June 7, 2023

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కొన్ని లక్షల మంది చనిపోయారు. పాండవులకు… బ్రహ్మ హత్యా పాతకం, శత్రు హత్యా పాతకాల భయం పట్టుకుంది. అప్పుడు పాండవులు కాశీకి వెళ్లారు. దర్శనం ఇవ్వడం లేని శివుడు నంది రూపం ధరించి ఉత్తర దిశగా నడవడం మొదలు పెట్టాడట. పాండవులు కూడా ఆ నందివెనుకే పరిగెత్తారట. అలా గుప్త కాశీ దగ్గరలో భీముడు ఆ నందిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు నంది రూపంలో ఉన్న శివుడు మాయమయ్యాడు. ఆ నంది శరీర భాగాలు ఐదు చోట్ల లింగాలుగా ప్రతిష్టితమయ్యాయట.
అవే పంచకేదారాలు అయ్యాయని శివ పురాణంలో పెద్ద కథే ఉంది. శివ పురాణంలో వర్ణించిన ఆ ఐదు క్షేత్రాలను పంచకేదారాలు అన్నారు. అవి కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. కేదార్ నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రఖ్యాతి చెందిన క్షేత్రం. పంచకేదారాల్లో మొదటిది. పాండవులకు అందకుండా పోయిన నంది మూపుర భాగం ఉన్న చోటు కేదారనాథ్. అందుకే ఇక్కడి శివలింగం…8 గజాల పొడవు, 4 గజాల ఎత్తు, 4 గజాల వెడల్పుతో త్రిభుజాకారంలో ఉంటుంది. ఇలాంటి శివలింగం ఇంకెక్కడా లేదు. పంచకేదారాల్లో రెండవది తుంగనాథ్. ఇక్కడ శివుని చేతులు లింగరూపంలో వెలిశాయి. శిఖరాలకు అధిపతి తుంగనాథుడు. ఇక్కడి శివలింగం చేతుల ఆకారంలో ఉంటుంది. మూడవది రుద్రనాథ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ రూపం ఉన్న చోటు. ముఖలింగ రూపంలో అద్భుతంగా కొలువైన క్షేత్రమిది. ఈ స్వామినే నీలకంఠ మహదేవ్ అని స్థానికులు పిలుస్తారు. పంచకేదారాల్లో నాలుగవది మధ్య మహేశ్వర్. శివుని నాభి భాగం శివలింగంగా వెలసిన చోటు. భీముడు నందిని పట్టుకున్న గుప్తకాశీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచకేదారాల్లో చివరిది కల్పనాథ్. హృషికేష్ నుంచి బద్రీనాథ్ రోడ్డు దారిలో 12 కిలోమీటర్ల దూరంలో ఉందీ క్షేత్రం. శివుని జటాజూటమే ఇక్కడ శివలింగంగా ఏర్పడిందని స్థల పురాణం. ఇవి పంచకేదారాలు. ఇవన్నీ కేదారనాథ్ పరిసరాల్లోనే ఉన్నాయి.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *