లోకనాయకుడు..! అంటే యూనివర్సల్ హీరో, కమల్ హాసన్ గారికి మనమిచ్చుకున్న ముద్దు పేరు. తీరిక దొరకాలేగాని ఉత్తమ విలన్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఉత్తమ కమెడియన్, చివరికి ఉత్తమ హీరోయిన్‌గా కూడా పేరు తెచ్చుకోగల నటనా చాతుర్యం ఆయన సొంతం. హీరోగా కంటే నటుడిగా, ఓ కళాకారుడిగా తనని తాను పరిచయం చేసుకోటానికి ఇష్టపడే కమల్ ప్రస్తుతం విశ్వరూపం-2 తో మనముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఏదో ఉడతా భక్తిగా ఆయన నట ప్రస్థానం లో కొన్ని మజిలీలు చూద్దాం.
దర్శకమేరు బాలచందర్ గారి గురించి కొత్తగా ఏం చెబుతాం, సాధారణంగా సినిమాల్లో ఎలాంటి ప్రయోగాలు చేస్తే ముచ్చెమటలు పడతాయో అలాంటి కథలని అవలీలగా తీసిపడేసి మన సమాజ స్థితిగతులని కళ్లకు కట్టినట్టు చూపించిన ధీశాలి ఆయన. అప్పట్లో ఓ ఇద్దరు వ్యక్తులు కనీసం పిచ్చాపాటికైనా మాట్లాడుకోడానికి ఇష్టపడని, అసలు అలాంటి సమస్య ఒకటి మన మధ్య ఉందని అంగీకరించే ధైర్యం కూడా లేని ఆ రోజుల్లో… ఆయన సినిమానే ఆయుధంగా చేసుకుని ఆ సమస్యలని తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి జనాలని చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. ఇది కథకాదు,అంతులేని కథ, అపూర్వరాగంగళ్, రుద్రవీణ, ఆకలిరాజ్యం, మరో చరిత్రలాంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి గురువు దొరికితే ఇహ కమల్ హాసన్ లాంటి నిత్య విద్యార్థిని ఆపటం ఎవరితరం ? సహజంగానే ప్రతీది నేర్చుకోవాలని, తెలుసుకోవాలని కుతూహలం ఉన్న వ్యక్తి కావటంతో, బాలచందర్ గారి శిక్షణలో మరింత రాటుతేలారు కమల్.
1960లో జెమిని–సావిత్రి గార్ల కళాతుర్ కనకమ్మ(తెలుగులో 1969లో మూగనోముగా తీశారు) సినిమాలో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన కమల్ ఆ వెంటనే తన రెండు, మూడో చిత్రాల్లో కూడా ఆ జంటతోనే జతకట్టడం విశేషం. అందుకే కాబోలు సావిత్రి గారంటే ఆయనకి అంత ఆప్యాయత. అక్షరాలు దిద్దాల్సిన వయసులో సినిమా సెట్లలో లైట్ల మధ్య నటనలో ఓనమాలు దిద్దారు కమల్. అలా ఏంచేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియని వయసులో మహానటి సావిత్రితో కలిసి నటించి, తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆ బాలనటుడు పెరిగి పెద్దై భారతదేశ మేటి నటుల్లో ఒకడై ఎందరికో స్పూర్తిగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.
న కష్టమే పెట్టుబడిగా బాలచందర్ గారి అడుగుల్లో అడుగులేసుకుంటూ నటుడిగా తనని తాను మెరుగు పరుచుకుంటూ, సినిమాలో 24 విభాగాలపై పట్టు సాధించి నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా మారి అన్ని భాద్యతలని ఎంతో నేర్పుతో నిర్వహించి బేష్ అనిపించుకున్నారు. ఓ సినిమాని ఒప్పుకుంటే ఆ సినిమాకోసం ఎంత తపన పడతారో, ఆ పాత్రలో ఎంతగా లీనమౌతారో చెప్పటానికి ఆయన నటనే ఓ కొలమానం. ఉదాహరణకి ఇంద్రుడు–చంద్రుడు సినిమాలో మేయర్ పాత్ర గాత్రం, చంద్రం పాత్ర గాత్రం వేరుగా ఉంటాయి ఆ మార్పు పాటలో కూడా కనబడితే బాగుంటుందనే ఉద్దేశంతో, రికార్డింగ్ స్టూడియోలో ఎస్పీ బాలుని కలిసి తాను స్వయంగా డబ్బింగ్ చెప్పిన ఓ క్యాసెట్ ని ఇచ్చి .. ఈ పాత్రకి పాడే పాట కాబట్టి ఇలా పాడితే బాగుంటుంది అని బాలు గారికి చెప్పి మళ్లీ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారట కమల్.
ఆ సంగతి అలా ఉంటే కమల్ హాసన్‌కి డబ్బింగ్ చెప్పటం అనత సులభమైన పనికాదని దశవతారం సినిమాలో ఖరీఫుల్లాహ్ (పొడగరి కమల్ హాసన్) పాత్రకి డబ్బిగ్ చెప్పటం చాలా క।ష్టమైందని స్వయానా బాలు గారే ఓ సందర్భంలో చెప్పారు. ఆయన గురించి ఎవరెన్ని గొప్పలు చెప్పినా అవన్నీ నిజం కాదని .. మంచి కథల్లో మరపురాని పాత్రల్లో తనని దర్శకులు తీసుకోబట్టే అందరి ప్రేమని చూరగొన్నానని చెప్పే వినమ్రుడు మన కమల్. మొన్నటికి మొన్న తెలుగు బిగ్బాస్ హౌస్ లో ప్రత్యక్షమైన కమల్‌ని, మీరు ఎలా ఇంత గ్రౌండెడ్‌గా ఉంటారు అని ఓ కంటెస్టెంట్ అడిగినప్పుడు .. ఇలా కాకుండా ఇంకోలా ఉండటం కుదరట్లేదు… భూమి తన గురుత్వాకర్షణ శక్తితో నన్ను నేలమీద ఉండేలా చేస్తోంది… ఇంకో దారి లేదు అని ఓ ఛలోక్తి కూడా విసిరారు. ఇది ఒక్కటి చాలు ఆయన ఎంత సాదా–సీదా జీవితం గడుపుతారో చెప్పటానికి.
అసలు కమల్ అంటేనే సినిమా, సినిమా అనేది లేకపోతే ఆయన ఎలా బ్రతికేవారో ఊహకి కూడా అందదు, అంతలా సినిమాతో మమేకమైపోయారు ఆయన. మైఖేల్ మదన కామరాజు సినిమాలో నాలుగు విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన తీరు అసామాన్యం. సింగీతం గారి ఊహాశక్తి ఎంత గొప్పదో ఆయన సినిమాలే మనకి చెబుతాయి, అలాంటి దర్శకుడితో పనిచేయటం నిజానికి కమల్ హాసన్ లాంటి నిత్యవిద్యార్థికి ఓ పి.హెచ్.డి చేయటం లాంటిది, అందుకే సొమ్మొకడిది–సోకొకడిది, పుష్పక విమానం, అమావాస్య చంద్రుడు, విచిత్రసోదరులు… పైన చెప్పుకున్న మైఖేల్ మదన కామరాజు, నవ్వండి–లవ్వండి, ముంబై ఎక్స్‌ప్రెస్ లాంటి అద్భుతాలు సాధ్యమయ్యాయి.
అసలు సతీ లీలావతి లాంటి ఓ సినిమాలో కూడా తన మార్క్ కామెడితో జనాల్ని పొట్టపగిలేలా నవ్వించటం ఒక్క కమల్ హాసన్ కే సాధ్యం. మరి భామనే సత్యభామనే… అలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన ఒక్కో సినిమా పై ఒక్కో పుస్తకం రాయచ్చు భారతీయుడు, సాగరసంగమం, స్వాతిముత్యం, అభయ్, గుణ, డాన్స్ మాస్టర్, ఎర్రగులాబీలు, వసంతకోకిల… బాబోయ్ రాస్తూపోతే దాదాపు అన్ని సినిమాలు రాయాలి.. నిన్నమొన్నటి విశ్వరూపం, ఉత్తమవిలన్, చీకటి రాజ్యం.. అన్నీ ఎదో ఓ రూపంలో మంచి పేరు తెచ్చుకున్న సినిమాలే.. అదీ కమర్షియల్‌గా హిట్టా, ఫ్లాపా అన్నదాంతో సంబధం లేకుండా కమల్ నటనే థ్రెడ్‌గా వెళ్లిపోతాయి. అలాగే ఈ ఆగస్ట్ 10న మన ముందుకు రాబోతున్న విశ్వరూపం-2 కూడా మనకి మరో మరచిపోలేని సినిమా అవ్వాలని, ఆయనకి మరపురాని విజయాన్ని ఇవ్వాలని మనసారా కాంక్షిస్తూ ఇంతటితో ముగిస్తున్నా…
– రవి తేజ