కృష్ణుడు సముద్రం లాంటివాడు. ఆయన్ను తెలుసుకోవాలన్న ప్రయాణం అనంతం. కృష్ణ తత్వం విశ్వం లాంటిది. లోపలికి వెళ్లిన కొద్ది అది కూడా అనంతం.కృష్ణ అంటే తెలుసుకోవాలన్న తృష్ణ. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ విశ్వరూపం చూపించాలో తెలిసినవాడు. కృష్ణుడుని మించిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఇంకెవరూ లేరు. భగవద్గీతలో ప్రతీ అక్షరం వ్యక్తిత్వ వికాసం. నిత్య పారాయణ గ్రంథమది. వారానికి ఒక్క శ్లోకం నేర్చుకోగలితే.. మనకు మనం తెలుస్తాం. వ్యక్తిత్వ వికాసం అంటే అర్థం మనకు మనం తెలియడమే.మనకు మనం రిపేర్ చేసుకోడమే. వ్యక్తిత్వ వికాసం పాఠాలు వింటే రాదు. ఆచరణలో పెడితే వస్తుంది. ఆ విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి గీతలో చెప్పాడు. ఆ వికాసానికి మార్గాలేంటో చెప్పాడు. ధైర్యవంతుడైన అర్జునుడు కూలబడితే… మళ్లీ అతని ధైర్యాన్ని అతని తెచ్చి ఇచ్చాడు. అదే వ్యక్తిత్వ వికాసమంటే. మనలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని తెలుసుకోవడమే కృష్ణ తత్త్వం. ఆ శక్తి ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే కృష్ణ తత్వం. బాల్యం ఎలా ఉండాలో అల్లరి చేసి చూపించినవాడు కృష్ణుడు. యవ్వనంలో ఎలా ఉండాలో గోపికల కథలతో చెప్పినవాడు కృష్ణుడు. సమయం వచ్చినప్పుడు యుద్ధం ఎలా చేయాలో, ఎలా బతకాలో చెప్పిన వాడు కృష్ణుడు. ఆఖరికి ఎలా మరణించాలో చెప్పినవాడూ కృష్ణుడే. వెన్న దొంగలించినా, గోపికలకు మనసు పంచినా, కురుక్షేత్రాన్ని నడిపించినా.. ఈ మూడూ వేరు వయసుల్లో మన ఆలోచనలు ఎలా ఉండాలో చెప్తాయి. ఆడే వయసులో ఆడాలి, పాడే వయసులో పాడాలి, యుద్ధం చేయాల్సి వస్తే అది సరిహద్దులో అయినా, జీవన పోరాటంలో అయినా యుద్ధమే చేయాలి. దీనికి ఆప్షన్స్ లేవు. అదే కృష్ణ తత్వం. అందుకే భగవద్గీతను పూజగదిలో బూజులు పట్టించకండి. తీసుకెళ్లి మీ పుస్తకాల ర్యాక్‌లో పెట్టండి. వారానికి ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవితం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ భగవద్గీతే మీకు అద్దమవుతుంది. అంటే ఆ గీత మీకు అద్దంలా మారి మిమ్మల్ని మీకు చూపిస్తుంది.
-సతీష్ కొత్తూరి