అమలు నిక్కచ్చిగా ఎవరు చేస్తారన్నది చట్టబద్ధంగా ఉండాలి. అలా ఉండాలంటే స్వామినాథన్ సిఫార్సులు అమలు కావాలి. అలా చట్టబద్ధంగా రైతు స్వేదానికి ప్రతిరూపమైన పంటకు సరైన ధర దొరికితేనే అన్నదాతకు ఆర్థిక పరిపుష్టి. ఎన్ని రాతలు రాసుకున్నా, ఏ ప్రభుత్వం మారినా… మారనిది ఒక్కటే రైతు తలరాత.
– సతీష్ కొత్తూరి