పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు గాజువాక, భీమవరంలో సందడే సందడి. ఇప్పటికే పవన్ గాజువాకలో నామినేషన్ వేశారు. సామాజిక వర్గం, జనసేన అభిమానం, వామపక్ష భావజాలం మూడు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం గుడ్ స్టెప్
గాజువాకలో తిరుగులేదు
గాజువాక… గాజువాక ప్రాంతం మెగా అభిమానులకు పెట్టని కోట. 2009లో ప్రజారాజ్యం తరపున చింతలపూడి వెంకటరామయ్యని నిలబెడితే విజయం సాధించారు. ఇప్పటికి ఆ ఓటు బ్యాంకు పవన్ వైపే సేఫ్‌గా ఉంది. గాజువాకలో కాపుల ఓటు బ్యాంకు అధికం. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గెలిచారు. ఈ సారీ ఆయనే నిలబడుతున్నారు. ఇక వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన 2009, 14ల్లో రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయన మీద సానుభూతి బాగానే ఉంది. కానీ, పవన్ వచ్చాక సమీకరణాలు మారిపోయాయి. ఎందుకంటే కాపు ఓటు బ్యాంకు, అభిమానులు పవన్‌కి అండగా ఉన్నారు. గాజువాకలో కార్మికులు, మధ్యతరగతి వారు ఎక్కువ. కార్మికుల్లో అధికం వామపక్షాల వైపే ఉంటాయి. వామపక్షాల ఓట్లు దాదాపు 25 వేల వరకు ఉన్నాయి. జనసేన– వామపక్షాల పొత్తు వల్ల ఆ ఓటు బ్యాంకు సాలిడ్‌గా జనసేనకు పడుతోంది. దాదాపు 60 వేల తూర్పు కాపు ఓట్లు, 50 వేల యాదవుల ఓట్లే గెలుపు ఓటములని డిసైడ్ చేస్తాయి. ఎటు నుంచి చూసినా పవన్ లక్షకు పైగానే ఓట్లు రావడం ఖాయం. అందుకే గాజువాక సేఫ్ జోన్ అని పవన్ ఈ నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. పైగా విశాఖ ఎంపీ సీటుకి జేడీ పోటీ చేస్తున్నారు. పవన్–జేడీ కాంబో ఈ సారి సంచలనాలు సృష్టించడం ఖాయం. అభిమానులు, సామాజిక వర్గ ఓటు బ్యాంకు, వామపక్షాలు, యూత్ ఓటింగ్‌తో పవన్ గాజువాక చాలా సేఫ్‌గా గట్టెక్కేస్తారని విశ్లేషకుల అంచనా…
పవన్ vs భీమవరం పాలిట్రిక్స్
ఇక భీమవరం… సంపన్నులైన కాపులకు, రాజులకు కేరాఫ్ అడ్రస్ భీమవరం. సొంత జిల్లా అవడం వల్ల పవన్‌కి పట్టు ఉంటుంది. 2 లక్షలకు పైగా ఓట్లు ఉన్న భీమవరంలో కాపులు ఓట్లు 50 వేలు, గౌడ ఓట్లు 40 వేలు. వీరి తర్వాత రాజులు అధికం. వీరే గెలుపుని డిసైడ్ చేస్తారు. ఇప్పటి వరకు భీమవరంలో అయితే టీడీపీ, లేదంటే కాంగ్రెస్ గెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డుని చెరిపేసి పవన్ రిచీ రిచ్ భీమవరంలో ట్రెండ్ సెట్ చేస్తారని అంతా అంటున్నారు. ఇన్నాళ్లూ బీసీలు, కాపుల సపోర్ట్‌తోనే కాంగ్రెస్, టీడీపీలు గెలిచాయి. ఇప్పుడు సీన్ మారింది. కాపులు, రాజులు కూడా పవన్‌కే తమ సపోర్ట్ అని పోలింగ్ డే కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం పార్లమెంటు స్థానం నర్సాపురం నుంచి వైసీపీ నుంచి రఘురామ కృష్ణం రాజు, టీడీపీ నుంచి శివ రామ రాజు పోటీ చేస్తున్నారు. ఇద్దరూ రాజులే అక్కడ పాలిట్రిక్స్ బాగానే నడుస్తున్నాయి మరి. నర్సపురం ఎంపీ స్థానానికి జనసేన నుంచి నాగబాబు పోటీ చేస్తున్నారు. అయితే ఎన్ని సమీకరణాలు ఉన్నా, ఎంత ధనబలం చూపించినా పవన్ ఛరిష్మా.. భీమవరంలో జనసేన జెండా రెపరెపలాడిస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరపున, 14లో టీడీపీ తరపున పోటీ చేశారు. ఈయన మంత్రి గంటా వియ్యంకుడు. గత ఎన్నికలో బీసీ ఓట్‌తో పాటు, పవన్ మద్దతు కూడా ఉండడం వల్లే రామాంజనేయులు గెలిచారు. ఇప్పుడా ఓటు భారీగా చీలి పవన్ వైపు తిరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ మరోసారి బరిలో దిగారు. ఇక్కడ వైసీపీకి అంత ట్రాక్ రికార్డ్ లేదు. ఈ లెక్కన విశాఖ, భీమవరం రెండు చోట్ల జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.