June 7, 2023

కార్తిక మాసమంటే శివుడు, విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైన మాసమే. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. ఆ రోజున శ్రీ మహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. మళ్లీ కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని పురాణ గాధ. అందుకే కార్తిక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధ ఏకాదశి అంటారు. ఉత్థాన ఏకాదశి మనలో ఉన్న చీకట్లను తొలగించి చైతన్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ ఉత్థాన ఏకాదశి వెంటనే వచ్చేది క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహా విష్ణువు మహాలక్ష్మని స్వీకరించి అన్ని లోకాలను మంగళకరం చేశారని పురాణాలు చెప్తున్నాయి.

క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏమిటి ?

క్షీరాబ్ది ద్వాదశినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు. దేవదానవుల క్షీర సాగర మథనం ముగిసిన రోజు ఇదే. మజ్జిగను చిలకడం అంటాం కదా. అలాగే పాల సముద్రాన్ని కూడా దేవదానవులు చిలికారు. అందుకే చిలుక ద్వాదశి అనే పేరు వచ్చిందంటారు. క్షీరసాగర మధనంలో హాలాహలం, కల్ప వృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు ఆ తర్వాత శ్రీ మహా లక్ష్మి ఉద్భవించారు. అలా ఉద్భవించిన మహాలక్ష్మిని క్షీరాబ్ది ద్వాదశి నాడు మహా విష్ణువు పరిణయమాడారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు అంటే శ్రీ మహా విష్ణువు యోగనిద్రకు ఉపక్రమించిన రోజు నుంచి యోగులు చాతుర్మాస దీక్ష చేస్తారు. ఆ దీక్షలను క్షీరాబ్ది ద్వాదశి నాడు విరమిస్తారు.అందుకే ఈ ద్వాదశిని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. లక్ష్మీ సమేతుడై శ్రీ హరి బృందావనం చేరిన తిథి కాబట్టి బృందావన ద్వాదశి అని కూడా అంటారు. దేశ వ్యాప్తంగా ఈ రోజున పూజలు జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆనవాయితీ ఉంది. మన తెలుగు వారు సాయంకారం ఉసిరికాయలతో ఉన్న ఉసిరి కొమ్మను తులసికోటలో ఉంచి పూజ చేస్తారు. తులసిని లక్ష్మిగా, ఉసిరిని విష్ణువుగా తలచి పూజిస్తారు. కార్తీక వనభోజనాలు ఉసిరి చెట్టు నీడలో చ చేసేది ఇందుకే. మహారాష్ట్రలో కృష్ణునికి, తులసికి కల్యాణం చేస్తారు. తులసి కోటను అందంగా అలంకరిస్తారు.

ఇక తిరుమలలో క్షీరాబ్ది ద్వాదశి.. కైశిక ద్వాదశిగా వైభోగంగా జరుగుతుంది. తిరుమల శ్రీవారికి పంచబేరాలు ఉన్నాయి. అంటే ఐదు రూపాల్లో విగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మాత్రమే ఊరేగే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు. కైశిక ద్వాదశి నాడు శ్రీదేవీ భూదేవ సమేత ఉగ్ర శ్రీనివాసుడు తిరువీధులల్లో ఊరేగుతారు. అది కూడా వేకువ జామునే ఊరేగి… సూర్యుని కిరణాలు పడక ముందే స్వామి ఆలయానికి చేరుకుంటారు. సూర్య కిరణాలు సోకితే ఉగ్ర శ్రీనివాసుడికి ఉగ్రత్వం వస్తుందని ఓ నమ్మిక.

ఈ ఉగ్ర శ్రీనివాసుడు కథ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా తిరుమలలో మనం మాడ వీధుల్లో విహరించే వేంకటేశుని ఉత్సవ విగ్రహం భోగ శ్రీనివాసుడు.ఈ భోగ శ్రీనివాసుని కన్నా ముందు ఇప్పుడు చెప్పుకున్న ఉగ్ర శ్రీనివాసుని విగ్రహాన్నే వినియోగించేవారట. కానీ ఓసారి బ్రహ్మోత్సవాల సమయంలో అగ్నిప్రమాదం జరిగి చాలా నష్టం జరిగిందట. అప్పుడు ఓ భక్తుడిని ఆవహించిన స్వామి ఈ విగ్రహాన్ని ఊరేగింపుల కోసం వినియోగించవద్దని చెప్పారట. తిరుమల లోయలోనే శ్రీదేవి భూదేవి సమేతంగా మరో మూర్తి రూపంలో వెలిశానని… ఆ విగ్రహాలనే ఉత్సవ మూర్తులుగా వినయోగించాలని కూడా చెప్పారట. అలా స్వామి చెప్పిన ప్రాంతంలో దొరికిన విగ్రహాలే ఇప్పుడు తిరుమల ఉత్సవాల్లో మనం చూస్తున్న మలయప్ప స్వామి. ఉగ్ర శ్రీనివాసుని వెనుక ఇంత కథ ఉంది.అందుకే ఇన్ని విశేషాలు, ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిన క్షీరాబ్ది ద్వాదశి అత్యంత పవిత్ర పర్వదినం.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *