అలనాడు రామాయణంలో సీతారాములు నడిచిన ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా. అయితే వచ్చేస్తోంది శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్. వచ్చే నవంబర్ లో శ్రీ రామాయణ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో స్పెషల్ టూరిస్ట్ ట్రైన్‌కి భారత రైల్వే పచ్చజెండా ఊపింది. . ఈ రైలు అయోధ్య నుంచి రామేశ్వరం మధ్య రామాయణంలో ముఖ్య ప్రదేశాలను కలుపుతూ వెళ్తుంది. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ మేరకు మంగళ వారం ట్వీట్ చేశారు. నవంబర్ 14న దిల్లీలో ఈ ప్రత్యేక రైలు ప్రారంభోత్సవం జరుగుతుంది. శ్రీ రామాయణ్ ఎక్స్‌ప్రెస్ మొత్తం ప్రయాణం 16 రోజులు. దిల్లీ నుంచి అయోధ్య, నందిగ్రామ్, సీతా మర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శృంగవర్‌పూర్, చిత్రకూట్, నాసిక్, రామేశ్వరం వరకు 16 రోజుల యాత్ర సాగుతుంది. ఈ యాత్రా స్పెషల్‌లో 800 బెర్తులుంటాయి. ఐఆర్ సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక్కో యాత్రికునికి ప్రయాణం, భోజనం, వసతి, సైట్ సీయింగ్ అన్ని కలిపి రూ.15,120 ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ టూర్ ప్యాకేజీలో శ్రీ లంక యాత్ర కూడా ఉంది . వెళ్లాలి అనుకునే వారు రామేశ్వరం యాత్ర తర్వాత చెన్నై నుంచి కొలంబో చేరేలా విమాన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. శ్రీ లంక టూరిజం శాఖ అక్కడ రామాయణ ప్రాంతాలను చూపిస్తారు. రామేశ్వరం – శ్రీలంక యాత్రా ప్యాకేజీ ఛార్జీలు అదనం.. త్వరలోనే బుకింగ్ కూడా ఓపెన్ చేస్తామని రైల్వే శాఖ చెప్తోంది. శ్రీ సీతారాముల పాదస్పర్శతో పునీతమైన క్షేత్రాలను చూడాలనుకునేవారికి ఇది మంచిఅవకాశం