ఇస్రో చరిత్రలోనే కాదు… ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలు రాయి. చంద్రయాన్ ప్రయోగం తొలి ఘట్టం విజయవంతమైంది. చందమామను పలకరించేందుకు చంద్రయాన్-2 ప్రయాణమైంది. అత్యంత ఉత్కంఠ మధ్య శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ– మార్క్ 3 రాకెట్ ఏ అడ్డంకులు లేకుండా నింగికెగసింది. నిర్దేశిత కక్ష్యలో మాడ్యూల్‌ను వదిలిపెట్టిన వీడియోలను లైవ్‌లో చూపించింది ఇస్రో. సెప్టెంబర్ రెండవ వారంలో చంద్రయాన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపైకి చేరి… మన మూన్ రోవర్ ప్రగ్యాన్‌ని చంద్రుడిపై వదిలిపెడుతుంది.
చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ ఆ మామ మీద పాటలు పాడుకుంటాం. కానీ, మామా.. మేమే వస్తున్నాం.. అంటోంది మన భారత చంద్రయాన్-2. దేశమంతా ఉద్విగ్నంగా ఎదురుచూసిన ప్రయోగం. పూర్తి ఇండియన్ టెక్నాలజీతో తయారైన చంద్రయాన్-2 వెరీ వెరీ స్పెషల్. చంద్రుడి కక్ష్యలో స్థిరంగా తిరుగుతూ ల్యాండర్‌ని వదిలే ఆర్బిటర్. మన ల్యాండర్ పేరు విక్రమ్. ఆ విక్రమ్ నుంచి బయటకు వచ్చే రోవర్ పేరు ప్రగ్యాన్. ఆర్బిటర్, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్.. ఈ మూడింటిని కలిపి కాంపోజిట్ మాడ్యూల్ అంటారు. వేరు వేరు పనులు చేసే ఈ మూడింటిని ఒకే టైంలో ఒకే రాకెట్‌లో ప్రయోగించడమే చంద్రయాన్‌లో కాంప్లికేషన్. చంద్రయాన్-2లోని ఆర్బిటర్ ఒక ఏడాది పాటు పనిచేస్తుంది. కానీ, చంద్రుడిపై దిగే రోవర్ మాత్రం 14 రోజులు మించి పనిచేయకపోవచ్చు. చంద్రుడిపై పగలు 14 రోజులు ఉంటుంది. ఈ వెలుతురు ఉన్నన్నాళ్లే రోవర్ సోలార్ ప్యానళ్ళు పనిచేస్తాయి. మిగిలిన 14 రోజులు ఉన్న కోల్డ్‌ని రోవర్ తట్టుకుని నిలబడుతుందా లేదా అన్నది ఇంకా తెలీదు. చంద్రుడి సౌత్ పోల్ దగ్గరలో ల్యాండర్, రోవర్‌లు దిగేటట్టు మన సైంటిస్టులు నావిగేట్ చేశారు. చంద్రుడిలో ఆ భాగం చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి ఏ దేశం రోవర్లు పంపించలేదు. అక్కడైతే ల్యాండింగ్‌కి అనుకూలం. అలాగే అక్కడ నీరు భారీ స్థాయిలో ఐస్ రూపంలో ఉండొచ్చని మన సైంటిస్ట్‌ల అంచనా. మన సోలార్ సిస్టమ్ పుట్టుకకి సంబంధించిన ఎన్నో రహస్యాలకు అక్కడ జవాబులు దొరుకుతాయని మన సైంటిస్టులు ఎదురుచూస్తున్నారు.
చంద్రయాన్ 2ని ఇస్రో భారీ రాకెట్ జీఎస్ఎల్వీ–మార్క్ 3 తీసుకెళ్లింది. భూమికి 170 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఈ ప్రయాణం అంత సులువు కాదు. శ్రీహరి కోట నుంచి జీఎస్ఎల్వీ– మార్క్3 బయలుదేరాక.. 170 కిలోమీటర్ల ఎత్తులో భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో 20 వేల కిలోమీటర్ల ప్రదక్షిణం చేసిన తర్వాత… చంద్రయాన్-2 మాడ్యూల్‌ని వదులుతుంది. అక్కడి నుంచి చంద్రయాన్-2 మాడ్యూల్ ఎర్త్ ఆర్బిట్‌లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో 16 రోజుల పాటు తిరుగుతూనే ఉంటుంది. అలా స్టెప్ బై స్టెప్ కక్ష్యను పెంచుకుంటూ.. చంద్రయాన్ మాడ్యూల్… మూన్ ఆర్బిట్‌లోకి వెళ్తుంది. అప్పుడు చంద్రుడి దిశగా మన చంద్రయాన్ కదులుతుంది. దీనికి మరో 5 రోజులు పడుతుంది. అప్పుడు మళ్లీ రాకెట్ల ద్వారా చంద్రయాన్‌ని జాబిల్లి కక్ష్యలోకి పంపిస్తారు. ఇక్కడికి 21 రోజులు పూర్తవుతాయి. నెక్స్ట్ స్టెప్… కక్ష్య నుంచి క్రమంగా చంద్రయాన్ కిందకు దిగుతుంది. మూన్ ఆర్బిట్‌లో 100 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 స్థిరంగా తిరుగుతూ ఉంటుంది. ఈ స్టెప్‌కి మరో 27 రోజుల టైం పడుతుంది. ఇది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే… 80 పర్సెంట్ విజయం వరించినట్టే. మూన్ ఆర్బిట్‌లో సేఫ్‌గా చంద్రయాన్ తిరుగుతున్న దశలో… సెట్ చేసిన టైంలో ల్యాండర్‌ని వదులుతుంది. మూన్ ఆర్బిటర్ మాత్రం చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులోనే తిరుగుతూ ఉంటుంది. రాకెట్ల సహాయంతో ఆ ల్యాండర్… స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. మన ల్యాండర్ విక్రమ్… 30 కిలోమీటర్ల ఎత్తునుంచి చంద్రుడి మీద దిగడం కీలక ఘట్టం. మన ల్యాండర్‌కి ఆ 30కిలోమీటర్ల ప్రయాణానికి 15 నిమిషాలు పడుతుంది. అంటే 2 నిమిషాలకు ఒక కిలోమీటరు వేగం. ఈ వేగాన్ని నియంత్రించడం ఇస్రోకి కష్టం. అందుకే ల్యాండర్‌కే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఏర్పాటు చేశారు. ఆ 30 కిలోమీటర్ల ప్రయాణం ల్యాండర్ నిర్ణయాల మీదే ఉంటుంది. ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ ప్రయోగించిన మ్యూన్ ఆర్బిట్ ఈ 30 నిమిషాల టైంలోనే కంట్రోల్ తప్పి కూలిపోయింది. చంద్రయాన్-2కి ఇలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆశిద్దాం.
చంద్రుడి మీద ల్యాండర్ దిగేంతవరకు మొత్తం ప్రయోగానికి దాదాపు పట్టే సమయం 50 రోజులు అటు ఇటు. ల్యాండర్ చంద్రుడి మీద దిగాక రోవర్ బయటకు వచ్చి జాబిల్లిపై విహరిస్తుంది. రోవర్ ప్రగ్యాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. రోవర్ ఓ సూట్‌కేస్ అంత ఉంటుంది. ఈ మెషీన్ అల్యుమినియంతో చేసిన చక్రాలతో నడుస్తుంది. చంద్రుడిపై కూరుకుపోకుండా… రోవర్లో ప్రతీచక్రానికి మోటార్ బిగించారు. రోవర్ అమర్చిన సూపర్ సెన్సర్లు ఏ దారిలో వెళ్లాలో చెప్తుంటాయి. ఈ రోవర్‌ని ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తయారు చేశారు. సెకనుకి రెండు సెంటీమీటర్లు మాత్రమే కదిలే ఈ రోవర్ జాబిల్లి ఉపరితలాన్ని డీటైల్డ్‌గా శోధించి వివరాలు పంపిస్తుంది. అక్కడి నీరు, మట్టి, కెమికల్స్‌ని అక్కడికక్కడే టెస్ట్ చేసి రిపోర్ట్స్ కూడా పంపిస్తుంది. ఇది మన చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక అంశాలు.