September 21, 2023

మెగా స్టార్‌ చిరంజీవి. ఈ పేరు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. తెలుగు సినిమాకి చిరంజీవి ఒక బ్రాండ్‌. బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. అయితేనేం కలల్లో కసి ఉంది. గెలిచే దమ్ముంది. తెలుగు తెరను ఏలే ప్రతిభ ఉంది. ఒక సాధారణ యువకుడు… అంచెలంచెలుగా ఎదిగి దేశమంతా గర్వించే గొప్ప కథానాయకుడు అయ్యాడంటే ఆ చరిత్ర పేరు చిరంజీవి. కృషితో నాస్తి దుర్భిక్షమ్‌ అనే వేదవాక్కుకి అసలైన రూపం చిరంజీవి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, కథానాయకులూ అవుతారు. మన చిరంజీవి హీరోలకే హీరో అయ్యారు. పేరుకు తగ్గట్టే ఆయన క్రేజ్‌కి వయసు లేదు. అందుకే ఆరు పదులు దాటినా ఆయనలో పదును తగ్గలేదు. ఇప్పటికీ ఆయన కనిపిస్తే పూనకాలు లోడింగే. కొంతమంది మహానుభావులకు శరీరానికే వయసు, మనసుకి కాదు. మన మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పటికీ నవ యువకుడే. థియేటర్ల ముందు చిరు సినిమా రిలీజ్‌ డేటే ఫ్యాన్స్‌కి సంక్రాంతి పండుగ. మెగాస్టార్‌గా మన చిరంజీవి సాధించిన సంచలనాలు ప్రతీ ఒక్కరికి తెలిసినవే. కానీ ఆయన ఎక్కడి నుంచి మొదలయ్యారు, ఎలా ఒక్కో మెట్టు ఎక్కారు? ఆయన గెలిచే దారిలో ఎదురైన వైఫల్యాలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలు.. ఇవన్నీ ఈ తరానికే కాదు ఏ తరానికైనా గెలుపు పాఠాలే. ఒక వ్యక్తి తను అనుకున్నది సాధించి, తన కలను నిజం చేసుకుని ఎవరెస్ట్‌ అంత ఎత్తులో గెలుపు పతాకాన్ని ఎగరెయ్యాలాంటే… ఎంతో కసి ఉండాలి. ఆ విజేత పేరు చిరంజీవి. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం…..

1955 ఆగస్ట్‌ 22. కొన్ని తేదీలు చరిత్రలుగా మారిపోతాయి. ఆ తేది కూడా ఓ చరిత్రను తనలో దాచుకుంది. ఆ రోజున సిల్వర్‌ స్క్రీన్‌కు మకుటం లేని చక్రవర్తి పుడతాడని కాలానికి తెలుసు. ఉదయం 10 గంటలకు కొణెదెల శివ శంకర వర ప్రసాద్‌ జన్మించాడు. చిరంజీవికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అదే. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మిషనరీ ఆస్పత్రిలో జననం. తండ్రి వెంకట్రావు, తల్లి అంజనా దేవి. వెంకట్రావు గారు ప్రభుత్వ ఉద్యోగి. సహజంగానే ప్రతీ మూడేళ్ల కోసారి ట్రాన్సఫర్లు అవుతుండేవి. అందుకే చిరంజీవిగారి బాల్యం ఒక చోట గడవలేదు. చిరంజీవి ఓనమాలు నిడదవోలులో జరిగింది. బాల్యం గురజాలలో కొన్నాళ్లు సాగింది. మంగళగిరి,పొన్నూరు. మొగల్తూరు, బాపట్ల ఇలా పదో తరగతి వరకు నాలుగైదు ఊళ్లలో చదివారు. ఒంగోలులో చిరంజీవి గారి ఇంటర్‌మీడియట్‌ చదువు పూర్తైంది. ఆయన జన్మించిన నరసాపురంలోనే డిగ్రీ చేశారు చిరు. అక్కడే సినిమాల మీద ఆసక్తి పెరిగింది. ఇంటర్‌ సమయం నుంచే చిరంజీవికి నాటకాలంటే ఇష్టం ఉండేది. ఆటవిడుపుగా ఇంటర్‌, డిగ్రీ టైమ్‌లో చాలా నాటకాల్లో పాత్రలు వేశారు చిరు. 1976లో చిరంజీవి జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. ఆ ఏడాది NCC క్యాడెట్‌ కెప్టెన్‌గా ఢిల్లీలో జరిగిన సాంస్కృతి ఉత్సవాల్లో చిరు పాల్గొన్నారు. ఆ ఉత్సవాల్లో పోతురాజుగా చిరు నటించారు. ఆ జనసమూహం, ఆ కేరింతలు, ఆ చప్పట్లు అంత మందిలో నటించడం అదే మొదటి సారి. అక్కడి నుంచే ఆయనలో నటనపై ఆసక్తి పెరగిందని చెప్పాలి. అదే విషయాన్ని తండ్రికి చెప్తే మొదట ఒప్పుకోలేదు.

1977లో అకౌంటెన్సీ చదువు కోసం వెళ్తానని చిరు మద్రాసు వెళ్లారు. ఓ మిత్రుడి రూమ్‌లో ఉంటూ అకౌంటెన్సీ చదువుతున్నారు. కానీ ధ్యాస అంతా సినిమాల మీదే. పగలు అకౌంటెన్సీ, రాత్రి ఓ వెస్ట్రన్‌ డ్యాన్స్‌ స్కూల్లో డ్యాన్స్‌ నేర్చుకున్నారు. అలా డాన్స్‌ అంటే ప్యాషన్‌ పెరిగింది. డాన్స్‌ అంటే ఒళ్లు విరవడం కాదు బీటుకు తగ్గట్టు స్టెప్పులు వేస్తేనే కిక్కు అని ఆనాడే తెలుసుకున్నారు. అందుకే చిరు డ్యాన్సులు చూస్తే పాటకు తగ్గట్టుగా ఉంటాయి. అలాగే నవ్వుతూ వేస్తారు. డ్యాన్స్‌ విత్‌ ఎక్స్‌ప్రషన్‌ పెర్‌ఫెక్ట్‌గా చూపించే అరుదైన హీరో చిరంజీవి. ఫైట్లను కూడా డ్యాన్సులంత అందంగా చేయగల హీరో చిరంజీవి మాత్రమే అని బాపూ లాంటి దర్శకులు అనేవారు. ఆ డ్యాన్సులు, ఫైట్లకే ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోయేవారు. ముఖ్యంగా యముడికి మొగుడు, పసివాడి ప్రాణంలో బ్రేక్‌ డ్యాన్స్‌లు ఇప్పటికీ మైండ్‌ బ్లోయింగే. అలా డాన్స్‌ నేర్చుకుంటూ మద్రాస్‌లో ఫిల్మ్‌ అకాడమీలో చేరారు. ఇవన్నీ బంధువుల ద్వారా చిరంజీవి తండ్రిగారికి తెలిశాయి. ఒక్క ఏడాది ప్రయత్నిస్తానని, అవకాశాలు రాకపోతే వదిలేస్తానని తండ్రికి మాట ఇచ్చారు చిరు. ఒక చిన్న గదిలో నివాసం. విజయరాఘవాచారి వీధిలో ఉండేది ఆ రూమ్‌. అంతకు ముందు అదే రూమ్‌లో ఎస్వీఆర్‌, ఎన్టీఆర్‌లు కూడా ఉండేవారట. అప్పుడప్పుడు తిండికి కూడా ఇబ్బంది పడిన రోజులు. పదే పదే ఇంటి నుంచి డబ్బు పంపమని అడిగే వ్యక్తి కాదు చిరు. ఆ ఆకలే కసిని మరింత పెంచింది. అక్కడే సుధాకర్‌, నారాయణ రావు, హరిప్రసాద్‌ మిత్రులయ్యారు. ట్రైనింగ్‌లో ఉండగా సుధాకర్‌ చిరంజీవి కన్నా ముందే తమిళంలో స్టార్‌ అయ్యాడు. నారాయణ రావుకి అవకాశాలు వచ్చాయి. హరిప్రసాద్‌ శివరంజని లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలో హీరో అవకాశం వచ్చింది. కానీ అప్పటికి ఇంకా మన చిరంజీవి చరిత్ర మొదలు కాలేదు. ఒక చరిత్ర అంత సులువుగా మొదలు కాదు. ఎన్నో కష్టాలు. మరెన్నో అవమానాలూ చూడాలి. కొలిమిలో కాలిన కొద్దీ బంగారం కాంతి పెరుగుతుంది. అందరికీ అవకాశాలు వస్తున్నా చిరంజీవి తన ప్రయత్నాలు తాను ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్లారు. పాండీ బజార్‌లో ఎదురు చూపులు, మౌంట్‌ రోడ్ ఎండల్లో కాళ్లు కాలుతున్నా నడకలు, ఉన్న డబ్బులతో శాంతా భవన్‌ సాంబారు సాదం, మనసు బరువెక్కితే మెరీనాతో కబుర్లు ఇలా గడిచేది చిరంజీవికి అవకాశాలు రాకముందు. కానీ ఆ కష్టం ఊరికే పోలేదు.

అప్పటికి తెలుగు సినిమా కథలు రొటీన్ అయిపోయాయి. అవే కథలు, ఆవే ఫైట్లు, అవే పాటలు, చిన్న ఫైట్లకు కూడా డూపులు. అప్పటికే హాలివుడ్‌ సినిమాలు ఊపుతున్నాయి. బాలివుడ్‌లో డిస్కో కల్చర్‌ ఉర్రూతలూగిస్తోంది.యువత అభిరుచులు మారాయి. అలాంటి ఫైట్లు, డ్యాన్సులు చేసే హీరో మనకు లేడా అనుకునే దశలో మెరిసిన మెరుపే చిరంజీవి. ఒక కొత్తదనం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయం అది. అలాంటి సమయంలో 1978లో కెమెరా ముందు ఒక స్పార్క్‌ మెరిసింది. ఆ స్పార్క్ చిరంజీవీ. పునాది రాళ్లు సినిమాకి చిరంజీవి ఎంపికయ్యారు. పునాది రాళ్లు సినిమాలో చిరంజీవి వేయాల్సిన పాత్ర సుధాకర్‌ వేయాలి. అప్పటికే తమిళంలో బిజీగా ఉన్న సుధాకర్‌ ఆ పాత్ర చేయలేను అన్నాడు. అలా చిరు నటనా ప్రస్థానానితి తొలి పునాది.. పునాది రాళ్లు. స్క్రీన్‌ మీద శివ శంకర వర ప్రసాద్‌ అంటే పేరు పొడుగ్గా ఉందన్నారు. అప్పుడే చిరు కలలో ఆంజనేయ స్వామి కనిపించడం, వర ప్రసాద్‌ని చిరంజీవి అని పిలిచినట్టుగా అనిపించడం.. తన పేరుని చిరంజీవిగా మార్చుకోవడం దైవ సంకల్పం. ఒక చరిత్రకు శ్రీకారం. అలా వరప్రసాద్‌ చిరంజీవి అయ్యాడు. పునాది రాళ్లు మొదటి సినిమా అయినా అదే ఏడాది చేసిన క్లాసిక్‌ మూవీ ప్రాణం ఖరీదు మొదట రిలీజైంది. ఆ సినిమాలో చిరంజీవి నటన చూస్తే అది మొదటి సినిమా అని ఎవ్వరూ అనుకోరు. మనవూరి పాండవులు సినిమాతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు చిరంజీవి. ఆ సినిమాకు ఆయన పారితోషకం వెయ్యనూటపదహార్లు.

ఆ తర్వాత చాలా సినిమాల్లో చిరు విలన్‌గా నటించి మెప్పించారు. మహా నటి సవిత్రీ చిరు కళ్లు చూసి నువ్వు చాలా పెద్ద నటుడివి అవుతావని ఆశీర్వదించారట. బాపు, బాలచందర్‌లాంటి గొప్ప దర్శకులు.. చిరంజీవి నటనను మెచ్చుకునేవారు. ఇతనిలో ఏదో స్పార్క్‌ ఉంది. ఆకర్షించే ఆ కళ్లు, డ్యాన్సుల్లో వైవిధ్యం, ఆకట్టుకునే ఆ రూపం ఇతనేదో సాధిస్తాడని ఆ డైరెక్టర్లు ఊహించారు. అలా 1979లో చిరంజీవి సోలో హీరోగా చేసిన తొలి సినిమా కోతల రాయుడు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అది. అప్పటికే NTR ఇంకా ఫామ్‌లోనే ఉన్నారు. కృష్ణ, శోభన్‌బాబు సినిమాలు ఊపేస్తున్నాయి. అంత టఫ్‌ కాంపిటేషన్‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేని చిరంజీవి నెంబర్‌ వన్‌ అయ్యారంటే కారణం కసి, పట్టుదల, ప్రతిభ, ఆయన కమిట్‌మెంట్‌. కోతల రాయుడు సినిమా తర్వాతే చిరు వివాహం అయింది. మహా నటులు అల్లూ రామలింగయ్యగారి కుమార్తె సురేఖతో 1980లో చిరంజీవి వివాహం జరిగింది.

వివాహం తర్వాత వచ్చిన పున్నమి నాగు సినిమా… చిరంజీవి కెరీర్‌లో అతి పెద్ద మైలు రాయి. ఆ సినిమాలో చిరు విశ్వరూపం చూపించారు. ఇక అక్కడ నుంచి ఆయన వెనక్కు తిరిగి చూసుకున్నదే లేదు. చట్టానికి కళ్లు లేవు సినిమాతో చిరు కమర్షియల్‌ హిట్‌ జర్నీ మొదలైంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా సంవత్సరం పైనే ఆడింది. ఇక శుభలేఖ లాంటి క్లాస్‌ మూవీని కూడా కమర్షియల్‌ హిట్‌ చేసిన హీరో చిరు. 1983 చిరు చరిత్రకు అసలైన పునాది. ఆ ఏడాది వచ్చిన అభిలాష సినిమా ఊపేసింది. తెలుగు తెరపై అప్పటి వరకు ఉన్న పెద్ద హీరోలందరినీ దాటుకుంటూ చిరంజీవిని ముందుకు తీసుకెళ్లిన సినిమా అది. ఎక్కడ విన్నా అభిలాష పాటలు, చిరంజీవి డ్యాన్సుల గురించే చర్చ. అదే ఏడాది తెలుగు సినిమా చరిత్రకే ఓ మైలు రాయి. చరిత్రను తిరగరాసి ఆ సినిమా పేరు ఖైదీ. హాలీవుడ్‌లో స్టాలోన్‌ నటించిన ఫస్ట్‌బ్లడ్‌ ప్రేరణతో రాసుకున్న ఖైదీ సినిమాలో హీరోగా మొదట సూపర్‌ స్టార్ కృష్ణను అనుకున్నారు. కానీ ఆయనకు కుదరలేదు. చిరంజీవిని ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఖైదీ సినిమాలో సూర్యం పాత్రలో చిరంజీవి నటనకు బాక్సాఫీస్‌లు షేక్‌ అయిపోయాయి. అప్పటి వరకు ఓ వర్గం అభిమానులను సంపాదించుకున్న చిరంజీవికి మహిళా ప్రేక్షకులు కూడా నీరాజనాలు పట్టారు. ఆ సంవత్సరమంతా ఎక్కడ చూసినా ఖైదీ సినిమా, ఖైదీ పాటలే. ఒక్కో పాటలో చిరు డ్యాన్స్‌లు ఓ ఫ్రెషనెస్‌ని చూపించాయి. రాష్ట్రమంతా అభిమాన సంఘాలు వెలిశాయి. డాన్స్‌లు ఇలా కూడా వేయొచ్చా అని అభిమానులు కూడా వెర్రెక్కిపోయేలా చేశారు చిరు. ఖైదీ సినిమాకు కనక వర్షం కురిసింది. ఖైదీ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై ఎప్పటి తరగని, ఎప్పటికీ చెరగని చరిత్రను రాశారు చిరంజీవి.

ఖైదీ సినిమా తర్వాత చిరు సిల్వర్‌ స్క్రీన్ హిస్టరీ అందరికీ తెలిసిందే. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు ఆయన దశాబ్దాల పాటు తెలుగు చిత్ర సీమ సింహాసనంపై మకుటం లేని మహారాజు. ఖైదీ తర్వాత చట్టంతో పోరాటం, దొంగ, అడవి దొంగ, విజేత ఒకటా రెండా చిరు సినిమా చేస్తే చాలు థియేటర్లో ముందు వందరోజుల పండగే. ప్రతీ రోజూ కనక వర్షమే. కుర్రాళ్లకు అన్నయ్య, అమ్మాయిలకు కన్నయ్య అయిపోయారు మెగాస్టార్‌. ముఖ్యంగా అమ్మాయిల్లో చిరంజీవి క్రేజ్‌ చాలా ఎక్కువ ఉండేది. ఆయన సినిమా ఒప్పుకుంటే ఆ నిర్మాత దశ మారిపోయినట్టే. ఇదంతా ఒకెత్తు. అప్పటి వరకు తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే పరిమితం. ఒక కమర్షియల్‌ బ్రాండ్‌ లేదు. అప్పటి వరకు ఓ సాధారణ నదిలా ప్రవహిస్తున్న తెలుసు ఇండస్ట్రీని పరవళ్ళు తొక్కించిన హీరో చిరంజీవి. చిరంజీవి వచ్చాక లెక్కలు మారాయి. తెలుగు సినిమాకు ఒక బ్రాండ్‌, ఒక కమర్షియల్‌ వాల్యూ వచ్చింది. కోటి వస్తే గొప్ప అనుకున్న రోజుల్లో ఆరోజుల్లోనే పదుల కోట్ల కలెక్షన్లు తెచ్చిన సూపర్‌ స్టార్‌ చిరు. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా శత దినోత్సవాలు జరుపుకున్న చిరు సినిమాలు చాలానే ఉన్నాయి. సౌత్‌లో కొన్ని జెనరేషన్లలో పిచ్చి ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న టాప్‌ హీరోస్‌ ఒకరు చిరంజీవి, రెండు రజనీకాంత్‌. ఆ స్థాయిలో హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఇంకే హీరోకి లేరంటే అతిశయోక్తి కాదు. కోటి రూపాయల పారితోషకం తీసుకున్న మొట్టమొదటి ఇండియన్‌ హీరో చిరు. ఆ తర్వాత అమితాబ్‌, రజనీ ఆ రెమ్యూనరేషన్‌ తీసుకున్నారు. ఆ సమయంలో దేశంలో ఉన్న మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా అంతా చిరు రెమ్యూనరేషన్‌ గురించే చర్చించుకున్నారు. అలా ఇండియా మొత్తం ఫేమస్‌ అయిన తొలి సౌత్‌ హీరో కూడా చిరంజీవే. ఆ తర్వాతే చిరంజీవి బాలివుడ్‌లోనూ అడుగుపెట్టారు.

అంత క్రేజ్‌లో కూడా చిరు సమాజానికి పనికివచ్చే కొన్ని సినిమాలను లాభం ఆశించకుండా చేశారు. తనలోని నటుడిని సంతృప్తి పరుచుకున్నారు. ఆ సినిమాలు రుద్రవీణ, స్వయం కృషి, చంటబ్బాయి. మూడు క్లాసిక్స్‌. ఇప్పటికీ ఆ సినిమాలు చూస్తే చిరంజీవిలో నటవిశ్వరూపం కనిపిస్తుంది. ఆపద్భాందవుడిలో చిరు నటన చూసి కంతతడి పెట్టనివారుంటారా? ఇండస్ట్రీ హిట్‌లు కూడా చిరంజీవితోనే మొదలయ్యాయి. పసివాడి ప్రాణం అప్పట్లోనే 10 కోట్లు వసూలు చేసింది. 1988 తర్వాత నుంచి సుప్రీం హీరోగా ఉన్న మన చిరు మెగాస్టార్‌ అయ్యారు. చిరంజీవి క్రేజ్‌ ఎవరెస్ట్‌ అంత ఎత్తుని చూసిన సంవత్సరం 1991. ఆ ఏడాది వచ్చిన గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు సినిమాలను అభిమానులు జీవితాంతం మరిచిపోరు. గ్యాంగ్ లీడర్‌ సినిమా ఒక చరిత్ర. ఎంత పెద్ద హిట్టంటే ఆ సినిమా తర్వాత చిరంజీవి క్రేజ్‌ని ఎవరూ అందుకోలేకపోయారు. చిరు చరిత్ర శిఖరమంతా ఎత్తుకి ఎదిగిన సంవత్సరమది. 1992లో వచ్చి ఘరానా మొగుడు సినిమాతో మెగాస్టార్‌ క్రేజ్‌ ఇంకెక్కడికో వెళ్లిపోయింది. చిరు అంటేనే అంచనాలను శిఖరాలకు పెంచేసింది ఆ సినిమా. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.

చిరంజీవి వల్లే తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో వాల్యూ పెరిగింది.చిరంజీవి వేసిన పునాది వల్లే ఈనాటి తెలుగు సినిమా జాతీయ స్థాయిలో దుమ్మురేపుతోంది. అందుకే ఇండస్ట్రీలో ఎవ్వరిని అడిగినా తెలుగు సినిమా కమర్షియల్‌ బ్రాండ్ నేమ్‌ చిరంజీవనే చెప్తారు. ఒక నటుడిగా, మెగాస్టార్‌గా చిరు సినిమా ప్రస్థానం ఒక తెరిచిన పుస్తకమే. అలాగే చిరంజీవిలో ఉన్న మరో కోణం సేవాగుణం. చిన్నప్పుడే NCC క్యాడెట్‌గా ఎన్నో సేవలందించారు. సేవాభావం ఉన్నవారే NCCలో రాణించగలరు. అక్కడి నుంచే చిరంజీవిలో ఆదర్శ భావాలు మొదలయ్యాయి. అవి తన ఉన్నతితో పాటూ పెరిగాయే తప్ప ఎక్కడా తగ్గలేదు. ఎదిగినా ఒదిగి ఉండే మహా వృక్షం చిరు. అందుకే సినీ ప్రస్థానంలో ఎన్నో సేవ కార్యాక్రమాలు చేశారు. తన అభిమానులను సేవ, ఆధ్యాత్మికతల వైపు నడిపించిన గొప్ప సేనాని. 2006లో చిరంజీవిని ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆ అవార్డు తర్వాత సేవా కార్యక్రమాలను మరింత విస్తరించారు చిరు. అదే ఏడాది జూన్‌లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో భాగంగా బ్లడ్‌ బ్యాంకు, ఐ బ్యాంక్‌ తెరిచారు. ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న సంజీవని చిరంజీవీ బ్లడ్‌ బ్యాంక్‌. ఆరు పదుల వయసులోనూ ఖైదీగానే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన హీరో చిరు. 70 ఏళ్ల వయసులో వాల్తేరు వీరయ్యగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చే స్టామినా చిరు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని తెలిసిన చాల మంది అంటుంటారుచిరు ఒక బంగారు నాణెం లాంటి వారు. ఆ నాణేనికి రెండూ బొమ్మలే ఉంటాయి. ఒక బొమ్మలో అద్భుత నటుడు ఉంటాడు. మరో వైపు గొప్ప వ్యక్తిత్వం ఉన్న చిరంజీవి కనిపిస్తాడు. నిజమే. ఆయన మంచితనాన్ని ఇండస్ట్రీలో ఉన్న ఈ తరం స్టార్లు కూడా గౌరవిస్తున్నారంటనే ఆయనేంటో సులువుగా అర్థం చేసుకోవచ్చు. చిరంజీవిగారే చాలా సార్లు చెప్పారు. ప్రతిభ ఉన్నవాడు చరిత్ర సృష్టిస్తాడు. ఆ చరిత్ర తరతరాలు నిలిచే ఉంటుందని. కొణెదెల శివశంకర వర ప్రసాద్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి వరకు జోరుగా సాగిన జర్నీ ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూపించింది. చరిత్ర సృష్టించింది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *