అసలు నీలో అందం ఏముంది? సన్నగా పీలగా ఎలా ఉన్నావో చూస్కో?మోడలింగ్ ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు హర్నాజ్‌కి ఎదురైన చేదు అనుభవాలివి. అదే హర్నాజ్… ఈ రోజు తన అందంతో ఈ ప్రపంచాన్ని ఫిదా చేసింది. 21 ఏళ్ల ఈ చిన్నదాన్ని మిస్ యూనివర్స్ కిరీటం వరించింది. సుస్మితా సేన్, లారాదత్తాల తర్వాత మళ్లీ 21 ఏళ్లకు ఈ ఘనత సాధించిన ఇండియన్ బ్యూటి హర్నాజ్. హర్యానాకి చెందిన 21 ఏళ్ల హర్నాజ్ సంధూ తళుకులొలికే ర్యాంప్‌పై విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ సారి టఫ్ కాంపిటేషన్ ఉంది. 80 దేశాలకు చెందిన భామలు పాల్గొన్నారు. అంత కాంపిటీషన్‌లోనూ మన భారత సౌందర్యమే గెలిచింది.

ఎవరీ హర్నాజ్?
చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఇష్టం. సినిమాల్లో నటించాలన్నది ఆమె కల. కానీ అవకాశాలు చాలా కాలం రాలేదు. చాలా చోట్ల అవమానాలు కూడా ఎదరయ్యాయి. స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి మోడలింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు హర్నాజ్. మోడల్‌గా హర్నాజ్ సక్సెస్ అయ్యారు. అదే స్పీడ్‌లో లివా మిస్ దివా యూనివర్స్‌లో గెలుపు తనలో కాన్ఫిడెన్స్ పెంచింది. ఆ కాంటెస్ట్‌లో గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజెస్ మీద తన అభిప్రాయాలతో జడ్జ్‌లను ఆకట్టుకున్నారు హర్నాజ్. 2017లో మిస్ చంఢీగఢ్‌గా కూడా నిలిచారు. పంజాబీ బ్యూటి హర్నాజ్ కొన్ని పంజాబీ సినిమాల్లో నటించారు.ఎన్నో అవమానాలు దాటుకుని మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ప్రియాంకా చోప్రా తన ఇన్స్‌పిరేషన్ అని చెప్తోంది హర్నాజ్. ఇంటర్ వరకు తన చదువు చంఢీగడ్ గవర్నమెంట్ కాలేజ్‌లోనే సాగింది.

అలాగే హర్నాజ్ తల్లి గైనకాలజిస్ట్. అమ్మే తన రోల్ మోడల్ అని ప్రతీ సందర్భంలోనూ ఆమె చెప్తుంటారు. ఆమెతో పాటు ఎన్నో హెల్త్ క్యాంప్‌లలో సోషల్ సర్వీస్ చేశారు హర్నాజ్. తల్లి నుంచి తన లైఫ్ మీద క్లారిటీ, కాన్ఫిడెన్స్ వచ్చాయని ఆమె తన ఇన్‌స్టాలో రాసుకున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. మహిళా విద్య, మహిళా హక్కులు, చదువు, మహిళల స్వేచ్ఛతో కూడా వుమెన్ అంపవర్ కోసం పనిచేయడం తన లక్ష్యమని హర్నాజ్ చెప్తున్నారు. హర్నాజ్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఎన్నో జంతువులను కూడా అనుకరించగలరు. హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, యోగా ఇవన్నీ ఆమె డైలీ రొటీన్స్. మంచి కుక్. ఎన్నో పంజాబీ వంటకాలు అద్భుతంగా వండేస్తారు. ఆమెకు పాటలు పాడడం, తన మాతృభాష పంజాబీలో చిన్న చిన్న కవితలు రాయడం, డాన్స్ హాబీస్.

ఆత్మ విశ్వాసం లేకపోవడమే ఈ తరం యూత్‌లో పెద్ద సమస్య అన్నారు. మీ జీవితానికి మీరే లీడర్. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ సమాధానానికే మిస్ యూనివర్స్ కిరీటం వరించింది.