June 3, 2023

మోడీజీ… వీళ్లను అలా వదిలేసారేంటి సార్…!!!

మోడీజీ… వీళ్లను అలా వదిలేసారేంటి సార్…!!!

వీళ్లు గుర్తున్నారా? గుర్తు లేరాఅయితే ఓ సారి ఫ్లాష్‌ బ్యాక్‌కి వెళ్దాం. 2012 ఫిబ్రవరి 15. మన కేరళ తీర ప్రాంతంలో ఓ ఇటలీ నౌక వచ్చింది. మన జలాల్లో ఇటలీ నౌకకి ఏం పని అని అడక్కండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చెప్పలేదు. ఆ వచ్చిన వాళ్లు తిన్నగా ఉన్నారా? లేరు. అక్కడే చేపలు పడుతున్న కేరళ మత్స్యకారులతో గొడవ పెట్టుకున్నారు. గొడవ పెద్దదైంది. ఇటలీ నౌకా సిబ్బంది ఆ మత్స్యకారులను తుపాకీలతో కాల్చి చంపేశారు. మన దేశ కోస్ట్‌ గార్డ్‌లు ఇటలీ నౌకను స్వాధీనం చేసుకున్నారు. మత్స్యకారులను చంపినందుకు ఈ ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత కథ మరీ దారుణం.

అసలా ఇటలీ నౌక మన భారత జలాల్లోకి ఎందుకొచ్చింది? దేశ భద్రతకు సంబంధించిన అంశమిది. దీని మీద అప్పటి ప్రభుత్వం నోరు మెదప లేదు. అప్పట్లో సోనియా రాజ్యం. అమె మాటే శాసనం. పైగా ఆమె పుట్టిల్లు ఇటలీ.అందువల్ల ఆ ఇటలీ నౌకా సిబ్బంది మీద ఈగ వాలనీయలేదు. మన తీరానికి వచ్చి మన వాళ్లను కాల్చి చంపేస్తే… చంపిన వాడు ఎవరైనా… మన చట్టాలకు అనుగుణంగానే వాళ్లను విచారించాలి. కేసు విచారణ కూడా ఇక్కడే జరగాలి. కానీ అలా జరిగిందా? లేదు. కేరళలో కేసు ఫైల్‌ కాగానే చంపిన ఆ ఇటలీ వాళ్లకు.. మన ఇండియాలో కొందరు ఇటాలియన్లు, ఒక చర్చి మద్దతుగా నిలిచాయి. కేసుకి మసి పూసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాయి. ఈ వ్యవహారాలను కేరళ హైకోర్టు కొట్టి పారేసింది. ఆ తర్వాత ఈ విషయం కేంద్రం వరకు వెళ్లింది. అసలే అప్పటికే సోనియా మన దేశానికి సుప్రీమ్‌. పేరుకి మన్మోహన్‌ ఉన్నాఅధికారం సోనియాదే కదా. ఒక కాంట్రవర్షియల్‌ ఉత్తర్వు ద్వారా ఈ ఇటలీ కేసుని సుప్రీం కోర్టుకి బదిలీ చేశారు. ఆ ఇటలీ హంతకులను కేరళ జైల్‌ నుంచి ఢిల్లీకి మార్చారు. అక్కడ జైల్లో వేయాలి కదా.. లేదుఇటలీ ఎంబసీలో అన్ని సౌకర్యాలు కల్పించారు. క్రిస్‌మస్‌కి కుటుంబాలతో గడపాలని ఈ ఇద్దరూ అడిగారు. అప్పుడు వాళ్ల తరపు లాయర్‌ ఎవరో తెలుసాదేశంలో ప్రముఖ లాయర్లలో ఒకరైన హరీష్‌ సాల్వే. క్రిసమస్‌ సెలవులు అడగ్గానే ఈ ఇద్దరు ఇటాలియన్లను కొత్త అల్లుళ్లను పంపినట్టు 3 నెలలకు గాను ఇటలీ పంపించారు. ఇక వెళ్లిన వారు తిరిగి రాలేదు. ప్రభుత్వం అడగనూ లేదు.

అప్పుడు సుబ్రమణ్య స్వామి ఎంటరయ్యారు. ఇటలీ ఎంబసీ మీద సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార కేసు వేశారు. సుబ్రమణ్య స్వామి ఎంటరవగానే హరీష్‌ సాల్వే జంప్‌. ఆయన తర్వాత మరో ప్రముఖ లాయర్‌ ముకుల్‌ రోహత్గి ఇటలీ వాళ్ల తరపున వచ్చారు. అబ్బో ఆ ఇటలీ వాళ్ల మీద అప్పటి ప్రభుత్వం చూపించిన పుట్టింటి ప్రేమ అంతా ఇంతా కాదు. అప్పట్లో గుజరాత్‌ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు ఈ విషయంపై ప్రభుత్వంపై చాలా విమర్శలు చేశాయి. దేశభక్తి భారత్‌పైనా, ఇటలీపైనా? అంటూ విమర్శలూ చేశాయి. విషయం ఎక్కడికో వెళ్తోందని గమనించి ఆ ఇటలీ ముద్దాయిలను భారత్‌ రప్పించారు. అప్పుడు కూడా వారు ఇటలీ ఎంబసీలోనే ఉన్నారు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ప్రధానిగా మోడీ ఎన్నికయ్యారు. అప్పటికి ఆ ఇటలీ ముద్దాయిలు ఎంబసీలోనే ఉన్నారు.

2016… ఈ కేసుని సుప్రీం పరిథి నుంచి, యూఎన్‌ ట్రైబ్యునల్‌కి మార్చడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఇటలీ ముద్దాయిలు వాళ్ల దేశానికి వెళ్లిపోయారు. వాళ్లను ఆపే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. రీసెంట్‌గా 2020 జూలై 2న యూఎన్‌ ట్రైబ్యునల్‌ ఈ కేసుపై మాట్లాడింది. ఈ నేరంపై విచారణ భారత్‌లో జరగకూడదని, ఇటలీలో జరగాలని చెప్పింది. నేరం జరిగింది మన జలాల్లో, చనిపోయింది మనవాళ్లు, విచారణ ఇటలీలో జరగాలట..!! ఇంత కన్నా అన్యాయం ఏముంది?

సోనియా ఇటాలీలో పుట్టారు కాబట్టి పుట్టింటి ప్రేమ చూపించారు అనుకుందాం. మోడీ వీళ్లకు శిక్ష పడేలా చేయాలి కదా. పోనీ ఇండియా, ఇటలీ మధ్య డిప్లమాటిక్‌గా పెద్ద పెద్ద వ్యవహారాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు. అమెరికా ఒత్తిడికి కూడా లొంగని మోడీ.. ఇటలీ ఒత్తిడికి లొంగి.. మన వాళ్లను చంపిన హంతకులను పంపించేశారా? ఇదెక్కడి న్యాయం సారూ. అలా ఎలా పంపించేశారు? ఇది మన దేశ గౌరవానికే భంగం కదా?

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *