September 21, 2023

సోషల్‌ మీడియా… మనుషులనే కాదు, వరల్డ్‌ పాలిటిక్స్‌ని కూడా శాసిస్తోంది. రిజల్ట్‌ డిక్లేర్ చేస్తోంది. ఫిలిప్పిన్స్‌ పాలిటిక్స్‌ చూస్తుంటే ఫ్యూచర్‌ పాలిటిక్స్‌ రూటు మారిపోయినట్టే కనిపిస్తోంది. జనం మైండ్ సెట్‌ని సోషల్‌ మీడియా ఏ రేంజ్‌లో డైవర్ట్‌ చేస్తోందో చెప్పడానికి ఫిలిప్పిన్స్‌ ఎలక్షన్స్‌ ఒక బిగ్‌ ఎగ్జాంపుల్‌. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. ఫెర్డినాండ్‌ మార్కోస్‌… 1965 నుంచి 1986 వరకు ఫిలిప్పిన్స్‌ని పాలించిన డిక్టేటర్‌. ఆయనగారి భార్య పేరు ఇమెల్డా మార్కోస్‌. భర్తకు తగ్గ భార్య. ఇద్దరూ ఫిలిప్పిన్స్‌లో చేసిన అరాచకాలు, ఘోరాలు అన్నీ ఇన్ని కావు. పదవిని దుర్వినియోగం చేసి అక్రమాలు చేసిన వారిలో వీరిని మించిన వారు లేనే లేరు. ముఖ్యంగా ఫిలిప్పిన్స్‌లో వారి పాలనా కాలంలో అధ్యక్షుడి భార్య ఇమెల్డా పెత్తనమే ఎక్కువ. విలాసాలకు, విదేశీ పర్యటనకు, తన ఎంజాయ్‌మెంట్‌కి ప్రజాధనాన్ని టన్నుటన్నులు వాడేసింది. మార్కోస్‌, అతని భార్య వారి స్వలాభం కోసం దేశ ఆర్థికాన్ని హారతి కర్పూరంలా కరిగించారు. అడ్డొచ్చిన వారందరూ హత్యలకు గురయ్యారు. మార్షల్‌ లా అమలు చేసి దేశ ప్రజలపై అరాచకాలు చేశారు. ఆ కాలంలో కొన్ని వేల హత్యలు జరిగాయి. ఎదురు తిరిగిన ఎంతో మంది జైళ్లలో మగ్గారు. జైళ్లలోనూ వారందరికీ ప్రత్యక్ష నరకం చూపించేవారు. అంతటి క్రూర దంపతులు మార్కోస్‌, ఇమెల్డా మార్కోస్‌.

మార్కోస్‌, ఇమెల్డా మార్కోస్‌

1965 నుంచి 86 వరకు ఈ ప్రత్యక్ష నరకం ఫిలిప్పిన్స్‌లో కొనసాగింది. ప్రజలు మాత్రం ఎంతకని సహిస్తారు…? ఎదురు తిరిగారు. ప్రజా యుద్ధం మొదలైంది. అది రోజుల్లోనే తీవ్రంగా మారింది. ప్రజా విప్లవానికి మార్కోస్‌ దంపతులుభయపడ్డారు. ప్రజలకు కనపడితే చావే. అందుకే అర్థరాత్రి దేశం విడిచి పారిపోయారు. పారిపోతూ, పారిపోతూ… ఎంతో సంపదను దొంగతనంగా దోచుకుపోయారు. ఎన్నో పెట్టెల్లో ఆభరణాలు, బంగారు ఇటుకలు, డైమండ్స్‌తో పాటు సుమారు 700 మిలియన్ డాలర్లు దోచారు. హవాయిలో విలాస జీవితం గడిపారు. అయినా వీరిద్దరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి.

వీళ్లు పారిపోయాక ఇమెల్డా అంతఃపురాన్ని చూస్తే అక్కడ కళ్ళు తిరిగేలా వందల సంఖ్యలో చెప్పుల జతలు, ఖరీదైన గౌన్లు, ఇంకా ఎన్నో విలాస వస్తువులు కనిపించాయట. అప్పట్లో అదో సన్సేషన్‌. అప్పటి నుంచి మార్కోస్‌ అనే పేరు వింటేనే ఫిలిప్పిన్స్‌ ప్రజలకు మంట. అలా పారిపోయిన మార్కోస్‌ 1989లో మరణించాడు. చుట్టూ మోసేందుకు నలుగురు మనుషులు కూడా లేని స్థితిలో చేసిన పాపాలకు తగిన చావే చూశాడు. ఆయన మరణించినప్పుడు పక్కన అతని కొడుకు బాంగ్‌ బాంగ్‌ మార్కోస్‌ మాత్రమే ఉన్నాడట.

భర్త మరణించాక 1991లో ఇమెల్డా కొడుకుతో మళ్లీ ఫిలిప్పిన్స్‌ వచ్చింది. మళ్లీ ఆమెను చూసిన ఫిలిప్పిన్స్‌ ప్రజలు ఛీత్కరించుకున్నారు. అప్పటికే ఆమె మీద ఎన్నో దేశాల్లో కేసులున్నాయి. ఇంత ఛీత్కరించుకున్నా మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసింది. ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. ఈ లోపు కొడుకుబాంగ్‌ బాంగ్‌ మార్కోస్‌ మాత్రం పాలిటిక్స్‌లో ఎదిగాడు. అంతకు ముందు ఫిలిప్పిన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న డ్యుటెర్డే రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అతను కూడా తక్కువ వాడేం కాదు. తనకు అడ్డొచ్చిన వారి మీద తప్పుడు కేసులు పెట్టి చంపించాడనే ఆరోపణలు బోలెడు. డ్రగ్‌ కంట్రోల్‌ పేరిట ఎంతో మంది ప్రాణాలు తీశాడన్న కంప్లైంట్లూ ఉన్నాయి. ఈ లోపు ఎలక్షన్లు వచ్చాయి. 64 ఏళ్ల బాంగ్‌ బాంగ్‌ మార్కోస్‌ అధ్యక్షుడిగా నిల్చున్నాడు. స్ట్రాటజికల్‌గా అంతకు ముందు వరకు పాలించిన డ్యూటెర్డే కూతురుని ఉపాధ్యక్ష పదవికి పోటీకి దింపాడు. ఇద్దరి ఫ్యామిలీలవి రక్త చరిత్రలే. ప్రజల ఛీత్కారాలు చూసినవే. అయినా బాంగ్‌ బాంగ్‌ సోషల్‌ మీడియాతో ఒక క్యాంపైన్‌ స్టార్ట్‌ చేశాడు. ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్‌లకు కోట్లు కుమ్మరించాడు. ప్రజల మైండ్‌ సెట్‌ని పూర్తిగా మార్చేయాలన్నటే ఆ కాంపైన్‌ ప్లాన్‌. అన్ని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ని వాడేశారు. మొబైల్‌ ఓపెన్‌ చేస్తే బాంగ్ బాంగ్‌ తప్ప మరో న్యూస్‌ లేదు. ఎన్నో స్టోరీస్‌ క్రియేట్‌ చేశారు. ఆ స్టోరీస్‌ని లక్షల మందికి చేరేలా, ఓటర్స్‌ బ్రెయిన్ వాష్‌ చేసేలా క్రియేట్‌ చేశారు. ఒకప్పుడు తన తండ్రి, తల్లి చేసిన క్రూరమైన పాలనను మరిపించే స్టోరీస్ క్రియేట్‌ చేశారు. పబ్లిక్ మైండ్‌ని సోషల్‌ హిప్నటైజ్‌ చేశారు. ఫిలిప్పిన్స్‌ ప్రజలు సోషల్‌ మీడియాని విపరీతంగా వాడతారు. చివరికి ఆనాటి నియంత పాలనను కూడా గోల్డెన్‌ ఏజ్‌గా ఈ తరం అనుకునేలా స్టోరీస్‌ క్రియేట్‌ చేశారు.

ప్రజలు కూడా నమ్మారు. ఫలితం… ఆనాడు క్రూర నియంత అన్న కారణంతో ప్రజలు తరిమేసిన మార్కోస్‌ కుమారుడు బాంగ్‌ బాంగ్‌ మార్కోస్‌.. ఈ తరం వారి సహకారంతో ఫిలిప్పిన్స్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. 10 కోట్ల జనాభా ఉన్న ఫిలిప్పిన్స్‌లో 3 కోట్లకు పైనే బాంగ్ బాంగ్‌కి ఓటేశారు. నా పూర్వీకులను బట్టి కాదు, నా చేతలను చూసి ఓటెయ్యండి అన్న నినాదంతో కాంపైన్‌ చేశాడు బాంగ్‌ బాంగ్‌. ఒకప్పుడు ప్రజలు ఛీత్కరించుకున్నఅతని తల్లీ గెలిచినట్టే.

సోషల్‌ మీడియా వల్ల ఫిలిప్పిన్స్‌ తలరాత, చరిత్ర రెండూ మారిపోయాయి. మన ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ స్ట్రాటజీ పేరిట చేసేది ఇలాంటి సోషల్‌ క్యాంపైనింగే. అల్లిబిల్లి కథలల్లీ మైండ్‌లోకి ఎక్కించడం, ఈవీఎం దగ్గర ఓటర్ మైండ్‌ సెట్‌ మార్చడం… ఇదే సోషల్‌ క్యాంపైనింగ్‌లో మెయిన్‌ థియరీ. ఫిలిప్పిన్స్‌ సంగతే చూస్తే ఒకప్పుడు జనం తన్ని తరిమేస్తే దొరికినంత దోచుకుని పారిపోయిన నియంత కుటుంబమే మళ్లీ ఇప్పుడు ఆ సింహాసనం అధిష్టించింది.ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్‌ డిసైడ్‌ చేసింది.. ఓటరా? సోషల్‌ మీడియానా? భవిష్య రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం ఇంతకన్నా ఎక్కువే ఉండబోతోంది. బట్‌… దేశం తలరాతను మార్చే ఎలక్షన్స్‌లో హ్యూమన్‌ మైండ్‌తో ఓటేయాలి. స్ట్రాటజిస్ట్‌లు చేసే సోషల్‌ హిప్నాటిజంతో కాదు. ఫిలిప్పిన్స్ చెప్తున్న సత్యం ఇదే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *