రాజకీయాల్లో 50 ఏళ్లు ఉండడమే గొప్ప విషయం. అలాంటిది ఓ పార్టీకి అధ్యక్షుడిగా 50 ఏళ్లు ఉంటే..? అది వండరే. రాజకీయ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన ఒకే ఒక వ్యక్తి కరుణానిధి. ద్రవిడ మున్నేట్ర కళగం(DMK) తమిళనాట ఈ పార్టీ ఓ చరిత్ర. సంచలనాలు సృష్టించిన ఆ పార్టీకి కర్త, కర్మ అన్నీ కరుణానిధే. అన్నీ తానై నడిపించిన కురువృద్ధుడు. వివాదాలెన్నున్నా తమిళనాడు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించిన వారిలో కరుణానిధి పేరు ప్రముఖం. అంతే కాదు ఆయన కథను సినిమాగా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాంటి లైఫ్ స్టోరీ ఆయనది. 90 వ పడిలో ఆయనిప్పుడు ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు. అసలు కరుణానిధి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం క్కడి నుంచి మొదలైంది..? ఆయన 12 ఏళ్లకే అవును 12 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చారన్న విషయం తెలుసా? కరుణానిధి జీవితాన్ని బాల్యం, విద్యార్థి దశ, పెరియార్ శిష్యరికం, తమిళ ఉద్యమ దశ, రాజకీయ దశగా విభజించవచ్చు. వీటిలో కరుణానిధి బాల్యం గురించి ఆసక్తికర వివరాలందిస్తోంది.. ట్రెండిగ్ భారత్.
1924లో తంజావూరు జిల్లా తిరుక్కువులై అనే ఊర్లో కరుణానిధి జన్మించారు. ఆయన ఇసై వెల్లాల కులస్తులు. ఇసై అంటే సంగీతం. వెల్లాలలు రైతులు. వీరి కులవృత్తి శుభ కార్యాలకు, ఆలయాల్లోనూ డోలు సన్నాయి వాయించడం. కరుణానిధికి కులవృత్తిలో ప్రవేశం లేదు. ఎం.కరుణానిధి ఆయన పూర్తిపేరు. M అంటే… ఆయన తండ్రి పేరు ముతువేల్. తల్లి అంజుగమ్. ఎన్నో మొక్కుల తర్వాత ముతువేల్, అంజుగమ్‌లకు కరుణనిధి కలిగాడు. మొక్కు తీర్చడం కోసం కరుణకు మొదట పెట్టిన పేరు దక్షిణామూర్తి. ఆ తర్వాత నాస్తికవాదిగా మారిన కరుణ.. దక్షిణామూర్తి పేరుని, భక్తిని రెండూ వదిలేశారు. ఐదో క్లాసు వరకు కరుణ మాతృభాష తెలుగే. రాజకీయాల్లో పీక్ స్టేజ్ లో ఉన్న ఉన్నప్పుడు ఎంజీఆర్, కరుణ మధ్య మాటల యుద్ధం జరిగేది. ఆ సమయంలో ఎంజీఆర్‌ని మలయాళీ అని కరుణ, కరుణ తెలుగువాడేనని ఎంజీఆర్ విసుర్లు విసురుకునేవారు. అలా ఈ విషయం తమిళులకూ తెలుసు. తంజావూరులో తెలుగువాళ్లు ఎక్కువ. ఇప్పటికీ చాలా తెలుగు కుటుంబాలు ఉన్నాయి. కరుణ మాతృభాష తెలుగే అయినా సేవచేసింది మాత్రం తమిళ భాషకే. ఆయన మొదటి, రెండవ భార్యలు ఇద్దరూ తల్లిదండ్రులు ఎంపిక చేసినవారే. మూడో భార్య… కనిమొళి తల్లి. ఆమెను కరుణ ఏరికోరి చేసుకున్నారు. కరుణకు ఇద్దరు చెల్లెళ్లు.. షణ్ముగ సుందరి, పెరియనాయకి. వీరిలో షణ్ముగ కుమారులే మారన్, సెల్వన్. వీరిలో మారన్… మురసోలి మారన్‌గా అందరికీ తెలుసు. కేంద్రమంత్రిగా కూడా చేశారు. కరుణానిధికి మారన్ ముద్దుల మేనల్లుడు. మారన్ కుమారులు కళానిధి, దయానిధి. వీరిద్దరూ సన్ టీవి అధిపతులు. ఇది క్లుప్తంగా కరుణ ఫ్యామిలీ.
ఇక కరుణ బాల్యంలో ఎన్నో ట్విస్టులు. సినిమా తీస్తే రికార్డులు బద్దలు కొట్టే కథ. చాలా మొక్కులు మొక్కాక కరుణ పుట్టారని చెప్పుకున్నాం కదా. అందుకే ఆయన తల్లిదండ్రులు కనిపించిన ఆలయానికల్లా తీసుకెళ్లి కరుణానిధి తలనీలాలు సమర్పించేవారు. అలా చిన్నప్పుడు కరుణ ఎప్పుడూ గుండుతోనే కనిపించేవారట. 10 ఏళ్ల వయసు వచ్చాక కరుణానిధి గుండు కొట్టించుకోనని మొరాయించారు. చిన్నప్పటి తెలివైనవాడు. చదువుపై శ్రద్ధ ఉండేది కాదు. ఊరి కుర్రాళ్లతో తిరగడం, మొండితనం ఇలా ఉండేది కరుణ వ్యవహారం. కరుణానిధి తండ్రి వ్యవసాయంతో నాటు వైద్యం కూడా చేసేవారు. ఆయనకు సంగీతం తెలుసు. కచ్చేరీలు కూడా చేసేవారు. కరుణానిధిని కులవృత్తిలో పెడదామని ఆయన ప్రయత్నించి విఫలమయ్యాడు. పదకొండేళ్ల వయసుకే నాటకాలు రాయడం, వేయడం కూడా చేసేవారు కరుణ. ఏదో వ్యాపకం ఉంది కదా అని తండ్రి ఊరుకునేవారు. అయితే కరుణ పన్నెండో ఏట ఆయన జీవితంలో రెండు మలుపులు వచ్చాయి. ఒకటి రాజకీయాల్లో, రెండోది ప్రేమ వైఫల్యం. రెండూ ముఖ్య ఘట్టాలే. మొదటిది చూద్దాం. అప్పటికి అంటే 1936 సమయంలో పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం తమిళనాడుని ఊపేస్తోంది. వేల సంఖ్యలో యువకులు పెరియార్ ఫాలోవర్స్‌గా మారుతున్న సమయం. ఆయన పెట్టిన ద్రవిడ కళగం (DK)… తమిళనాడు పల్లెల్లో సభలు నిర్వహించేది. కరుణానిధి, ఆయన మిత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యేవారు. అలా పెరియార్ ఏకలవ్య శిష్యుడయ్యాడు. ఆయన భావాలు కరుణకి బాగా వంటబట్టాయి. ఆ తర్వాత కరుణానిధి పెరియార్ ఉద్యమానికే నాయకుడయ్యాడు. తమిళుల మనోభావాలే పెట్టుబడిగా పెరియార్ ఎదిగారు. అందరిలో తమిళ గౌరవం పేరిట భావాలు రెచ్చగొట్టారు. ఇప్పటికీ మీకు తమిళనాడులో పెరియార్, అన్నాదురై కటౌట్లు లేకుండా మీటింగులు కనిపించవు. పెరియార్ అంత ప్రభావం చూపించారు. నాస్తికత్వం, దేవుళ్లను విమర్శించడం, బ్రాహ్మణ వ్యతిరేకత ఇవన్నీ పెరియార్ సూత్రాలు. తమిళం అనే సెంటిమెంట్ ని పొలిటికల్ బ్రాండ్‌గా మార్చారు పెరియార్. కరుణానిధి తనకు రాజకీయ పరమైన చిక్కులు వచ్చినప్పుడల్లా హిందూ దేవుళ్లనో, బ్రాహ్మణులనో తిడుతూ ఓ వాఖ్య చేస్తారు. తమిళులు ఊగిపోతుంటారు. ఇది పెరియార్ స్టైల్. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, హింది వ్యతిరేక ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమాలు ఇలా జస్ట్ 12 ఏళ్ల వయసులోనే కరుణానిధిని పెరియార్ మహా భక్తుడిగా మార్చాయి.
1936నాటికి పెరియార్ స్వయం మర్యాద ఉద్యమం (మన భాషలో ఆత్మ గౌరవ ఉద్యమం అన్నమాట) చాలా పాపులర్. అది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం. కరుణానిధికి సహజంగానే ఆ ఉద్యమం నచ్చింది. ఆయనతో పాటూ ఎంతో మంది యువకులు ఈ ఉద్యమంలో చేరారు. పెరియార్… కుడి అరసు, రివోల్ట్ అనే ఆంగ్ల పత్రిక నడిపేవాడు. ఈ పత్రికల ద్వారా తన ప్రసంగాలు పచారం చేసేవారు. పెరియార్ ఫాలోవర్స్ నల్లచొక్కాలు వేసుకునేవారు. నాస్తిక ప్రచారం చేసేవారు. పురాణ పురుషుల ప్రతిమలను తిడుతూ ఊరేగింపులు చేయడం ఇలాంటివెన్నో చేసేవారు. వీళ్ల నాస్తికత్వం అంతా హిందుమతం మీదే చూపించేవారు. వేరే మతాల జోలికి వెళ్లేవారు కాదు. ఉడుకు వయసులో ఉన్న కుర్రాళ్లకు ఇలాంటి విషయాలు సైకలాజికల్‌గా ఇంజక్ట్ అవుతాయి. సహజంగానే కరుణకు ఈ ఉద్యమం బాగా నచ్చింది. కరుణకు ఆ వయసు నుంచే రచనా శక్తి బలంగా ఉంది. అది వరం. ఆ వరమే తమిళ సినిమా రంగంలో కరుణను తిరుగులేని రైటర్‌ని చేసింది. అందుకే.. పెరియార్ ఉద్యమంలో కరుణ తన కలంతో వడివడిగా అడుగులేశారు. తన ఆలోచనలను కాగితం మీద పెట్టారు. అదే ఊపుతో “మానవర్ మురసు” అంటే విద్యార్థి ఢంకా అనే అర్థం వచ్చేలా పత్రిక ప్రారంభించారు. తన అభిప్రాయాలు రాసి కరపత్రాల ద్వారా పంచేవారు. మానవర్ మురసు ఆదరణ పొందింది. అదే ఊపులో 13 ఏళ్లకే తన దృష్టిని రాజకీయాలపైపు మళ్లించారు కరుణ. “మురసోలి” అంటే ఢంకా చప్పుడు అని అర్థం. మురసోలి పేరిట మరో పత్రిక ప్రారంభించారు. ఇది పూర్తి రాజకీయ కరపత్రం. చేరన్ అనే కలం పేరుతో కరుణ తన భావాలను ధైర్యంగా వెల్లడించేవారు. ఆ తర్వాత కరుణానిధితో పాటు మురసోలి పత్రిక కూడా ఎదిగింది. కరుణానిధి రాజకీయాల్లో బిజీ అయ్యాక మేనల్లుడు మారన్ ఈ పత్రికను నిర్విహించేవాడరు. అందుకే ఆయన్ని మురసోలి మారన్ అనేవారు. కరుణ మొదలు పెట్టిన రోజుల్లో మురసోలి పత్రిక స్థానిక ద్రవిడ రాజకీయ నాయకుల దృష్టిలో పడింది. ఆ సమయంలోనే ద్రవిడ కళగం సంస్థ హిందీ వ్యతిరేక ఉద్యమం నడుపుతోంది. ఏ ఉద్యమమైనా ముందుకెళ్లాలంటే విద్యార్థులే కీలకం. అందుకే హిందీ వ్యతిరేక ఉద్యమం కోసం చురుకైన విద్యార్థి నాయకుడు కోసం పెరియార్ చూస్తున్నారు. అప్పుడే సన్నిహితుల ద్వారా కరుణానిధి పేరు తెలిసింది. తిరువారూర్ వచ్చినపుడు కరుణను పిలిచి ఉద్యమంలో పనిచేయమని అడిగారు. రాజకీయ అవకాశం కోసం చూస్తున్న కరుణ తక్షణం సరే అన్నారు. ద్రవిడ కళగం మీటింగులు కరుణే స్వయంగా ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఏ పనైనా జోరు మీద చేసేవారు. ఓ సారి వక్తలకు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే తల్లి నగలమ్మి ఏర్పాటు చేశారు. అలా చిన్నప్పటి నుంచి ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు వంటబట్టించుకున్నారు. అందుకే 13 ఏళ్లకే.. ఆయన కంటే వయసులో పెద్దవాళ్లు కూడా కరుణని తలైవర్ (నాయకుడు) అని పిలిచేవారు. ఈ రాజకీయ జోరులో చదువు వెనకబడింది. మురసోలి నడపడం, ఉద్యమంలో తిరగడం, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రసంగాలు రాసి పెట్టడం… ఇక చదువు చెట్టెక్కింది. కొన్నాళ్లకే చదువు, స్కూలు రెండూ వదిలేశారు. తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా ఫలితం శూన్యం. ఇలా కరుణకి 14 ఏళ్లు వచ్చాయి.
14 ఏళ్లకి కరుణ జీవితంలో మరో మలుపు. అప్పుడే పెరియార్ శిష్యుడు, తమిళనాడు రాజకీయాల్లో సంచలనం, గొప్ప నాయకుల్లో ఒకరైన అన్నాదురై పరిచయమయ్యారు. అన్నా రాసే తమిళభాష చాలా అందంగా, కవితాత్మకంగా ఉండేది. తమిళులకు ఇప్పటికీ ఇలాంటి డైలాగ్సే ఇష్టం. రచయితగా కరుణని సాన పట్టింది అన్నానే. అయితే.. ఇప్పుడే రాజకీయాలు వద్దు… ముందు బాగా చదువు.. అని కరుణకి అన్నా సలహా ఇచ్చారు. బట్.. కరుణకు ఇలాంటి సలహాలు నచ్చవు. తను అనుకున్నదే జరగాలన్న తత్వం. అన్నా సలహాను కరుణ పట్టించుకోలేదు. పైగా.. అన్నా నడుపుతున్న ద్రవిడనాడు పత్రికకు పోటీగా మురసోలిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి వరకు కర పత్రాలుగా వచ్చే మురసోలిని ప్రింట్ వేయించడం స్టార్ట్ చేశాడు. పత్రిక చుట్టుపక్క ఊళ్లలో బాగా పాపులర్ అయింది. ఇదే కరుణ రాజకీయ జీవితంలో మేలి మలుపు.
ఆ తర్వాత ఏం జరిగింది..? కరుణానిధి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు..? ఎలా తిరుగు లేని నేతగా ఎదిగారు..? ఎంజీఆర్, కరుణ మధ్య బంధమేంటి..? కరుణకి కూడా ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది తెల్సా..? మా తర్వాత కథనంలో చూడండి…
పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి