ఈ ఎపిసోడ్‌లో కరుణానిధి ఒక లీడర్‌గా ఎలా ముందుకెళ్లగలిగారో చెప్పే నేపథ్యం ఉంటుంది. అది తెలుసుకోవాలంటే అప్పటి తమిళ రాజకీయాల గురించి కూడా కొంత చెప్పుకోవాలి. అప్పట్లో మద్రాస్‌లో కాటన్ మిల్లుల చాలా ఫాస్ట్‌గా విస్తరించాయి. చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికులు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పరిణామాన్ని DMK బాగా వాడుకుంది. 1953లో ”చేనేతకు చేయూత దినం”గా ప్రకటించారు అణ్నా. DMK కార్యకర్తలు వీధుల్లో చేనేత వస్త్రాలు అమ్మారు. చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తాం అని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు “చేనేత ప్రచారం” పార్టీ ఉద్దేశాలలో ఒకటైంది. తెల్ల చొక్కాలు, తెల్ల పంచెలు ట్రెండ్ ఈ ప్రచారం ఎఫెక్టే.
1953లో మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తమిళనాడుకే వెళ్లాల్సిన తిరుమల మన పుణ్యం కొద్ది ఆంధ్రకు ఎలా వచ్చిందో తెలుసా? రాష్ట్రం విడిపోయాక… చిత్తూరు జిల్లా ఆంధ్రకు వెళుతుందని ప్రకటించారు. అప్పట్లో ప్రముఖ తమిళనాయకుడు ఎం.పి.శివజ్ఞానం. ఆయన ఊరు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి. ఆ క్షేత్రం అప్పట్లో చిత్తూరు జిల్లాలో ఉండేది. తిరుత్తణి ఆంధ్రకు వెళ్లడం ఆయనకు యిష్టం లేదు. తిరుపతితో సహా చిత్తూరు జిల్లా అంతా మద్రాసులోనే వుండాలని శివజ్ఞానం ఆందోళన చేశాడు. రైలు రోకోలు, రాస్తా రోకోలు చాలా చేశాడు. తమిళ్ సెంటిమెంట్ ఎక్కడుంటే అక్కడ DMK ఉంటుంది. అణ్నా ఈ ఉద్యమానికి మద్దతు యిచ్చాడు. చివరికి చిత్తూరు జిల్లాను విడగొట్టి తిరుపతిని ఆంధ్రకు, తిరుత్తణిని మద్రాసుకు యిచ్చారు. అలా అదృష్టం కొద్దీ వచ్చింది మనకు తిరుమల. లేకుంటే తిరుమల తమిళనాడులో ఉండేది. ఆ కలియుగ వైకుంఠనాథునికి తెలుసు ఆయనకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో. అయినా నాస్తికవాదుల మధ్య ఆయనెందుకు ఉంటాడు..
1953లోనే చేనేత సహకారం, ఉత్తరాది వ్యాపారస్తుల వ్యతిరేక ఉద్యమం ఇలా DMK తమిళ సెంటిమెంట్ రగిలిస్తూ రాజకీయ వ్యూహాలు రచించింది. అదే ఏడాది ఎమ్జీయార్ DMKలో చేరాడు. DMK పార్టీలో పెద్ద మలుపు ఎంజీఆర్ చేరికే. మొదటి సినిమాతో కలిసిన కరుణ, ఎంజీఆర్ స్నేహం ఆ తర్వాత ప్రాణ స్నేహంగా పెరిగిందని చెప్పుకున్నాం. 1947లో వచ్చిన ”రాజకుమారి” సినిమా తర్వాత ఎంజీఆర్‌కి వెంటనే హీరో క్యారెక్టర్లు రాలేదు. 1950 వరకు కరుణ, ఎంజీఆర్ ఇద్దరూ సినిమా కష్టాలు పడ్డారు. 1950లో ”మంత్రికుమారి” సినిమాకి కరుణానిధి స్క్రిప్టు రాశారు. అప్పుడు ఎమ్జీయార్‌కు మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలని కరుణే రికమెండ్ చేశారు. ఆ తర్వాత ఎంజీఆర్‌కి మంచి పేరు తెచ్చిన ”మరుదనాట్టు ఇళవరసి” సినిమా డైలాగులు వేరే వాళ్లు రాయాలి. కానీ.. కరుణానిధే రాయాలని ఎంజీఅర్ పట్టుబట్టి… కరుణకు ఛాన్స్ ఇప్పించారు. ఇలా అవకాశాలు ఇచ్చిపుచ్చుకుని స్టార్లుగా ఎదిగినవారు ఎంజీఆర్, కరుణ. ఎమ్జీయార్ స్టార్‌డమ్ వెనుక కరుణ కలం బలం ఉంది. పేదల హీరోగా, వీరుడిగా, ధర్మం తప్పని నాయకుడిగా వెండితెరపై ఎంజీఆర్‌ని ఆరాధ్యదైవంగా చేసిన డైలాగులు, కథలు కరుణానిధి ఇచ్చారు. ఎంజీఆర్‌కి “పురుచ్చి నడిగర్” అనే బిరుదుని కూడా కరుణానిధే ఇచ్చారు. పురుచ్చి నడిగర్ అంటే విప్లవ నాయకుడు. ఆ బిరుదే ఎంజీఆర్ అన్నా డీఎంకే స్థాపించినప్పుడు “పురుచ్చి తలైవర్” అంటే విప్లవ నాయకుడిగా మారింది. ఆ తర్వాత జయలలిత వచ్చా “పురుచ్చి తలైవి” అయ్యింది.
ఆనాడు కరుణానిధి చూపిన స్నేహం, ప్రేమ కారణంగానే… 1953లో పిలవగానే వెళ్లి DMK పార్టీలో చేరారు. ఎంజీఆర్ చేరగానే ఆయన అభిమానులతా DMK ఓటర్లయ్యారు. అప్పటి వరకు పెద్దగా జనం లేని పార్టీ మీటింగ్‌లు ఎంజీఆర్ అభిమానులతో నిండిపోయేవి. ఒక దశలో DMK అంటే ఎమ్జీఆర్ పార్టీగానే తమిళనాడు భావించింది. DMK నేతలకు ఈ పాపులారిటీ అప్పటికి అవసరం. ఈ దశలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమాలే మలై కల్లన్, మధురై వీరన్. రెండిటికీ కరుణ స్క్రిప్ట్. ఎంజీఆర్‌కి తిరుగులేని స్టార్‌డమ్, మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమాలివి. తమిళనాడులో ప్రతీ ఇంటా ఎంజీఆర్‌కు అభిమానులు ఏర్పడ్డారు. తమిళ సినిమాలంటే మనలా కాదు. ఆ సినిమాల్లో పార్టీ ఉద్దేశాలను డైరెక్ట్‌గా డైలాగుల్లా చెప్పేవారు. చాలా సినిమాల్లో DMK పార్టీ జెండా, అణ్నా గురించి కథలో అంతర్భాగంగా ఉండేవి. అలా DMK పాపులారిటీకి సినిమా పెద్ద ప్రచారం అయింది. పల్లెపల్లెల్లోకి DMK వెళ్లిందంటే కారణం సినిమా హాళ్లు, అందులో ఎంజీఆర్ సినిమాలు. ఇది అక్షరాలా నిజం. అందుకే తమిళ రాజకీయాలకు, సినిమాలకు విడదీయరాని బంధముంది.
ఈ రెండు హిట్ సినిమాల తర్వాత ఎంజీఆర్ దర్శకత్వంలోనే వచ్చిన ”నాడోడి మన్నన్” సినిమా కథలో పార్టీ ఎజెండాలు ప్రచారం చేశారు. డిఎంకె ఎజెండా ఉచిత విద్య, దున్నేవాడికే భూమి సిద్ధాంతాలే కథగా మార్చి ఆ సినిమా తీశారు. అలా రాజకీయ పార్టీకి, సినిమా ఫ్లావర్, ఎంజీఆర్ పాపులారిటీ కలిసి.. DMK దూసుకుపోయింది. ఇక్కడ మరో విషయాన్ని మనం గమనించాలి. ఎంజీఆర్‌కి అంత పాపులారిటీ రావడానికి కారణం… తెరవెనుక కరుణనిధి కలం.
1957 ఎన్నికల్లో 124 సీట్లకు DMK పోటీ చేస్తే అణ్నా, కరుణ సహా 15 మందే గెలిచారు. అప్పటికి కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఉన్నప్పటికీ దక్షత కలిగిన ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్‌కే పట్టం కట్టారు. కానీ 1959లో మద్రాస్ కార్పొరేషన్‌కి జరిగిన ఎన్నికల్లో మాత్రం కరుణానిధి రాజకీయ చతురత వల్ల DMK సత్తా చాటింది. పార్టీలో కరుణానిధికి బాగా ఇమేజ్ పెరిగింది. 1962 ఎన్నికలు… అప్పటికి రాజాజీ, కామరాజ్ నాడార్ లాంటి నాయకుల గట్టి పోటీ ఉంది. DMK పూర్తిస్థాయిలో తమిళనాట విస్తరించలేదు. ఈ నేపథ్యంలో DMK 142 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే 50 చోట్ల గెలిచారు. అప్పటికి ఇది పెద్ద గెలుపే. 18 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తే 7 చోట్ల గెలిచారు. అది కూడా ఎంజీఆర్ ఇమేజ్, కరుణానిధి రాజకీయ వ్యూహాల వల్లే. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అణ్నా కూడా ఓడిపోయారు. అప్పుడే DMK భవిష్య నాయకుడు కరుణానిధే అన్న ఫీలింగ్ పార్టీ వర్గాల్లో వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1963లో కరుణ రాజకీయ జీవితంలో కీలక మలుపు. ఆ ఏడాది హిందీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని DMK నిర్ణయించింది. ఆ ఉద్యమ బాధ్యతలు కరుణానిధికి అప్పగించింది. అప్పట్లో హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. లాల్ బహదూర్ శాస్త్రి హాయంలో ప్రతీ ఒక్క రూ హిందీ నేర్చుకోవాల్సిందేనని కేంద్రం పట్టుబట్టుకు కూర్చుంది. అది తమిళుల సహా దక్షిణాది రాష్ట్రాలకు నచ్చలేదు. అప్పటికే తమిళ సెంటిమెట్ రగిలిస్తున్న DMK ఈ ఇష్యూని తమ ప్రచారాస్త్రంగా వాడుకుంది. ఇది 1963లో. ఇప్పటికీ చాలా మంది తమిళులకు హిందీ అంటే ఏవగింపు. కామరాజ్ తర్వాత, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన అనుచరుడు భక్తవత్సలం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అంత సమర్ధుడు కాదు. ఆయన హిందీ ఉద్యమం విషయంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. ఇది DMKకి ప్లస్ అయింది. హిందీ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న అణ్నాను జైల్లో పెట్టారు. ఆ సమయంలోనే అణ్నా తల్లి చనిపోవడం, పెరోల్ మీద బయటకు వచ్చి అణ్నా అంత్యక్రియలు నిర్వహించడం ఇవన్నీ ఆయనపై సింపతీ పెంచాయి. మరో సంఘటన DMK రాజకీయ గమనాన్ని మార్చేసింది. తమిళనాట కాంగ్రెస్ చరిత్రకు చరమగీతం పాడింది. 1964లో తిరుచ్చికి చెందిన చిన్న స్వామి అనే యువకుడు “తమిళాన్ని బతికించాలి, హిందీని వ్యతిరేకించాలి” అని నినదిస్తూ ఆత్మ బలిదానం చేశాడు. ఈ ఆత్మాహుతి తర్వాత అతని చిత్రపటాన్ని DMK ఆవిష్కరించింది. ఇది ప్రజల్లో బాగా సెంటిమెంట్ రగిల్చింది.
హిందీ తప్పని సరి అయితే ఉద్యోగాలు దక్కవు.. అని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చెందారు. ఈ అంశాన్ని DMK బాగా వాడుకుంది. హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. అప్పటి భక్త వత్సలం ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పరిగణించలేదు. ఫలితంగా ఉద్యమం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లి..ఉధృతమైంది. అప్పటికీ తేరుకోని భక్తవత్సలం ఉద్యమిస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జి చేయించారు. ఈ నిర్లక్ష్యం… చారిత్రక తప్పిదమని తర్వాత ఎన్నికల్లో గానీ కాంగ్రెస్‌కి అర్థం కాలేదు. విద్యార్థుల ఉద్యమం మహోగ్ర రూపం దాల్చి… ఆత్మహత్యలు, బస్సు దహనాలతో వయోలెంట్‌గా మారింది. మిగిలిన దక్షిణ రాష్ట్రాలకు కూడా పాకింది. కేంద్ర ప్రభుత్వం గుండెల్లో గుబులు మొదలైంది. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. ఫలితం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాట కాంగ్రెస్ జెండా ఎగరలేదు. ఈ పరిస్థితులన్నిటిని తమ ప్రచారాస్త్రాలుగా వాడుకుని DMK విజయబావుటా ఎగరేసింది. ఈ రాజకీయ వ్యూహాలన్నీ రచించింది… అణ్నా అయితే స్క్రీన్ ప్లే కరుణానిధి. తర్వాత ఏం జరిగింది…
పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి