May 30, 2023

అతడు నట”రాజకుమారుడు”

అతడు నట”రాజకుమారుడు”

మహేష్‌ బాబు పుట్టిన రోజు. ఏం రాయాలి అని పొద్దున్న నుంచి ఆలోచన. అలా ఆలోచనలోనే సాయంత్రం అయిపోతుందని అనుకోలేదు. అయినా సూపర్‌ హీరోలకు ప్రత్యేకంగా పుట్టిన రోజులేమిటి. వాళ్ల ప్రతీ సినిమా రోజూ.. వారికి పుట్టిన రోజే. అయినా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అలా కొన్ని గుర్తొస్తాయి. ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తే

అష్టాచెమ్మా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది, అందులో బాగా ట్రెండ్ అయిన కలర్స్ స్వాతీ డైలాగ్ మహేష్. ఆ పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి. మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో.. ముఖ్యంగా అమ్మాయిల్లో అయనకి ఉన్న ఫాలోయింగ్‌కి ఈ డైలాగ్ ఓ నిదర్శనం. కృష్ణ గారి అబ్బాయిగా, నాలుగేళ్లకే నీడ సినిమాతో తెరంగేట్రం చేసి.. కొన్నేళ్ల గ్యాప్ తరువాత పోరాటం, శంఖారావం లాంటి సినిమాలతో ముందుకొచ్చి తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులని కట్టి పడేశారు. ప్రతీ ఏడాది వేసవి సెలవులకి ఓ సినిమా చేస్తూ బాలనటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తన చిన్నప్పుడే డాన్స్లు, ఫైట్‌ సీక్వెన్సెస్‌తో అదరగొట్టిన మహేష్ 1990లో చేసిన అన్నా తమ్ముడు సినిమా తరువాత మళ్లీ 1999 వరకు సినిమాల జీలికి రాలేదు. ఆనాడు బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు ఈ పిల్లాడే పెద్దయ్యాక రికార్డులు కొల్లగొట్టే బాక్సాఫీస్ మొనగాడు అవుతాడని. బజారు రౌడీ, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117 లాంటి సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన మహేష్, బాలచంద్రుడు సినిమాలో ఏకంగా టైటిల్ రోల్ పోషించి, అప్పట్లోనే తన మార్క్ హీరోయిజంతో ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేశారు.

1999లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన మహేష్ బాబు, హీరోయిన్లని సైతం చిన్నబుచ్చే తన అందంతో అందరినీ ఆకట్టుకుని ఆరంభంలోనే ఓ చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సినిమాయువరాజులో ఓ బాబుకి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తరువాత నమ్రతతో జతకట్టిన మహేష్ వంశీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆపై వచ్చిన మురారి తన కెరీర్‌కి కీలకమైన మలుపు. మహేష్ బాబు అంటే కేవలం అందగాడు మాత్రమే కాదని, నవరసాలు పలికించగల నటుడని ఈ సినిమా ద్వారానే తెలిసింది.

మంచి నటుడిగా గుర్తింపు పొందినా ఆ తరువాత వచ్చిన టక్కరిదొంగ, బాబీ సినిమాలు ఫ్లాపులు. అయితే 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా తన కెరీర్లో మరో మైలురాయి. ఈ సినిమాతో మహేష్ ఓ స్టార్‌గా ఎదిగాడు. అప్పటివరకూ పడుతూ లేస్తూ సాగిన తన ప్రయాణాన్ని ఈ సినిమా పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు మహేష్ అందగాడు, మంచి నటుడు, మాస్‌ని అలరించగల కమర్షియల్ కథానాయకుడు కూడాను. ఆ వెంటనే వచ్చిన నిజం సినిమాతో మళ్ళీ పరాజయాన్ని మూటగట్టుకున్నా, తన నటనతో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు.

ఆ తరువాత వచ్చిన ప్రయోగం నానీ కూడా బెడిసికొట్టింది, అర్జున్‌లో కథాబలం ఉన్నా అంచనాలను అందుకోలేకపోయింది. మళ్లీ వరుస పరాజయాలు వెక్కిరించాయి. ఇదే సమయంలో 2005 ఫిబ్రవరి 10న వంశీలో తనతో జతకట్టిన నమ్రతతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు మహేష్. అసలు మహేష్ పేరుకి పెద్ద కమర్షియల్ హీరో అయినప్పటికీ, అంతులేని స్టార్‌డమ్‌ ఉన్నప్పటికీ, తన మనసెప్పుడూ కొత్తదనం వైపే పరుగులు తీస్తుంది. కాబట్టే రెండో సినిమాలోనే ఓ బిడ్డకి తండ్రిగా వేశాడు, మురారి తరువాత ఓ కౌబాయ్ సినిమా తీశాడు, ఒక్కడు తరువాత నానీ, నిజం లాంటి సినిమాలు చేశాడు. ఇన్ని ప్రయోగాలు చేసిన కమర్షియల్ హీరో ఎవరూ లేరేమో. ఇదే మాట భరత్ అనే నేను ప్రీరిలీజ్ లో జూ.ఎన్టీఆర్ కూడా అన్నాడు.

వరుస పరాజయల తరువాత త్రివిక్రమ్‌ రచన, దర్శకత్వంలో 2005లో వచ్చిన అతడు మహేష్ కేరీర్‌లోనే ఓ క్లాసిక్. ఆ సినిమాతో మహేష్ కుటుంబకథా చిత్రాలు ఇష్టపడే వారికి కూడా దగ్గరయ్యాడు. ఆ సినిమా డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంటాయి. టీవీల్లో అతడు సినిమాకొచ్చిన సక్సెస్‌ రికార్డులు సృష్టించింది. ఆ తరువాత 2006లో వచ్చిన పోకిరీ ఇండస్ట్రీ హిట్. ఈ సినిమా దెబ్బకి మహేష్ మానియా ఖండాంతరాలు దాటింది. అప్పటి వరకూ ఓ లెక్క ఆ తరువాత నుంచి మరో లెక్క. ఇప్పుడు మహేష్ ప్రిన్స్ మహేష్ కాదు, సూపర్ స్టార్ మహేష్. ఆ సినిమా ధాటికి అప్పటివరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ వాష్‌అవుట్‌. వసూళ్లను టేప్‌రికార్డర్లో పెట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కినట్ట్లు ఆరోజుల్లోనే 48 కోట్ల షేర్ తీసుకొచ్చిన చిత్రం అది. అది మహేష్ కెరీర్లో ఓ స్వర్ణ యుగం

కేవలం కమర్షియల్స్‌లో కనిపిస్తూ మహేష్ తన అభిమానులకు కనుల విందు చేశారు. గ్యాప్ తరువాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఖలేజా సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్‌కి మళ్లీ పరాజయమే ఎదురైంది. అయినప్పటికీ ఆ సినిమా మహేష్ కెరీర్లో ఓ ఆణిముత్యం. ఇందులో తన కామెడీ టైమింగ్ అద్భుతం. థియేటర్లలో జనాలకి ఎందుకు నచ్చలేదో తెలీదుకానీ, ఖలేజా బుల్లి తెరపై ఓ పెద్ద హిట్. ఇప్పటికి ఈ సినిమా టీఆర్పీ రారాజు. జెమినీలో ఈ సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు ఆ చానల్ కి అంటుకుపోతారు.

 

అంతులేని అగాధాలు దాటుకుంటూ ఎవరెస్ట్ ఎక్కిన యోధుడికి చిన్న చిన్న ఎత్తుపల్లాలు పెద్ద లెక్క కాదు. సినిమాని ప్రేమిస్తూ, తెలుగు సినిమా స్థాయి గురించి ఇతరులు మాట్లాడుకోవాలి, తెలుగు సినిమా కథలు ఇతర భాషల్లో సినిమాలుగా రూపుదిద్దుకోవాలి అనే మహేష్‌కి ఇలాంటి తాత్కాలిక జయాపజయాలు పెద్ద లెక్క కాదు. తన దృష్టి ఎప్పుడూ రేపటి వైపే, అందుకేనేమో ఎన్ని ఫ్లాపులొచ్చిన్నా హిట్ కొట్టడంటే మాత్రం అది బాక్సాఫిస్ రికార్డులని తిరగరాస్తుంది. ఈసారీ అదే అయ్యింది. 2011లో దూకుడు సినిమాతో బాక్సాఫిస్ పై స్వైర విహారం చేశాడు, ఆ వెంటనే బిజినెస్ మ్యన్ అంటూ మరో సారి బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు, మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. ఇహ తరువాత ఏంటి.. ముందే చెప్పాను తన చూపు ఎప్పుడూ కొత్తదనం వైపు, రేపటి వైపు అని. సినిమా అనేది మహేష్‌కి కేవలం సంపాదన కాదు, అది ఒక పాషన్, మరి ఎంతైనా కృష్ణ గారి అబ్బాయి కదా ఎక్కడికి పోతాయి పోలికలు. తన తండ్రిలాగే మహేష్‌కి సినిమానే ప్రపంచం .

వరస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ ఈసారి తన ఇమేజ్‌కి భిన్నంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చిన్నోడిగా అదర్నీ పలకరించాడు. వెంకటేష్మహేష్ కాంబోగా జనాల్ని అలరించిన ఈ సినిమా తన కెరీర్లో మరో మరపు రాని చిత్రం. అప్పటి వరకూ యాక్షన్ హీరోగా మహేష్‌ని చూసిన జనాలకి ఈ సినిమాలో ఓ పక్కింటి కుర్రాడిలా తెగ నచ్చేశాడు. ఆ తరువాత, 2014 లో వచ్చిన వన్నేనొక్కడినే పూర్తి భిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద విఫలమైనా, సుకుమార్ కీ, మహేష్ కీ చాలా మంచి పేరొచ్చింది. ఇది కూడా బుల్లితెర హిట్. ఆపై 2015లో శ్రీమంతుడు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొంది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2016 లో బ్రహ్మోత్సవం నిరాశ పరచగా, 2017 లో స్పైడర్ సినిమా ద్వారా మరోసారి పూర్తి భిన్నమైన కధనంతో సాగే కథతో వచ్చాడు మహేష్. 2018 లో భరత్ అను నేను సినిమాలో ఏకంగా సీఎంగా కనిపించి మెప్పించి మరో బాక్సాఫీస్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

సజీవంగా ఉన్న వ్యక్తికీ ఈసిజీలో గ్రాఫ్ పడుతూ లేస్తూ ఉంటుందిమహేష్ బాబులాగ. ఎప్పటికీ సజీవంగా ఉండే పాత్రలు, సినిమాలు చేయాలనుకునే వారి కెరీర్ గ్రాఫ్ కూడా అంతే.. ఓ కెరటం పడిపోయిందంటే దాని అర్థం అంతకంటే పెద్దగా మరో కెరటం వస్తుందని. పులి రెండడుగులు వెనక్కేసిందంటే మరింత కసిగా ముందుకి వస్తుందని. ఏది ఏమైనా ఎవడూ హిట్ కొడితే బాక్సాఫిస్ రికార్డ్లన్నీ బద్దలవుతాయో వాడే మహేష్ బాబు. ఎంత పెద్ద స్టారో అంత హుందా మనిషి. తోటి నటీనటులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగే స్నేహ శీలి. తీరిక వేళల్లో తన భార్యా, బిడ్దలతో కాలక్షేపం చేసే నిరాడంబరుడు. తన కొడుకు, కూతుర్లతో ఆటలాడుతూ, నాన్నకు కుడి భుజంగా ఉంటూ, తోబుట్టువులకు అండగా ఉంటూ, కుటుంబాన్ని అమితంగా ప్రేమించే అమ్మకూచి మన ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు.

 

25వ చిత్రం ద్వారా మహర్షిగా మనముందుకు రాబోతున్న రిషీ అలియాస్ మహేష్ బాబుకి, భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటు హృదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు తెలుపుతున్నాం.

రవి తేజ

 

 

 

 

 

 

 

 

 

 

 

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *