తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది? సామాన్య భక్తులకు అక్కడ కనీసం క్షణకాలం దర్శనం లభించదు. ఇక ఆర్జిత సేవలంటే… అమ్మో… జీవితానికి ఒక్కసారైనా లభిస్తుందా? కానీ లభిస్తుంది. ఎలాగో తెలుసా. ఈ మధ్య ఏదో అద్భుతమైన ఆలోచన పుట్టినట్టు… ఎలక్ట్రానిక్ డిప్ పెట్టారు. అందులో నమోదు చేసుకుంటే లాటరీ పద్ధతిలో భక్తులను ఎంపిక చేసి… సుప్రభాతం, తోమాల.. ఇలాంటి సేవలు టికెట్లు మంజూరు చేస్తారు. లాటరీలో మీకు సుప్రభాతం లాంటి సేవలు దొరకలేదా. అయినా ఫర్వాలేదు.. ఆ విభాగంలో ఎవరో ఒక టీటీడీ ఎంప్లాయ్‌ని పట్టుకోండి. వాళ్ల చేతుల్లో 120 రూపాయలు ఉండే టికెట్టుకి 3000 చెల్లించండి. సుప్రభాత సేవ లభిస్తుంది. నిజం. ఈ మధ్యే ఈ అవినీతి బయటపడింది. మీకు తెలిసే ఉంటుంది. మనమేమో అమాయకంగా.. లక్కి డిప్‌లో పేరు నమోదు చేసుకున్నాం సుప్రభాత సేవ చూసి తరించవచ్చు ఎదురు చూస్తుంటాం. ఒక వేళ మీ పేరు లక్కి డిప్‌లో వచ్చినా మీకు ఆ విషయం తెలీదు.. అప్పటికే ఆ టికెట్‌ని మాయ చేసి వేరే వాళ్లకు బ్లాక్‌లో అమ్ముకుతింటున్న దౌర్భాగ్యులు టీటీడీలో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు బయటపడింది.. ఒక్క దౌర్భాగ్యుడే. వింటుంటునే చాలా చిరాగ్గా, కోపంగా ఉంది కదా.
తిరుమల తిరుపతి దేవస్థానం… కొంత మంది పుణ్యమా అని భ్రష్టుపట్టిపోతోంది. వీఐపీ సేవలో తరించే పాలక మండలి సభ్యులు, ఇతర ఉన్నతాధికారులకు సామాన్య భక్తులంటే విలువే లేదు. అందుకే కింది ఉద్యోగులు కూడా భక్తులను గౌరవించరు. రూముల కోసం సీఆర్‌వోకి వెళ్లి చూడండి.. భక్తులను చూసి చిరాకు పడే ముఖాలు కౌంటర్లలో కనిపిస్తాయి. భక్తులు ఎక్కువ కదా చిరాకు ఉండదా అంటారేమో. భక్తులకు సేవ చేయడానికే వాళ్లకు ఆ ఉద్యోగాలిచ్చారు. అంత చిరాకు ఉన్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేయడం? వాళ్లేదో వాళ్ల సొంత ఆస్తులు రాసిస్తున్నట్టు ఫీలవుతుంటారు. టీటీడీలో ఉద్యోగులు ఎప్పుడో దారి తప్పేశారు. లాటరీ అనే ఆలోచనే తప్పు. అక్రమాలకు అవకాశం ఉందని తెలిసినా.. ఆర్జిత సేవలు లాటరీగా పెట్టడానికి కారణం ఏంటో బోర్డుకే తెలియాలి. నాకు తెలిసిన వాళ్లు చాలా మంది లక్కి డిప్‌కి నమోదు చేసుకున్నారు. నాతో సహా ఏ ఒక్కరూ సెలెక్ట్ కాలేదు. ఒక్కరికైనా లభించాలి కదా. ఈ లెక్కన ఎన్నో లక్షల రూపాయల అవినీతి జరిగిపోయింది. రూముల కేటాయింపు నుంచి, దర్శనాల వరకు.. ఆఖరికి వీఐపీ ఎంట్రీ టికెట్లు అన్నీ బ్లాకులో దొరుకుతాయి. ఛానెల్ తెలియాలంతే. ఇది ఇప్పటి దందా కాదు.. చాప కింద నీరులా దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవహారం. రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ చదివే ప్రతీ ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ఈ విషయం సామాన్యుడికే తెలిసినప్పుడు.. సకల భోగాలు అనుభవిస్తున్న పాలక మండలికి తెలీదా?తెలీదంటే నమ్ముదామా? తెలిసి మరి ఏం చేస్తున్నారు? అంటే అక్కడా అనుమానించాల్సిందే. మహా సంప్రోక్షణను ఏదో ప్రళయంలా చూపించి.. తిరుమల గేట్లు మూసేస్తాం.. ఎవరూ రాకూడదని చెయ్యాల్సినదానికన్నా చాలా ఎక్కువే చేశారు. తీరా చూస్తే.. భక్తుల దర్శనాల వల్ల మహా సంప్రోక్షణకు ఏ మాత్రం ఆటంకం కలగలేదు. మహా సంప్రోక్షణ సమయంలో ఓ మిత్రుడు తిరుమల వెళ్లాడు. ‘మరో 30 వేల మంది భక్తులు ప్రతి రోజూ హాజరైనా ఏ ఆటంకం లేదు… వీళ్లెందుకు హడావిడి చేశారో అర్థం కాలేదు’ అని చెప్పాడు. ప్రతీ పన్నెండేళ్లకు సహజంగా జరిగే మహా సంప్రోక్షణ ప్రక్రియను ఓ కాంప్లికేటెడ్ ఇష్యూలా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అవగాహనా రాహిత్యమా? ఇంకేమైనా రహస్య కారణాలున్నాయా?
ఇలాంటివన్నీ చూస్తుంటే పైవాళ్లే అలా ఉన్నప్పుడు… కింది ఉద్యోగులకు పండగే కదా. దందా బాగా చేసుకోవచ్చు. ఆర్జిత సేవల టిక్కెట్లు బ్లాకులో అమ్ముకోవచ్చు. సామాన్యుడు మాత్రం శ్రీవారి దర్శనం కోసం వస్తే… అలా చూస్తామో లేదో… ఒక్కో సారి ఖాళీగా ఉన్నా కూడా నెట్టేస్తారు. సిబ్బంది ఓవరేక్షన్‌కి కోపం వస్తున్నా.. అంతంత దూరం నుంచి వచ్చాం.. మనసు లగ్నం చేసి ఆ స్వామి వారిని ఒక్క క్షణం చూసి తరిస్తాం. ఖచ్చితంగా.. భక్తుల పట్ల ఎలా ప్రవర్తించాలో టీటీడీ సిబ్బందికి మానసిక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం. ఆ క్షేత్రం పరువు తియ్యొద్దని పాలకమండలి సభ్యులకు, టీటీడీ సిబ్బందికి మనవి. అలాగే వీఐపీల సేవలో తరించడమే కాదు… భక్తులకు కూడా కాస్త ఆర్జిత సేవల దర్శన భాగ్యం కల్పించండి. వీఐపీలు మాత్రమే భక్తులు కాదు. అయినా దేవుడి ముందు వీఐపీలేంటో. మరీ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఇలా హైక్యాడెర్ వరకు ఓకే. భద్రతా పరమైన కారణాలుంటాయి కాబట్టి. మిగిలిన వారు దేవుడు ముందు కేవలం భక్తులు మాత్రమే. లేదా దేవుడి కన్నా తాము చాలా ఎక్కువ, తాము రావడం ఆ దేవుడి అదృష్టం అనుకునేవాళ్లు కావొచ్చు. వీఐపీల సంఖ్య ఎక్కువ కావడం వల్లే.. తిరుమలేశుడి ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు సామాన్యులకు దక్కడం లేదు. ఇదే అదనుగా ఆర్జిత సేవలే ఆర్జనా మార్గంగా పుట్టుకొస్తున్న దళారులు.. అక్రమాలకు పాల్పడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ బురదని క్లీన్ చేయడం ఆ ఏడు కొండల వాడికి మాత్రమే సాధ్యం. స్వామీ… కాస్త నీ ఇంటిని శుభ్రం చేసుకో. లేదా ఆ బురద నీక్కూడా అంటుకుంటుంది.