పవన్ 40 సీట్లు కొట్టేస్తారా?
పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. రెండు చోట్ల నుంచి ఎందుకు? ఎందుకంటే రాజకీయాల్లో కుట్రలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజారాజ్యం టైంలో పవన్ దగ్గరుండి చూశారు కాబట్టి. మొదటి సారి పోటీ చేస్తున్నప్పుడు రెండు చోట్ల పోటీ చేస్తే తప్పేముంది. ఆనాడు పాలకొల్లు, తిరుపతిలో చిరంజీవి పోటీ చేసినప్పుడు… ఆయన్ని ఓడించడానికి సిగ్గుమాలిన రాజకీయాలెన్నో జరిగాయి. పాలకొల్లులో కాంగ్రెస్, టీడీపీ కలిసి మరి చిరంజీవి ఓడిపోయేలా చేశారు. తిరుపతిలో మాత్రం ఈ ముఠా రాజకీయాలు సాధ్యం కాలేదు. జనసేన… పవర్ఫుల్ పార్టీగా మారింది.ఇప్పుడు పవన్‌పై అలాంటి కుట్రలే జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గాజువాక గురించి చెప్పుకోవాలి. గాజువాకలో ఇప్పటికే జనసేనకు లక్ష సభ్యత్వాలు ఉన్నాయి. గాజువాకలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. 2104 ఎన్నికల్లోనూ వీరే బరిలో ఉన్నారు. అప్పట్లో పల్లా 21 వేల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు వీరిద్దరి కన్నా పవన్ వైపే గాజువాకలో ఆసక్తి ఉంది. అక్కడి కాపులు పవన్ వైపు ఉన్నారు. దాదాపు 60 వేల మందికి పైగా కాపులు, దాదాపు అంతే సంఖ్యలో ఉన్న యాదవులు పవన్ వైపు ఉన్నారని సమాచారం. విశాఖలో కమ్యునిస్ట్ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. అవి ఎలాగూ పవన్‌కే పడతాయి. 2009లో ప్రజారాజ్యం అప్పటికి ఊరు పేరు తెలియని అభ్యర్థిని గాజువాకలో నిలబెడితే మంచి మెజారిటీతో గెలిచాడు. మరి పవన్ నిలబడితే గెలవకుండా ఉంటారా? అంటే గాజువాకలో పవన్ గెలుపు గ్యారెంటీ. ఇక సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ గెలుపు ఇప్పటికే ఫిక్స్ అంటున్నారు. అక్కడ కాపులు, రాజుల ఓటు బ్యాంకే కీలకం. ఇక్కడ కూడా 2009లో పీఆర్‌పీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి పవన్ భీమవరంలో నిలబడితే దగ్గరుండి గెలిపించుకుంటామని కాపులు, రాజులు కూడా ఒక మాట అనుకున్నారట. అక్కడ పవన్‌కి పోటీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజిబాబు, వైసీపీ గ్రంధి శ్రీనివాస్. ఇద్దరిదీ అంత గొప్ప ట్రాక్ రికార్డేం కాదు. అంటే రెండు చోట్లా జనసేన జెండా ఎగరడం గ్యారెంటీ. పవన్ ఐదు జిల్లాలపై గట్టి లుక్కేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, గోదావరి జిల్లాలు. ఇప్పటికైతే విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో… పవన్ భారీగా సీట్లు కొల్లగొట్టే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ అభ్యర్థిగా జేడీని అనుకున్న తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అర్బన్ ఓటింగ్ మొత్తం పవన్ వైపు తిరిగింది. మొదట్లో 10-15 సీట్లు అనుకుంటే..ఇప్పుడున్న హవా చూస్తే 40 సీట్లకు పైగానే వస్తాయేమో అన్న అంచనాలు పెరిగాయి. అదే జరిగితే… నో డౌట్… పవన్ కింగ్ మేకరే. ఏమో కింగూ కావొచ్చు.