June 3, 2023

చెడుపై మంచి సాధించిన ప్రతీ సందర్భాన్ని భారతీయ సంప్రదాయం పండుగగా మార్చింది. అలాంటి పండుగల్లో ఒకటి హోలీ. రంగులు ఎంత అందంగా ఉంటాయో… జీవితం కూడా అంతే అందంగా ఉండాలని కోరుకునే వర్ణశోభిత ఉత్సవమే…హోలీ. ప్రేమ, అనురాగాలకు సూచికగా చేసుకునే పండుగ హోలీ. ఈ రంగులతో అనుబంధం భారతదేశానికే కాదు ప్రపంచమంతా ఉంది. రంగులంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి? వసంతాన్ని అహ్వానిస్తూ చేసుకునే పండుగ ఇది. ఋతువుల్లో వసంతమే రాణి. వసంత ఋతువు ప్రకృతికే అందాన్ని తెస్తుంది. అందుకే హోలీని వసంతోత్సవం అని అంటారు. హోలీకి మదనోత్సవం అనే పేరు కూడా ఉంది.

వసంతోత్సవం గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడి గురించి అందరికీ తెలుసు. ఆయన కుమారుడే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి కోసమే విష్ణువు నరసింహ అవతారం ఎత్తారు. అలాంటి హరణ్యకశిపుడికి ఓ చెల్లి ఉంది. ఆమె పేరు హోలిక. ఈమె పసిపిల్లను అపహరించి భక్షించేది. ప్రహ్లాదుని విష్ణు భక్తిని ఆపాలని హిరణ్యకశిపుడు ఎన్ని సార్లు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అప్పుడు ప్రహ్లాదుడికి అత్త వరస అయ్యే హోలిక పిలిచి ప్రహ్లాదుడిని భయపెట్టేందుకు ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. నిప్పు వల్ల ఎలాంటి ప్రమాదం లేని ఓ వస్త్రం హోలిక దగ్గర ఉండేది. ఆ వస్త్రం కప్పుకుంటే హోలీకను నిప్పు ఏమీ చేయలేదు. అందుకే చితిని మండించి అందులో హోలికను కూర్చోబెట్టాడు హిరణ్య కశిపుడు. ఆమె ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోమన్నాడు. ప్రహ్లాదుడు శ్రీ హరిని ప్రార్థించాడు. వెంటనే చితి మంటలు ఎగిసి హోలిక కప్పుకున్న ఆ మాయా వస్త్రం ఎగిరి ప్రహ్లాదుని కప్పింది. హోలిక అగ్నికి ఆహుతి అయింది. అప్పటికే పిల్లల్ని తినేస్తున్న ఆ రాక్షసి మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అందుకే ఆమె మరణించిందన్న వార్త తెలిసి ప్రజలు రంగులు చల్లుకుని పండుగ చేసుకున్నారు. అలా హోలీ పండుగ వచ్చిందని కథలు ఉన్నాయి.

హోలీ పండుగకు మరో కథ ఉంది. తారక అనే రాక్షసుడు ఉండేవాడు. పరమేశ్వరులకు పుట్టిన కుమారుడి వల్లే తనకు మరణం రావాలని వరం పొందాడు. అప్పటి పరమేశ్వరుడు సతీదేవి వియోగంలో ఉన్నాడు. ధ్యాన ముద్రలో ఉన్న పరమేశ్వరుడిని పార్వతి సేవిస్తోంది. అయినా శివుడికి పార్వతిపై ఎలాంటి ధ్యాసా లేదు. పార్వతితో పెళ్లి అయ్యే అవకాశం లేదని, అందువల్ల శివుడికి పిల్లలు పుట్టరని… తారక రాక్షసుడు విజృంభించాడు. ఇంద్రుడితో సహా దేవతలంతా భయపడ్డారు. పరమేశ్వరుడు పార్వతిని వివాహం చేసుకుంటే తప్ప తారకుడి నుంచి కష్టాలు తప్పవని గ్రహించారు. అప్పుడు పార్వతి దేవి మీద ప్రణయం కలిగించేందుకు బ్రహ్మ… మన్మథుడిని పంపించారు. అప్పుడే వసంత ఋతువుని సృష్టించి… ప్రకృతిని అత్యంత సౌందర్యంగా మార్చాడు మన్మథుడు. తన మదన బాణాలను శివుడిపై ప్రయోగించాడు. పరమేశ్వరుడి మనసు చలించింది. తపస్సు భంగమైంది. శివుడికి ఆగ్రహం వచ్చింది. తన త్రినేత్రంతో మన్మథుడిని భస్మం చేశాడు. మన్మథుడి భార్య రతీ దేవి. ఆమె బతిమాలుకుంటే… మన్మథుడిని బతికించాడు శివుడు. కానీ అమెకు ఒక్కరికే కనిపిస్తాడని చెప్పాడు. ఈ సంఘట ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగింది. అందుకే ఆ రోజుకి కామదహనోత్సవం అనే పేరు పెట్టారు.

మన తెలుగు వారికి సంక్రాంతి ఎంత పెద్ద పండుగో… ఉత్తరాది వారికి హోలీ అంత పెద్ద పండుగ. అంతేకాదు సంక్రాంతి మన రైతుల పండుగ అయితే, హోలీ ఉత్తరాది రైతుల పండుగ. అక్కడి వారు గోధుమలు కోతకు వచ్చే సమయంలో అంతా హో హో అంటూ పాటలు పాడతారు. అలా హోలీ వచ్చిందని కూడా అంటారు. మొత్తానికి ఎన్నో వర్ణాలతో రంగుల మబ్బులను సృష్టించే ఈ అద్భుతమైన పండుగ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వసంతానికి హోలీ పండుగే వధువు. కాముడే వరుడు. అంత అందమైన పండుగ ఇది. శ్రీ కృష్ణుని కాలంలో హూలీ పండుగ ప్రాశస్త్యం ఇంకా పెరిగింది. కృష్ణుడు పుట్టిన మధుర, బృందావనం, నందగావ్‌లో హోలీ పండుగను 16 రోజులు జరుపుతారు. స్త్రీలు రాధలుగా, పురుషులు కృష్ణులాగ మారి ఆట పట్టించుకుంటారు. లగాన్‌ సినిమా రాధ కైసే న జలే… అనే పాట ఈ నేపథ్యంలోనిదే. బృందావనంలో రాధా కృష్ణుల కోలాటాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తారు.

బెంగాల్‌లో ఈ పండుగను డోలోత్సం అంటారు. డోల అంటే ఊయల. శ్రీ కృష్ణుడికి పూజలు చేసి బొబ్బట్లు ప్రసాదంగా పెట్టడం అక్కడి సంప్రదాయం. మన శ్రీకాకుళంలో మాత్రమే ఉన్న అరుదైన శ్రీ కూర్మ క్షేత్రంలో హోలీ పండుగ రోజున డోలోత్సవం నిర్వహిస్తారు. అక్కడ జరిగే ఈ ఉత్సవాన్ని డోలాయాత్ర అంటారు. అసలైన రంగుల పండుగ మాత్రం ఉత్తదారిలోనే చూడాలి. ముఖ్యంగా శ్రీ కృష్ణుడి ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో హోలీ పండుగ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. ఇప్పుడంటే కెమికల్‌ రంగులు వాడుతున్నారు గానీ హోలీ రంగుల వెనుక ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. వేపగింజలు, కుంకుమ, పసుపు, సంప్రదాయ చెట్టు బెరడుల నుంచి వచ్చే రంగులను హోలీకి ఉపయోగించేవారు. ముఖ్యంగా పసుపు ఎక్కువ వాడేవారు. పసుపు యాంటీ బయాటిక్‌ అని తెలిసిందే. హోలీ పండుగలో ఈ పసుపు ఎక్కువ వాడడం వల్ల చర్మ రోగాలు మాసిపోయేవి. కెమికల్‌ రంగుల వల్ల చర్మ రోగాలు వస్తాయి. కనుక సంప్రదాయ రంగులు వాడండి. ఆరోగ్యకరమైన హోలీని జరుపుకోండి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *