లైఫ్… ఆల్రెడీ పైనున్న వాడు ప్రోగ్రామింగ్ చేసేసి పైనుంచి సినిమా చూస్తుంటాడు. మనం ఇక్కడ ఏవోవో చేసేద్దాం అనుకుంటాం. కానీ ఇంకేవో కొత్తగా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి లైఫ్ జర్నీనే మళయాళంలో వచ్చిన హృదయం. సినిమా అంతా మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ భుజాల మీద మోసి… శభాష్ అనిపించాడు. హృదయం… ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. ఆప్పట్లో తమిళంలో మురళీ హీరోగా ఈ పేరుతోనే సినిమా వచ్చింది. ఊసులాడే ఓ జాబిలమ్మ అనే పాట ఇప్పటికీ ఒక్కోసారి చాలా మందికి తెలియకుండానే హమ్మింగ్‌లా వచ్చేస్తుంటుంది. ఆ సినిమా క్లాసిక్. ఇప్పుడు మళయాళంలో వచ్చిన ఈ సినిమా కూడా కల్ట్ క్లాసిక్.
మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ హీరో. ఇతను మరక్కార్ సినిమాలో చిన్నప్పటి మోహన్ లాల్‌గా వేశాడు. చాలా ఈజ్ ఉంది. ఇతనికి వాళ్ల నాన్నలాగే యాక్షన్ పాషన్. 2002లోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీకే కేరళ స్టేట్ అవార్డ్ తీసుకున్నాడు. మోహన్ లాల్ ఎలాంటి నటుడో తెలిసిందే కదా. అందుకేనేమో డైరక్టర్ దగ్గర పెడితే యాక్షన్ అంటే ఏంటో, ఎలా చెయ్యాలో తెలుస్తుందని అనుకున్నట్టు ఉన్నాడు. దృశ్యం లాంటి క్లాసిక్ తీసిన జీతూ జోసెఫ్ దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు ప్రణవ్. ఏదో వారసుడిగా ఎంట్రీ ఇచ్చేయలేదు. డ్యాన్స్ బాగా తెలుసు, సింగర్, రైటర్.. ఇన్ని ఉన్నాయి ప్రణవ్‌లో. ఆయన లీడ్ రోల్‌లో చేసిన ఫస్ట్ మూవీ ఆది. ఆ సినిమాలో.. ప్రణవ్ రాసి, పాడిన జిప్సీ వుమెన్ సాంగ్ సూపర్ హిట్. ఆ తర్వాత మరక్కార్ సినిమాతోనే సౌత్ అంతా బాగా తెలిశాడు. ఆ తర్వాత రిలీజైన హృదయం సినిమాతో మళయాళంలో మరో స్టార్ హీరో అయ్యాడు ప్రణవ్.
హృదయం కల్ట్ క్లాసిక్ హిట్. హైద్రాబాద్‌లో కూడా ఈ సినిమా రిలీజైంది. హౌస్‌ఫుల్స్‌తో ఆడింది కూడా. ఓటీటీల పుణ్యమాని మంచి కథలుండే మళయాళీ సినిమాలను కూడా మనవాళ్లు సబ్ టైటిల్స్‌తో ఎలాగోలా అర్థం చేసుకుని మరీ ఆదరిస్తున్నారు. దటీజ్ తెలుగు ఆడియన్. ఇంత క్లాసిక్ సినిమాలో కథేమైనా కొత్తదా అంటే పాతదే. సినిమా చూసినంత సేపు… మనకు లీలగా మై అటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. కథలు వేరే గానీ థ్రెడ్ ఒకటే. ఒక కాలేజ్‌లో హీరో లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ర్యాగింగ్, ఎంజాయ్‌మెంట్,
ఒక అమ్మాయి పరిచయం, ఆమెతో ఇన్ఫాక్చుయేషనో, లవ్వో తెలియని ఒక అటాచ్‌మెంట్. మరో అమ్మాయి కనిపిస్తే… ప్రేమించిన ఆమెను మరిచిపోయి… ఆమెతోనూ రొమాన్స్‌కి సిద్ధమయ్యే కుర్రతనం. అది తెలిసి ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్. ఆ తర్వాత తప్పు తెలుసుకుని లవర్‌ని బతిమాలినా, క్షమించని ఈ అమ్మాయి స్టుపిడిటీ. దాని వల్ల ఆ అమ్మాయే లాస్ అవుతుంది సినిమాలో. చదువులో వెనకపడి బ్యాక్‌లాగ్స్, మళ్లీ రియలైజేషన్ చదువు పూర్తిచేయడం. ఇలా ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది. సెకండ్ అఫ్‌లో కథ చాలా బాగుంటుంది. రియల్ లైఫ్ అంటే ఎలా ఉండాలి? మనకు నచ్చిన పనిలో ఉండే సంతృప్తి ఏంటి? హీరో లైఫ్ ఏ టర్న్ తీసుకుందనేది సెకండ్ ఆఫ్. ఓవరాల్‌గా ఒక మనిషి జీవితం… అతని ప్రయాణం. మనం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఒక్కోసారి క్షమించే అవకాశం ఉన్నా క్షమించకపోతే దాని పర్యవశానాలు ఎంత దారుణంగా ఉంటాయి.. ఇలాంటి మంచి సందేశం చాలా ఉంది ఈ సినిమాలో. దాదాపుగా ఇలాంటి థ్రెడ్‌తో ఆటోగ్రాఫ్‌లాంటి సినిమాలు వచ్చాయి. కానీ… మనకు తెలియకుండానే సినిమాలో లీనమైపోతాం.అబ్దుల్ వహాబ్ ఇచ్చిన సంగీతమైతే చాలా చాలా ప్లెజెంట్‌గా ఉంది. అన్ని పాటలు మరోసారి వినాలపించేలా ఉంటాయి. ముఖ్యంగా కర్ణాటక సంగీతాన్ని వహాబ్ ఎంత అందంగా ఉపయోగించాడంటే… ఈ మధ్య కాలంలో ఇంత
అందమైన సంగీతాన్ని విన్నది చాలా తక్కువే. ముఖ్యంగా ‘దర్శనా’ అనే పాట చాలా రోజులు వెంటాడుతుంది. వినీత్ శ్రీనీవాసన్ దీనికి డైరెక్టర్. అతను ఈ సినిమాకి మంచి లైఫ్ తీసుకొచ్చాడు. ప్రతీ షాట్‌లోనూ ఎక్స్‌ప్రెషన్స్ చూపించాల్సిన బరువైన పాత్రలో ఎక్కడా ప్రణవ్ మోహన్ లాల్ కొత్త యాక్టర్‌లా కనిపించడు. వాళ్ల నాన్నగారికి సరైన వారసుడు. 6 కోట్లు పెట్టి తీసిన సినిమాకి 60 కోట్ల కనక వర్షం కురిసింది. మళయాళంలో రీసెంట్ టైమ్‌లో హైయస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో ఇదీ ఒకటి. డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఒక మంచి ఫిల్టర్ కాఫీ లాంటి సినిమా. తప్పనిసరిగా చూడండి.