June 7, 2023

ఆగస్ట్‌ 15 నాటికి వచ్చేస్తుందా? వస్తే అద్భుతమే…ఎందుకంటే?

ఆగస్ట్‌ 15 నాటికి వచ్చేస్తుందా? వస్తే అద్భుతమే…ఎందుకంటే?

ఆగస్ట్‌ 15 నాటికి కరోనా నుంచి మనకు స్వతంత్రం వస్తుందంటున్నారు. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌పై ఇంటర్నేషనల్‌ ఫోకస్‌ ఉంది. దానికి కారణం అత్యంత వేగంగా ప్రీక్లినికల్‌ ట్రయల్స్ పూర్తైనట్టు ప్రకటించడమే.కోవాగ్జిన్‌ సక్సెస్‌ అయితే అది ప్రపంచ వ్యాక్సిన్‌ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమే.భారత్‌ సొంతంగా ఆవిష్కరించిన తొలి వ్యాక్సిన్‌ కూడా ఇదే అవుతుంది. అంతేకాదు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్.. ఈ పరిశోధనలో విజయం సాధిస్తే.. మన తెలుగు గడ్డ మీద తయారైన ఘనతా దక్కుతుంది. ఇదే జరిగితే అద్భుతం. ఎందుకంటే ఇంత త్వరగా ఒక వ్యాక్సిన్‌ ల్యాబ్‌ నుంచి మార్కెట్లోకి వచ్చిన సందర్భాలు మెడికల్‌ హిస్టరీలో లేవు. కరోనా వ్యాక్సిన్‌ వస్తేఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి పునర్జన్మ ఇచ్చినట్టే. కానీ వైరస్‌లు, వ్యాక్సిన్లు అంటేనే ఫార్మాసూటికల్స్‌ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఫార్మా అంటేనే వేల కోట్ల బిజినెస్‌. డబ్బు సంగతి సరేఈ వ్యాక్సిన్‌తో లక్షల ప్రాణాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ఇలాంటి అంశాలపై ఖచ్చితంగా ప్రజలకు వివరాలు తెలియాలి. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వ్యాక్సిన్‌ అంటేనే అతి కష్టమైన ప్రక్రియ. ఒక్కోసారి కొన్ని టీకాలకు 10 నుంచి 15 ఏళ్లు కూడా పట్టొచ్చు. 19వ శతాబ్దంలో స్మాల్‌పాక్స్‌, రేబిస్‌, ప్లేగ్‌, కలరా, టైఫాయిడ్‌లకు వ్యాక్సిన్లు కనుగొన్నారు. ఒక్కో వ్యాక్సిన్‌కి చాలా ఏళ్లు పట్టింది. ఆ తర్వాత కూడా కొన్ని టీకాలు వచ్చాయి. ఆ మధ్య ప్రపంచాన్ని భయపెట్టిన ఎబోలా, నిఫా లాంటి వైరస్‌లకు ఇప్పటివరకు సరైనా టీకా లేదు. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి. అంతెందుకు 30 ఏళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్‌కి ఇంకా వ్యాక్సిన్‌ రాలేదు. ఇంకా పరిశోధన దశలోనే ఉంది. కానీ ప్రస్తుత కరోనా కల్లోలాన్ని నివారించాలంటే ర్యాపిడ్‌ స్పీడ్‌తో ప్రయోగాలు జరగాల్సిందే తప్పదు. వ్యాక్సిన్‌ పరిశోధనలో చాలా స్టేజ్‌లు ఉన్నాయి. వాటిలో మొదటిది రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌. ఇది ప్రతీ ఫార్మాలో ఉండే విభాగమే. ఒక వ్యాక్సిన్‌ R&Dకి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కనీసం రెండేళ్లు పడుతుంది. అందులో ఆ వైరస్‌ జన్యు క్రమాన్ని డీకోడ్‌ చేస్తారు. అయితే కోవిడ్‌-19కి ఇంత సమయం అవసరం లేకపోయింది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి కరోనా వైరస్‌ సోకింది. అందువల్ల చాలా దేశాలు ఈ వైరస్‌ మీద ప్రయోగాలు మొదలు పెట్టాయి. జనవరిలో చైనా వైద్యులు ఈ వైరస్‌ జెనెటిక్‌ సీక్వెన్స్‌ని కనిపెట్టారు. అందువల్ల కొవిడ్‌-19 వైరస్‌ R&D సమయం మనకు మిగిలింది అనుకోవచ్చు.

R&D తర్వాత దశ ప్రిక్లినికల్‌. అంటే జంతువుల మీద ప్రయోగాలు. ఇక్కడి నుంచే కరోనా వ్యాక్సిన్‌ విషయంలో చాలా మంది వైద్యుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రిక్లినికల్‌ ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ని సాధారణంగా ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగిస్తారు. ఇలా జంతువులపై ప్రయోగాలు సాధారణంగా కనీసం రెండేళ్లు చేస్తారు. ఇక్కడ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ప్రయోగాలు ఫాస్ట్‌ట్రాక్‌లో జరిగాయి. రెండు నెలల లోపే భారత్‌ బయోటెక్‌ ప్రీక్లీనికల్‌ ట్రయల్స్‌ పూర్తయినట్టు చెప్తున్నారు. జంతువులపై ప్రయోగాలకు కనీసం 3 నెలలు టైం పడుతుందని భారత్ బయోటెక్‌ ఎండీనే ఆ మధ్య ఓసారి చెప్పారు. ఇదే మాట ICMR కూడా చెప్పింది. మరి 50 రోజుల్లోనే ట్రయల్స్‌ పూర్తవడం, వాటిని కేంద్రం స్థాయిలో నిర్ధారించి, తర్వాత దశకు అనుమతి ఇవ్వడం ఎలా సాధ్యమని ఈ రంగానికి చెందిన కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ విషయానికి వస్తేమన దేశంలో ICMR సూచనలతో పుణెలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కరోనా వైరస్‌ రకాన్ని మే 9న భారత్‌ బయోటెక్‌కి ఇచ్చింది. ఆ తర్వాత భారత్‌ బయోటెక్‌ ప్రిక్లీనికల్‌ ట్రయల్స్‌ మొదలు పెట్టింది. అవి సక్సెస్‌ అయ్యాయని ప్రకటించారు. ఆ తర్వాత మొదటి, రెండో దశ క్లీనికల్‌ ట్రయల్స్‌కి ICMR అనుమతి జూన్ 29న అనుమతి ఇచ్చింది. మే 9 నుంచి జూన్‌ 29 అంటే జస్ట్‌ 50 రోజుల్లో ప్రీక్లీనికల్‌ ట్రయల్స్‌ అయిపోయాయి. ఇక ఇప్పుడు మొదటి, రెండో దశ ప్రయోగాలు. సాధారణంగా మొదటి దశలో కనీసం 3 నెలలు కొంత మంది మనుషులపై ప్రయోగించి ఫలితాలు రివ్యూ చేస్తారు. అది సక్సెస్‌ అయితే రెండో దశలో ఎక్కువ సంఖ్యలో మనుషులకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తారు. ఇది కనీసం ఆరు నెలల పాటు సాగే ప్రక్రియ. అంటే రెండు దశలకు కలిపి కనీసం 9 నెలలు. ఇందులో మూడో దశ కూడా ఉంది. సెకను సెకనుకి కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ సమయంలో మన దగ్గర ప్రయోగాలకు అంత సమయం లేని మాట వాస్తవం. అందుకే ఈ రెండు దశలకు కనీసం ఐదారు నెలలు పడుతుందని భారత్‌ బయోటెక్‌ డైరెక్టర్‌ సుచిత్ర బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆగస్ట్‌ 15 నాటికిఅంటే వచ్చే 50 రోజుల్లోవ్యాక్సిన్‌ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ICMR చెప్తోంది. ఇదెలా సాధ్యమన్నదే ప్రశ్న. కంపెనీపై ICMR ఒత్తిడి చేస్తోందా? వ్యాక్సిన్‌ తొందరగా తేవాలన్న లక్ష్యం మంచిదే. కానీ ప్రాణాలతో వ్యవహారం తొందరపడితే మొదటికే ప్రమాదం అంటున్నారు నిపుణులు.

మొత్తానికి వ్యాక్సిన్‌ సక్సెస్‌ అయ్యి.. ఆగస్టు 15లోపు వస్తే అంతకన్నా ఏం కావాలి. ఆగస్ట్‌ 15లోపు వ్యాక్సిన్‌ తెస్తాం అని భారత వైద్య పరిశోధన సంస్థ.. ICMR చెప్తుంటే WHO మరోలా చెప్తోంది. ప్రపంచం వ్యాప్తంగా 18 వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశకు చేరుకున్నాయని, వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో ఇప్పుడే అంచనా వేయలేమని, ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ ఎలా పనిచేస్తుందో మాత్రమే చెప్పగలమని WHO అంటోంది. భారీ స్థాయిలో ఉత్పత్తి గురించి కూడా ఇప్పుడప్పుడే చెప్పలేమని WHO అంటోంది. ఆగస్ట్‌ 15 నాటికి వ్యాక్సిన్‌ తెస్తామంటున్న ICMR ప్రకటనకు, WHO మాటలకు అసలు సంబంధమే లేదు. మొత్తానికి కరోనా వ్యాక్సిన్‌ విషయంలో చాలా కన్ఫ్యూజన్లు ఉన్నట్టున్నాయి. ఈ కన్ఫ్యూజన్లకు క్లారిఫికేషన్లు ఎవరిస్తారో మరి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *