June 7, 2023

ఎట్టకేలకు కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ పూర్తైంది. పటిష్ట భద్రత మధ్య ఐదుగురు సభ్యుల పురాతత్వ సిబ్బంది జ్ఞానవ్యాపి మసీదులో వీడియోగ్రఫీ పూర్తి చేశారు. జ్ఞానవాపి మసీదు కొలనులో శివలింగం దొరికిందని కూడా చెప్తున్నారు. ఈ సంఘటనతోనే కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదు దేశ వ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. విదేశీ దురాక్రమణదారులు మన దేశంలో సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాల మీద వారు చేసిన దాడి అత్యంత ఘోరమైనది. అందులో భాగంగానే ఎన్నో వేల ఆలయాలను ధ్వంసం చేశారు.

కాశీని సాక్షాత్తు పరమశివుడే నిర్మించాడని భారతీయులు నమ్ముతారు. అలాంటి కాశీలో ఎన్నో వేల ఆలయాలు ఉండేవి. ఇస్లాం దండయాత్రల్లో ఒక్క కాశీలోనే వేల ఆలయాలు ధ్వంసం చేశారని చరిత్ర చెప్తోంది. ముఖ్యంగా ఔరంగజేబ్‌ హిందువులపై చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలోనే కాశీలో విశ్వేశ్వరుడి ముఖ్య ఆలయాన్ని ఔరంగజేబ్‌ కూల్చేశాడని అంటారు. అలా కూల్చిన ప్రాంతంలో మసీదు నిర్మించారన్నది ఇప్పుడు వివాదం. ఆ ప్రాంతాన్ని తిరిగి హిందువులకు అప్పగించాలని వారణాసి కోర్ట్‌లో కేసు వేశారు. ఆ ప్రాంతాన్ని సర్వే చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మొదట్లో మసీదు కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సర్వేని అడ్డుకున్నారు. కానీ సర్వేచేయాల్సిందేనని మళ్లీ కోర్టు ఆదేశించడంతో వీడియోగ్రఫీ జరిగింది.
జ్ఞాన్‌వాపి మసీదు

ప్రస్తుత కాశీ విశ్వేశ్వర ఆలయానికి పక్కనే ఉంటుంది జ్ఞాన్‌వాపీ మసీదు. జ్ఞాన్‌వాపి అంటే జ్ఞానం కలిగించే బావి. ఎవరిని అడిగినా ఈ పదం సంస్కృత పదం అని చెప్తారు. అదే పేరుతోనే మసీదుని పిలుస్తారు. ఆ మసీదుకి పడమట వైపు ఉన్న గోడ వెలుపల అంత్యంత అరుదైన శృంగార గౌరీ మాత విగ్రహం ఉందని, వాటితో పాటు గణపతి, ఆంజనేయ స్వామి పురాతన విగ్రహాలు ఉన్నాయని వాటిని పరిరక్షించాలన్నదే పిటిషన్‌ ఉద్దేశం. శృంగార గౌరీ మాత విగ్రహం పూజలకు అనుమతించాలని కాశీవాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఆ మసీదు గోడల మీద మన దేవతల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఔరంగజేబ్‌ కాశీ ఆలయాన్ని ధ్వంసం చేయిస్తున్నప్పుడు… అసలైన జ్యోతిర్లింగాన్ని మసీదుగా చెప్తున్న ఈ జ్ఞానవాపి బావిలో అప్పటి పురోహితుడు దాచాడన్న కథ ఇప్పటికీ కాశీలో వినిపిస్తూనే ఉంటుంది. ఆ కథ గురించి వారణాసిలో అందరికీ తెలుసు. 1669 ప్రాంతంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ జ్ఞాన్‌వాపి ప్రాంతంలో మసీదు కట్టించాడని అక్కడి చరిత్ర చెప్తోంది.

ప్రస్తుతం జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న స్థలంలోని ఆలయాన్ని మళ్లీ నిర్మించేందుకు కాశీ జిల్లా కోర్టులో 1991లోనే దావా దాఖలైంది. ఈ మసీదు ప్రాంగణం ఆలయానికి చెందుతుందని న్యాయవాది విజయ్‌ ‌శంకర్‌ ‌రస్తోగి వారణాసి కోర్టులో ఆనాడు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. అప్పటి నుంచి ఆ ఫైట్‌ కొనసాగుతోంది. 2011 ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌పై కోర్టు స్పందించింది. ప్రస్తుత కాశీ విశ్వనాథ్‌ ఆలయంతో పాటు జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేసేందుకు భారత పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. ఐదుగురు సభ్యులున్న బృందాన్ని ఏర్పాటు చేయాలని, వారిలో ఐద్దరు ముస్లింలు ఉండాలని కోర్టు డైరెక్ట్‌ చేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ అంజుమన్‌ ఇం‌తేజామియా మసీదు కమిటీ (జ్ఞాన్‌వాపి) మరో పిటీషన్‌ని దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ని అలహాబాద్‌ ‌హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 21‌న తోసిపుచ్చింది. 2021, ఆగస్టులో ఐదుగురు మహిళలు వారణాసి డిస్ట్రిక్ట్‌ కోర్టులో మరో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో శృంగార గౌరీ మాత, వినాయక, హనుమాన్‌ ఆలయాలకు ‌వెళ్లేందుకు అనుమతించాలని ఆ మహిళలు కోరారు. మొత్తానికి ఎన్నో అడ్డంకుల మధ్య కోర్టు ఆదేశాల ప్రకారం ఐదుగురు పురాతత్వ సభ్యుల బృందం వీడియోగ్రఫీ పూర్తిచేసింది.

హిందువులకు పరమ పవిత్ర క్షేత్రం కాశి. పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లోనూ కనిపించే క్షేత్రం వారణాసి. ఆ క్షేత్రం ప్రాచీనతకు సాక్ష్యం గలగల పారే గంగానదే. సృష్టిలోనే ప్రాచీన నగరంగా కాశీకి పేరు. గంగమ్మ ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం ఎన్నో కాల పరీక్షలు ఎదుర్కొని నిలిచింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన విశాలక్షి మందిరం ఇక్కడ ఉన్నాయి. 5,000 సంవత్సరాలకు ముందే ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి పొందిన నగరం వారణాసి. వారణాసిని సందర్శించని ఋషి గానీ, మహర్షి గానీ, దేవతలు గాని లేరంటారు. ప్రధాని నరేంద్ర మోది ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం వారణాసి. ఈ మధ్యే ప్రధాని మోదీ ప్రారంభించిన కాశీ విశ్వనాథ్‌ ‌కారిడార్‌తో వారణాసి కళ మరింత పెరిగింది. ‘జ్ఞాన్‌వాపి’ అనే పేరు సనాతన సంప్రదాయాన్ని సూచిస్తోంది. జ్ఞాన్‌వాపిగా చెప్పే ఆ బావిలో ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది.

1194లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ కాశీ మీద పడి వెయ్యి ఆలయాలను ధ్వంసం చేసి, వేల మందిని కర్కశంగా చంపాడాని చరిత్రే చెప్తోంది. 1211లో కాశీ వాసులు మళ్లీ ఆలయాన్ని నిర్మించుకున్నా… శతాబ్దాల పాటు విదేశీ దండయాత్రల్లో కాశీ కళను కోల్పోయింది. 1376లో పిరోజ్ షా తుగ్లక్‌ పాలనలో కాశీ విధ్వంసం మరింత కొనసాగింది. 1489 ప్రాంతంలో సికిందర్‌ ‌లోడి మిగిలిన హిందూ ఆలయాలను పడగొట్టారు. అక్బర్‌ ‌పాలన కాలంలో అప్పటి చక్రవర్తులకు హిందువుల సహాయం అవసరం పడింది. ఆ సమయంలో 1585లో రాజా తోడర్‌మల్‌ కాశీ అలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఔరంగజేబ్‌ పాలన మొదలయ్యాక మళ్లీ కాశీకి గ్రహణం పట్టింది. ‌1669లో ఔరంగజేబ్‌ ‌కాశిలోని అసలైన విశ్వనాథ ఆలయాన్ని పడగొట్టించాడని, ఆ శిథిలాల మీద మసీదు నిర్మించాడని వారణాశిలోని ఎవరిని అడిగినా చెప్తారు. మసీదు గోడలను గమనిస్తే ఇది ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. ఈ మసీదులోనే జ్ఞాన్‌వాపి పేరుతో పిలిచే చిన్న బావి ఉంది. విశ్వనాథ క్షేత్రం మీద దాడి జరిగినప్పుడు దురాక్రమణదారుల బారిన పడకుండా ఇక్కడి ప్రధాన పూజారి జ్యోతిర్లింగాన్ని ఈ బావిలో దాచారని అంటారు.మరాఠా పాలకుడు మల్హర్‌రావు హోల్కర్‌ ఆలయాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 1780లో ఎన్నో ఆలయాలకు ఊపరి పోసిన అహల్యాబాయి హోల్కర్‌… ‌ప్రస్తుత కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని నిర్మించారు. 1833-1840లో జ్ఞాన్‌వాపి సరిహద్దు, ఘాట్లు, ఇతర దేవాలయాలను పునరుద్ధరించినది ఆవిడే. ఇప్పుడు ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది. ఇక తీర్పు ఏమిటా అని కాశీవాసులే కాదు, దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *