June 7, 2023

కరుణానిధి కథే ఓ సినిమా పార్ట్‌-5

కరుణానిధి కథే ఓ సినిమా పార్ట్‌-5

1967లో ఎన్నికలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకే ప్రస్థానానికి ఇది తొలిమెట్టు. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి ఉద్వాసన పలకాలని తమిళ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయినాఅణ్నా ప్రతిపక్షాలన్నిటిని ఒకచోటకు తేవాలని నిర్ణయించారు. అది ఫలించింది. అంతకు ఓ ఏడాది ముందు 1966లో మద్రాసులో డీఎంకే సభ పెడితే లక్షల్లో జనం హాజరయ్యారు. ఆ సమావేశంలో పార్టీ కోశాధికారిగా వున్న కరుణానిధి అణ్నాకు 11 లక్షల రూపాయల ఫండ్‌ ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. ఎమ్జీయార్‌ కూడా భారీగా ఆఫర్‌ చేసినాపార్టీ డబ్బు వద్దు మీ ఇమేజ్‌ కావాలన్నారు అణ్నా. ఎంజీఆర్‌ ప్రచారం, కరుణ మేధస్సు.. మేధావి అణ్నా నాయకత్వంలో ప్రచారం జోరుమీద సాగింది.

అయితే ఆ తర్వాత ఎమ్మార్‌ రాధాకొన్ని కారణాలతో.. ఎంజీఆర్‌ని తుపాకీతో షూట్‌ చేశారు. తూటా గొంతులో దూసుకుపోయింది. ప్రాణాపాయం తప్పినా.. మాట చాలా రోజులు పోయింది. కానీ.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సింపతీ తెచ్చింది. ఆడవాళ్లు, యువకులైతే తమ అభిమాన నటుడిని చూసి చలించిపోయారు. ఎంజీఆర్‌ ఎఫెక్ట్‌తో డీఎంకేనే గెలిచింది.

తమిళనాడులో తొలిసారి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్‌ రాలేదు కూడా. ఆస్పత్రిలో ఉండగానే ఎంజీఆర్‌ ఎమ్మెల్యేగా సంతకం చేశారు. ఆ ఫోటోలు ఇప్పటికీ తమిళనాట కనిపిస్తాయి. 1967 మార్చి 6న అణ్నాదురై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఓ ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమిళనాడుతోనే ప్రారంభమై.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమైంది.

ప్రాంతీయ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించినా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక అణ్నా ప్రభుత్వం తడబడింది. అంతవరకు ఆదర్శాలు వల్లించి పదవులు పొందిన నాయకులు అవినీతికి అలవాటు పడి.. దొరికింది తినడం మొదలు పెట్టారు. కొన్ని మినహా.. అణ్నా ప్రభుత్వం చేసిందేమి లేదు. నిజాయతీపరుడైన అణ్నాదురై చాలా బాధపడేవారు. ఇంతలోనే ఆయనకు క్యాన్సర్‌ సోకి అకాల మరణం పొందారు. తమిళనాట అపర మేధావిగా పేరుపొంది.. తమిళుల మనుసు దోచిన అణ్నాదురై రెండేళ్లే పదవిలో ఉన్నారు. 1969 ఫిబ్రవరి 3న అణ్నా మరణించారు. ఆయన అంత్యక్రియల్లో రికార్డు స్థాయిలో లక్షల్లో జనం తరలివచ్చారు. ఏ నాయకుడికి దక్కనంత అంతిమ వీడ్కోలు అణ్నాకు దక్కింది. మరణించే నాటికి అణ్నా ఆస్తులేమీ కూడబెట్టలేదు. కుటుంబ ఆదాయం అంతంత మాత్రమే. ఆ తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక ఆయన రచనలను ప్రభుత్వం తరఫున కొని.. రాయల్టీగా 75 లక్షలు అణ్నా కుటుంబానికి యిప్పించారు. అంత నిస్వార్ధ జీవి అణ్నాదురై.

అణ్నా తర్వాత ఆయన రాజకీయ వారసుడు ఎవరన్న ప్రశ్న వచ్చింది. ఇదే కరుణ రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. అప్పటికే కరుణానిధి జిల్లా కార్యదర్శులను తన కను సన్నల్లో పెట్టుకున్నాడు. కార్య సాధకుడని పేరుంది. ప్రణాళికలు రచించడంలో మేధావి. పక్కన ఎంజీఆర్‌ సపోర్ట్‌ ఉండనే ఉంది. అప్పుడే ముఖ్యమంత్రిగా కరుణానిధికి తన మద్దతిచ్చాడు ఎంజీఆర్‌. పార్టీ కూడా కరుణానిధిని సమర్ధించింది. అలా కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాతే రాజకీయంగా కరుణానిధి పతనానికి కూడా నెమ్మదిగా బీజాలు పడ్డాయి. ముఖ్యమంత్రి అయ్యాకకరుణానిధి పార్టీపై పట్టు బిగించారు. అందరూ తన కనుసన్నల్లో నడవాలనుకున్నారు. అందుకు అధికారాన్ని గట్టిగానే ఉపయోగించారు. ఈ అధికార దాహమే.. కరుణానిధి రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసింది. పార్టీ అంతా తన వలనే నడుస్తోందనుకునేవారు. వేరే నాయకుడు ఎదగకూడదని అనుకున్నారు. తారాపథంలో దూసుకుపోతూ ప్రజల్లో గుండెల్లో దేవుడిగా తిరుగులేని ఇమేజ్‌ సాధించిన ఎమ్జీయార్‌ పలుకుబడి చూసి అసూయ మొదలైంది. ఈ అసూయకి బీజం వేసిన సంఘటన ఒకటుంది. 1971లో మధురైలో పార్టీ మహానాడు జరిగింది. లక్షమందికి పైగా వచ్చారు. డిఎంకె సమావేశాల్లో వక్తలు చాలా మంది ఉంటారు. అందరూ పెద్దపెద్ద స్పీచులతో నాయకుడిని పొగుడుతారు. చివరిగా కరుణానిధి ప్రసంగిస్తారు. కానీ ఆరోజు ఎమ్జీయార్‌ ప్రసంగం ముగియగానే జనాలు వెళ్లిపోయారు. కరుణానిధి ప్రసంగం వినడానికి సగం మంది కూడా లేరు. ఎంజీఆర్‌ ఇమేజ్‌ చూసి కరుణ గుండె గుభేల్‌మంది. కరుణానిధి ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకే అంటే 1971లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ఎమ్జీయార్‌ ఛరిష్మా లేకుండా గెలవాలని మొండిగా ఆయన్ని దూరం పెట్టారు..కరుణ. ఎంజీఆర్‌ లేని డీఎంకే లేదని గ్రౌండ్‌ లెవల్లో తెలిసింది. అప్పటికప్పుడు కరుణానిధికి నచ్చచెప్పి ఎమ్జీయార్‌ని ప్రచారంలోకి దింపారు. 15 రోజుల పాటు రాష్ట్రమంతా తిరిగి డిఎంకెని గెలిపించారు. ఎమ్జీయార్‌ భాగస్వామ్యం లేకపోతే ఆ ఎన్నికల్లో డిఎంకె దాదాపు ఓడిపోయే పరిస్థితి. ఈ విషయాన్ని ఎమ్జీయార్‌ కూడా గ్రహించారు. అందుకే తను చెప్పినవారికి మంత్రి పదవులు యివ్వాలన్నారు. కానీ, కరుణ పట్టించుకోలేదు. తన అనుచరులతోనే కాబినెట్‌ నింపారు. తాను రాసిన డైలాగ్‌లతో హీరో ఇమేజ్‌ తెచ్చుకున్న ఎంజీఆర్‌ తనకు పోటీయా అనుకున్నారు.. కరుణ.

ఈ రాగ ద్వేషాలే ఒకప్పటి ప్రాణ స్నేహితులను రాజకీయ విరోధులుగా మార్చాయి. అది ఏ స్థాయికి వెళ్లిందంటేతన యింటి నుంచే ఒక హీరోని తయారుచేసి ఎమ్జీయార్‌కు పోటీగా నిలబెట్టి, పడగొట్టాలని నిశ్చయించుకున్నారు కరుణ. ఇది ఎంత అనాలోచిత నిర్ణయమో తర్వాత ఆయన తెల్సుకున్నారు. ఎంజీఆర్‌ ఇమేజ్‌ ముందు కనీసం ఒక్కరోజు కూడా నిలబడలేకపోయిన ఆ హీరో కరుణానిధి కుమారుడుముత్తు. ఎవరీ ముత్తు. ఇది తెలియాలంటే కరుణానిధి కుటుంబం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కరుణానిధికి ముగ్గురు భార్యలు. పెద్దావిడ పద్మావతి కుమారుడే ముత్తు. రెండో ఆవిడ దయాలూ అమ్మాళ్‌. ఆవిడకు ముగ్గురు కుమారులుఅళగిరి, స్టాలిన్‌, తమిళరసు కూతురు సెల్వి. మూడో భార్య రాజాత్తి అమ్మాళ్‌ను కరుణ ఏరికోరి చేసుకున్నారుఆమెకు ఒకే కుమార్తె కనిమొళి. ముత్తుకి చిన్నప్పటి నుంచి నటన, పాటలు పాడటం ఇష్టం. ఇతన్ని ఎంజీఆర్‌కు వ్యతిరేకంగా నటుడిగా నిలబెట్టడానికి ప్రయత్నించాడు కానీ.. ఆ ప్లాన్‌ డిజాస్టర్‌ అయింది. ముత్తూలో ఏ కోశానా నటుడు కనిపించడు. చివరికి అతనే తండ్రితో విబేధించి ఎంజీఆర్‌ పార్టీలో చేరాడు. రాజకీయాల్లో ఎదగలేక మత్తుకు బానిస అయ్యాడు. ముత్తుని హీరోగా నిలబెట్టడానికి కరుణానిధి గట్టి ప్రయత్నమే చేశారు. టాప్‌ సినిమా టీంతో అప్పటికి ఓ వెలుగు వెలుగుతున్న వెన్నేరాడై నిర్మల, మంజుల హీరోయిన్లుగా ఓ నాలుగు సినిమాలు తీశారు. అన్నీ ఘోరాతి ఘోరమైన అట్టర్‌ ఫ్లాప్‌లు. హీరో దగ్గర విషయం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అలా రాజకీయ కారణాలతో హీరో అయ్యితర్వాత ఎవరికి కనిపించకుండా పోయాడు ముత్తు సన్నాఫ్‌ కరుణానిధి.

1969లో ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971 ఎన్నికల నాటికి బాగా పుంజుకున్నాడు. అప్పటికి కాంగ్రెస్‌ కూడా చీలిపోయింది. దేశంలో ఇందిరాగాంధీ మానియా నడుస్తోంది. కాంగ్రెస్‌ వ్యతిరేకులు, ఇతర పక్షాలు కరుణకు మద్దతిచ్చాయి. ఈ బలంతో ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. డీఎంకే ఫ్రంట్‌ ఘన విజయం సాధించింది. అవినీతి ఆరోపణలు, విమర్శలతో సాగిన పాలన ఈ ఘన విజయం ఎలా సాధ్యమైంది అన్న అనుమానాలొస్తాయి. దీనికి కరుణ మార్కు రాజకీయాలే కారణం. చేసింది కొంతే అయినా భారీ ప్రచారాలు, ఇంత చేస్తే అంత చెప్పుకోడం లాంటి మార్కెటింగ్‌ స్ట్రాటజీలో కరుణ అప్పటికే పండిపోయారు, అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు.. ముఖ్యంగా ప్రజల దృష్టిని మరల్చడానికి తమిళ సెంటిమెంట్‌ ఉపయోగించడం, వివాదాలు లేవనెత్తడం, రాజకీయాల్లో మోటుతనం, పెరియార్‌ తరహాలో దేవుళ్లను విమర్శించడం.. ఇదీ కరుణ స్టైల్‌. కరుణానిధి పాలనలోనే టూరిజం ప్లేస్‌లకు తమిళ పేర్లు పెట్టడాలు, తమిళ్ కల్చరల్‌ విగ్రహాలు ఏర్పాటు ఇలాంటి చాలా జరిగాయి. ఈ కాంట్రాక్టుల వెనుక చాలా అవినీతి జరిగిందని అప్పట్లో జస్టిస్‌ సర్కారియా కమిషన్‌ పెద్ద నివేదికే ఇచ్చింది. మొత్తానికి పార్టీ ఎప్పుడూ తన చెప్పుచేతల్లో ఉండేలా చూసుకున్నారు కరుణ. పార్టీకి భవనాలు, కార్యాలయాలు కట్టించి, కార్యకర్తలకు ఏదో ఒకరకమైన ఆర్జనామార్గం చూపించి, వాళ్లు పార్టీనే అంటిపెట్టుకునేట్లా చేశాడు. ఈ అవినీతి విషయంలోనే కరుణానిధికి, ఎంజీఆర్‌కి మధ్య గ్యాప్‌ పెరిగింది. అవినీతికి వ్యతిరేకంగా నిలదీసినందుకు ఎంజీఆర్‌ని పార్టీ నుంచి బహిష్కరించేవరకు వచ్చింది. ఆ తర్వాత దిండిగల్‌ ఉపయెన్నికతో ప్రారంభమైన ఎమ్జీయార్‌ విజయపరంపర ఆయన్ని 1977లో ముఖ్యమంత్రిని చేసింది. 12 ఏళ్ల పాటు కరుణానిధిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. కరుణకుఎంజీఆర్‌కు మధ్య గ్యాప్‌ పెరగడానికి మరోకారణం కూడా ఉంది. అదిజయలలిత. అప్పటికే జయలలిత, ఎంజీఆర్‌ల అనుబంధం తారస్థాయిలో ఉందన్నది బహిరంగ రహస్యం. అలాంటి సమయంలో ఎంజీఆర్‌తో తనకెలాంటి భయం లేదని కరుణ ఊహించారు. ఆ సమయంలోనే కరుణానిధి సారథ్యంలో పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, మంత్రులు, శాసనసభ్యులు తమతమ ఆస్తులను వెంటనే ప్రకటించాలనీ ఎమ్జీయార్‌ ప్రకటించాడు. పార్టీ సేకరించిన నిధులేమయ్యాయో ప్రజలకు లెక్కలు చెప్పాలన్నాడు. ‘పార్టీ వ్యవహారాల గురించి బహిరంగంగా మాట్లాడినందుకు ఎమ్జీయార్‌ క్షమాపణ చెప్పాలిఅని పార్టీ తీర్మానించింది. ఎమ్జీయార్‌ క్షమాపణ చెప్పనన్నాడు. వెంటనే ఎంజీఆర్‌ని పార్టీలోంచి బహిష్కరించారు. ఒక దశలో ఈ పరిణామం తన స్టార్‌ ఇమేజ్‌పై ప్రభావం పడుతుందని అనుకున్నారు ఎంజీఆర్‌.

కానీ.. చివరికి ఎమ్జీయార్‌ తెగించారు. పార్టీలోంచి బహిష్కరించిన ఒక వారానికి 1972 అక్టోబరు 18న అణ్నా డిఎంకె పేర పార్టీ పెట్టారు. అచ్చు డిఎంకె జండాలాగానే నలుపు, ఎఱుపుల్లో వుండి మధ్యలో అణ్నా బొమ్మ వుండేట్లా జండాను రూపొందించారు. డిఎంకె ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు కాగా, ఎడిఎంకెకు రెండాకుల గుర్తు కేటాయించారు. ఈ ఫైట్‌లో తర్వాత తమిళ రాజకీయాలు కరుణఎంజీఆర్‌ మధ్య ఫైట్‌గా మారాయి. ఆ వివరాలు తర్వాతి భాగంలో

 

 

 

 

 

 

 

 

 

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *