June 7, 2023

కరుణానిధి కథే ఒక సినిమా- పార్ట్‌ 3

కరుణానిధి కథే ఒక సినిమా- పార్ట్‌ 3

కరుణాధి మొత్తం 75 సినిమాలకు స్క్రిప్ట్‌లు ఇచ్చారు. వాటిలో కరుణానిధికి ఇమేజ్‌ తెచ్చింది.. అద్భుతమైన డైలాగ్‌ పవర్‌ ఉన్న చిత్రంగా ఇప్పటికీ తమిళనాడు గుర్తుంచుకునే క్లాసిక్‌ పరాశక్తి.ఆ చిత్రంలో డైలాగ్స్‌ ప్రవాహానికి కరుణానిధితో పాటుఅప్పటికి నాటకాలతో పేరు తెచ్చుకుని ఒక్క సినిమా ఛాన్స్‌ కోసం కసిగా ఎదురు చూస్తున్న మరో నటుడు కూడా కారణం.. అతనే శివాజీ గణేషన్‌. కరుణ నిధి కలం, ఆయన గళం కలిసి.. రాజకీయ వ్యంగ్యాస్త్రం, నిరుద్యోగం, సామాజిక పరిస్థితులు ఇలాంటి అంశాలతో తీసిన ఆ సినిమా డైలాగులు.. ఇప్పటికీ పాపులర్‌. ఈ సినిమాతోనే శివాజీ గణేషన్‌కి సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. మన దానవీరశూర కర్ణ డైలాగుల్లా.. ఇప్పటికీ తమిళనాడులో పరాశక్తి డైలాగులు వినిపిస్తాయి. అలా తమిళంతో పాటు, తెలుగులోనూ సూపర్‌ హిట్‌ అయిన మరో సినిమా మనోహర. శివాజీ గణేషనే హీరో. ఈ సినిమా ఆడియో రికార్డులు అప్పట్లో భారీగా అమ్ముడుపోయాయి. అది కరుణానిధి పెన్‌ పవర్‌. ఇలా కరుణ స్క్రిప్ట్‌ అందించిన సినిమాల్లో ఎక్కువ శాతం సూపర్‌ హిట్లే. ప్రతీ సినిమాలో కామన్‌ పాయింట్‌ సోషల్‌ ఇష్యూస్‌, వాటిపై విసుర్లు, రాజకీయ వ్యంగ్యాస్త్రాలపెద్ద పెద్ద డైలాగులు. ఇదీ క్లుప్తంగా కరుణానిధి సినిమా కెరీర్‌.

అయితే ముందరి ఎపిసోడ్‌లో కరుణానిధి, ఎంజీఆర్‌ పరిచయం గురించి చెప్పుకున్నాం. ఆ పరిచయం ఎలా ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం. పెరియార్‌ కుడి అరసు పత్రికలో పనిచేస్తున్న సమయంలో కరుణకు పరిచయాలు బాగా పెరిగాయి. ఆ సమయంలోనే జూపిటర్‌ పిక్చర్స్‌ సినిమా తమ సినిమాకు స్క్రిప్ట్‌ రాయాలని కరుణను అడిగారు. అయితే ఓ షరతు పెట్టారు. కోయంబత్తూరులో ఉన్న తమ స్టూడియోలో ఉండి రాయాలన్నారు. ఆ సినిమానే 1947లో వచ్చిన రాజకుమారి”. ఇంత చేసి ఆ సినిమా టైటిళ్లలో కరుణానిధి పేరు వెయ్యలేదు. అక్కడే తమిళనాడు సినిమా, రాజకీయ గతిని మార్చిన సూపర్‌ స్టార్‌, రాజకీయాల్లోనూ సినిమావాళ్లు సూపర్‌ స్టార్లేనని నిరూపించిన గొప్ప నేత, ఇప్పటికీ తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగుతున్న ఎంజీఆర్‌ పరిచయం అయ్యాడు. ఎంజీఆర్‌ పూర్తి పేరు మార్తూర్‌ గోపాలన్‌ రామచంద్రన్‌.

ఇక్కడ ఎమ్‌జీఆర్‌ గురించి క్లుప్తంగానైనా కొంత చెప్పుకోవాలి. అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య కేరళ నుంచి తమిళనాడు వచ్చిన కుటుంబం వాళ్లది. తినడానికి తిండి లేని రోజులు ఎంజీఆర్‌ జీవితంలో లెక్కలేనన్ని ఉన్నాయి. చిన్నప్పుడే కుటుంబాన్ని పోషించాల్సిన పెద్ద బాధ్యత మోశాడు. తల్లి అతన్ని డ్రామా కంపెనీలో పెట్టింది. చిన్నా చితక వేషాలు వేశాడు. ఏకంగా 12 ఏళ్ల పాటు మంచి పాత్ర కోసం కష్టపడ్డాడు.ఒకే ఒక్క సీన్లలో నటించిన సినిమాలైతే ఎన్నో. అన్నాళ్ల కష్టం తర్వాత 1947లో రాజకుమారి సినిమాలో హీరోగా అవకాశం దక్కింది. అది కూడా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా. కానీ, సినిమా సూపర్‌ హిట్‌. 1954లో రాబిన్‌ హుడ్‌ తరహా పాత్రలో పెద్దవాళ్లను కొట్టి పేదలకు పంచే కథతో మల్లై కల్లన్‌సినిమాతో స్టార్‌డమ్‌ వచ్చింది. ఇంత కష్ట పడ్డాడు కాబట్టే ఎంజీఆర్‌ తాను ఆర్థికంగా ఎదిగాక లెక్కలేనన్ని దానాలు చేశారు. అందుకే ఇప్పటి తమిళనాడు ప్రజల దృష్టిలో ఆయన దేవుడే. ఆకలి విలువ తెలుసు కాబట్టి.. ఎవరు పలకరించినా భోంచేశారా అని తప్పనిసరిగా అడిగేవాడట. ఒక హీరోగా ఆయనకున్నఇమేజ్‌ దేశంలో ఇంకే హీరోకి లేదు. ఇది అతిశయోక్తి కాదు నిజం.

మాస్‌ మానియా అనే పదం ఎంజీఆర్‌తోనే మొదలైంది. సిగరెట్‌ తాగడు, మందు తాగడు.. అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా తాగకూడదు. ఇదీ అతని రూల్‌. ఆయన సినిమాల్లో కూడా మందు లేదా సిగరెట్‌ తాగే సీన్లు ఉండవు. హీరో అంటే హీరోనే. కథానాయకుడికి పరాజయం లేదు. అందుకే సినిమాల్లో ఎంజీఆర్‌ చనిపోయిన కథలే ఉండవు. ఎంత విపత్కర పరిస్థితుల్లోనైనా హీరోనే గెలవాలి. అదంతే. రంగు రంగుల డ్రెస్సులు, ఇద్దరేసి హీరోయిన్లు, రొమాన్స్‌, పేదలంటే ప్రాణం, దాన గుణం, సాయం అడిగితే ప్రాణమిచ్చేస్తాడు. ఇవే ఎంజీఆర్‌ సినిమా కథలు. అన్ని సినిమాలు ఈ అంశాల చుట్టే తిరుగుతాయి. అందుకే ఎంజీఆర్‌.. హీరో అంటే. ఆయనకు వయసు లేదు. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయినే ఉండాలి. అడవి రాముడు సినిమా నుంచి మన ఎన్టీఆర్‌.. ఎంజీఆర్‌ ఫార్ములా ఫాలో అయ్యారు. అంతకు ముందు ఎన్టీఆర్‌ సినిమాలు చాలా ఫ్లాపయ్యాయి. అప్పుడు ఎంజీఆర్‌ ఫార్ములాతో వచ్చిన అడవి రాముడు, వేటగాడు, జస్టిస్‌ చౌదరి లాంటి సినిమాలు సూపర్‌ హిట్లు. అందులోనూ రంగురంగుల షర్ట్‌లు, ఫ్యాంట్లు, టోపీలు, ఇద్దరు హీరోయిన్లు, భారీ మేకప్‌.. ఈ సినిమాలే ఆయన అభిమానులను అలరించి.. ఆ తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడానికి హెల్ప్‌ చేశాయి. ఎంజీఆర్‌ సినిమాల్లోనే కాదు.. బయట కూడా హీరోనే. ఇంటికొచ్చి ఉత్తి చేతులతో వెళ్లినవారు లేరట. అడిగితే లేదనకుండా సాయం చేసేవాడట.

ఆయనకు హీరోగా జీవితాన్నిచ్చిన రాజకుమారి మూవీ సమయంలోనే కరుణానిధి పరిచయమయ్యాడు. ఈ పరిచయమే.. తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు, ఓ చరిత్రను లిఖించిన క్షణం. కరుణానిధి కంటే ఎంజీఆర్‌ పెద్దవాడు. కానీ, అప్పటికే ఎన్నో మలుపులు చూసిన కరుణఎంజీఆర్‌ని ప్రభావితం చేశాడు. అది స్నేహం నుంచి ప్రాణ స్నేహం వరకు మారింది. కరుణానిధి వల్లే పరమ ఆస్తికుడిగా ఉన్న ఎంజీఆర్‌ చాలా కాలంపాటు నాస్తికుడిగా మారాడు. మామూలుగా అయితే కుమార స్వామికి వీర భక్తుడు. అలా సినిమాల్లో వారికి వరుస హిట్లు స్టార్‌డమ్‌ని తెస్తే.. కరుణ, ఎంజీఆర్‌ల స్నేహం కూడా పెరిగింది.

సరిగ్గా ఆ సమయంలో తమిళ రాజకీయాల్లో కీలక మార్పులొచ్చాయి. అప్పటికి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కుమ్ములాటలతో తమిళ రాజకీయాలు అస్థిరంగా ఉండేవి. ఇటు పెరియార్‌ బ్రాహ్మణ, హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఊపు మీదున్నాయి. అప్పటికి పెరియార్ శిష్యుడిగా అణ్నాదురై మంచి పాపులారిటీ సంపాదించారు. రానురాను పెరియార్‌ భావజాలంపై అంతర్గతంగానే విమర్శలు ఎక్కువయ్యాయి. అలాంటి సమయంలో పెరియార్‌ తీసుకున్న ఓ నిర్ణయం.. తమిళ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. అది 1949.. అప్పటికి పెరియార్‌కి 72 ఏళ్లు. ఆ సమయంలో ఆయనకు సహాయకురాలిగా ఉన్న మణియమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ నిర్ణయంపెరియార్‌ శి।ష్యులకు నచ్చలేదు. ముఖ్యంగా అణ్నాదురైకి ఈ వ్యవహారం మింగుడుపడలేదు. బాధతోనే.. పెరియార్‌ ద్రవిడ కళగం నుంచి బయటకు వచ్చి ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) స్థాపించారు అణ్నాదురై. ఆ పార్టీ ప్రకటన సమయంలో కరుణానిధి కేవలం ఒక ప్రేక్షకుడు మాత్రమే. అప్పటి వరకు DK రాజకీయాల్లో పాల్గోబోమని చెప్పేది. కానీ, DMK రాజకీయ పార్టీగా ప్రకటించుకుంది. అలా 1949 సెప్టెంబర్‌ 15న తమిళ రాజకీయాల్లో చరిత్రగా నిలిచిన DMK పార్టీ ఏర్పడి 1967లో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ముఖ్యమంత్రిగా అణ్నాదురై.. ఆరాధ్య నాయకుడిగా రాజకీయ చక్రం తిప్పారు.

అణ్నాదురై వెనుకే కరుణానిధి నడిచి.. ఉద్యమాలు, నిరసనల్లో ఆయన మార్కు చూపించారు. డ్రమటిక్‌ పాలిటిక్స్‌లో ఆయన్ని మించినవారు లేరు. దీనికో చిన్న ఉదంతం చెప్పుకుందాం. ఈ సీన్‌ కరుణానిధిఎంజీఆర్‌ కథ ఆధారంగా వచ్చిన ఇద్దరుసినిమాలో కూడా కనిపిస్తుంది. 1953లో తిరుచ్చి జిల్లాలో దాల్మియా పురం అనే ఊరు ఉండేది. అక్కడ దాల్మియా సిమెంట్‌ ఫ్యాక్టరి ఉంది. చాలా మందికి ఉపాధి కూడా దొరికింది. ఆ ఊరికి ఉత్తరాది వాడి పేరు పెట్టడం ఏంటి.. కల్లక్కుడిగా మార్చాలన్నది ఉద్యమం. ఆ ఉద్యమంలో భాగంగా కార్యకర్తలు ఆ ఊర్లో ఉన్న సైన్‌బోర్డులన్నిటి మీద కల్లక్కుడిగా పేర్లు మార్చారు. కదిలిస్తే తేనెతుట్ట అవుతుందని పోలీసులు శాంతంగా ఊరుకున్నారు. ఉద్యమం ఇంత చప్పగా సాగితే ఎలా? అందుకే కరుణానిధి అక్కడి రైలు పట్టాల మీద పడుకుని ఉడల్‌ మణ్ణుక్కు, ఉయిర్‌ తమిళుక్కుఅని నినాదం రైజ్‌ చేశారు. ఆ నినాదం అర్థం.. ఈ శరీరం ఈ మట్టికి, ప్రాణం తమిళానికి అని. ఇది చాలా పాపులర్‌ అయింది. గొడవ పెరిగింది. కరుణని జైల్లో పెట్టారు. ఇదే అతనికి కావాల్సింది. కరుణానిధి పేరు మారుమోగింది. ఇలాంటి రాజకీయాలెన్నో.

కరుణానిధి ఎప్పుడూ నల్ల కళ్లద్దాలతో ఉంటారు కదా. ఆ కథేంటో తెలుసా..? పైన చెప్పుకున్నామే ఈ ఉద్యమం జరిగిన కొన్నాళ్లకు కరుణానిధికి కార్‌ యాక్సిడెంట్‌ జరిగింది. కళ్లు, ముక్కు బాగా దెబ్బతిన్నాయి. చాలా నెలలు హాస్పటల్‌లో ఉన్నారు. నల్ల కళ్లద్దాలు కంపల్సరీగా వాడాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి ఆ నల్లకళ్లద్దాలు ఆయన జీవితంలో భాగమైపోయాయి. అది కాస్తా తమిళనాడులో ఫ్యాషన్‌గా మారిఅభిమానులు నల్ల కళ్లద్దాలు పెట్టుకోడం మొదలుపెట్టారు.

1954 నుంచి 2 టెర్ములు కామరాజ్‌ నాడార్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరిపారు.అద్భుతమైనముఖ్యమంత్రిగా, గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కూడా. తమిళనాడుకి అప్పట్లో విద్యా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కామరాజ్‌. దేశంలోనే మొదటి సారి మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది ఆయనే. ఇప్పుడున్న తమిళనాడు అభివృద్ధికి పునాది వేసింది ఆయనే. ఇటు DMK కూడా అణ్ణాదురై సారధ్యంలో దూసుకుపోతోంది. పెరియార్‌లా కాకుండా అన్నా చాలా కూల్‌గా ఉండేవారు. నాస్తికవాదంపైన కఠిన వ్యవహార శైలిని ఆయన సడలించారు.

మరో వైపు కరుణానిధి కూడా పార్టీలో సెకండ్‌గా ఎదుగుతూ వచ్చారు. అప్పుడే ఎంజీఆర్‌ కూడా పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు వారిద్దరి మధ్య స్నేహం ఎలా ఉండేది..? కరుణానిధి రాజకీయ ప్రస్థానంలో మేలి మలుపులేంటి…? తర్వాతి భాగంలో

పార్ట్‌ 4 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

 

 

 

 

 

 

 

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *