మెడలో ఎర్ర కండువా, సిద్ధాంతాల గుర్తుగా పిడికిలి… విప్లవాత్మక ఆలోచనలను గుర్తు చేసే సింబల్స్ ఇవి. ఇప్పుడివి పవన్ కళ్యాణ్ జనసేనకు గుండె చప్పుళ్లు. కార్మికులు తమ హక్కులు సాధించుకునేందుకు, నియంతల కొమ్ములు పీకేందుకు, అన్యాయం జరిగినప్పుడు తమ గళాన్ని ధైర్యంగా వినిపించేందుకు… అందించిన శక్తి పిడికిలి. ఇది చరిత్ర. రాజ్యాలు ఉన్నప్పుడు ఆయుధాలతో యుద్ధాలు జరిగాయి. రాజ్యాలు పోయాక ప్రజాస్వామ్య పోరాటాలు ఒక్క పిడికిలితో దద్దరిల్లాయి. అందుకే సిద్ధాంతాలకు శక్తినిచ్చే పిడికిలిని తమ సైద్ధాంతిక గుర్తుగా జనసేన ప్రకటించింది. పిడికిలి గుర్తు ఓ మద్దతు, ఓ ధైర్యం, ఓ బలం. కమ్యూనిజంలో పిడికిలి గుర్తుకున్న ప్రాధాన్యత చరిత్ర ఋజువు చేసిన సత్యం. పవన్ కమ్యునిష్ట్ కాదు.. అయినా కమ్యునిష్ట్‌లతో చేయి కలిపాడు. పవన్ ఆర్‌ఎస్‌ఎస్ కాదు.. అయినా ఎన్నికల్లో బీజేపీ వైపు ఉన్నాడు. పవన్ ఏ పార్టీ కాదు… అందుకే టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు అంశాలు… మార్పు కోసం ఆయన చేసే ఆలోచనా విధానాన్ని చెప్తున్నాయి.
జనసేన పార్టీ రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. దేశంలో ఏ పార్టీ మొదలుపెట్టినా వాటి లక్ష్యం ఎన్నికలు, అధికారం మాత్రమే. కానీ, జనసేన పార్టీ పెట్టాక… సమర్ధ పాలకులకు మద్దతిచ్చే పార్టీగా రంగంలోకి దిగింది. ఆ మాట నిలబెట్టుకుంది. ఇది ట్రెండ్ సెట్టింగ్. ప్రజారాజ్యం ప్రభంజనమే చెయ్యనిది ఈ జనసేన ఏం చేస్తుందిలే అన్నారు. సేనాని సమర్ధుడైతే యుద్ధంలో గెలవడం కష్టమేం కాదు. అలెగ్జాండర్ కేవలం 3 వేల సైన్యంతో విశ్వ విజేతగా నిలిచాడు. కారణం.. వ్యూహ ప్రతివ్యూహాలే. జనసేన మొదలైంది ఒక్క అడుగుతోనే.. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లినా వేల అడుగులు కలుస్తున్నాయి.
వివేకానందుడి సూక్తి ఒకటుంది. ఏదైనా గొప్ప పని ప్రారంభించినప్పుడు మొదట అవహేళనలు ఎదురవుతాయి, ఆ తర్వాత ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రెండిటిని సమర్ధంగా ఎదుర్కొంటే… గెలుపు మీ ముంగిట్లో ఉంటుంది. ఈ సూక్తి జనసేనకు అచ్చంగా సరిపోతోంది. జనసేన పెట్టిప్పుడు పవన్‌కి ఎదురైనవన్నీ అవహేళనలే… ఆ తర్వాత ఆయనపై విమర్శల దాడులు, వ్యక్తిగత జీవితంపై సూటిపోటి మాటలు.. ఇవన్నీ ఆటంకాల దశ. మొండివాడిని రాజు కూడా ఓడించలేడని.. ఇవేవీ పవన్ పట్టించుకోలేదు. తనదైన శైలిలో జిల్లాల్లో పర్యటించడం స్టార్ట్ చేశాడు. పాలక పక్షాలు చేసిన తప్పులను ప్రజలకు చెప్తున్నాడు. జనసేన ఎందుకు రాజకీయంగా పోటీ చేయాలని అనుకుంటోందో.. జనాలకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాడు. ప్రశ్నించే పార్టీ తమది అన్నాడు. ప్రశ్నకు సమాధానాలు దొరకనప్పుడు… దొరికే చోటికి వెళ్లాలని జనాలను.. ముఖ్యంగా యువతను తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు.
మొదట్లో పవన్ ప్రసంగాల్లో బెరుకు కనిపించేది. చాలా రోజులు ట్విట్టర్‌కే పరిమితమైన మాట కూడా వాస్తవం. ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నారో.. పవన్ శైలి మారిపోయింది. ఎన్నో విప్లవాలకు సంకేతం, ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఎర్ర రంగు కండువాతో కొత్త విప్లవాన్ని తెచ్చే నాయకుడిలా ముందుకు సాగిపోతున్నాడు. చంద్రబాబు, జగన్‌లు… ఆత్మ స్తుతి– పర నింద ఫార్ములా నుంచి బయటకు రావడం లేదు. పవన్ ప్రసంగాల్లో కూడా ఆత్మస్తుతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్తుతుల సుత్తి వదిలేసి.. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం చెస్తున్న తప్పులను సూటిగా విమర్శిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నాడు. రోజు రోజుకూ జోరు పెంచుతూ.. వచ్చే ఎలక్షన్స్‌కి రె‘ఢీ‘ అన్నాడు. ఆ జోరులోనే తమ మేనిఫేస్టో ఎలా ఉండబోతోందో 7 సిద్ధాంతాలు, 12 హామీలతో విజన్ డాక్యుమెంట్ కూడా ప్రకటించేశాడు.
సినిమాల్లో పవర్ స్టార్‌గా ఆయన ట్రెండ్ సెట్ చేశారు. విజన్ డాక్యుమెంట్‌లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. కులాలను కలిపే ఆలోచన, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి ప్రస్థానం.. ఇవన్నీ ఆదర్శాలతో కూడిన 7 సిద్ధాంతాలు. ఇన్నాళ్లూ ఎన్నికల్లో పార్టీలు మేనిఫేస్టోలు ప్రకటించడమే కానీ వాటి అమలు విస్మరించడం మనకు తెలుసు. ఆ కోవలోకే జనసేన వెళ్తే… ప్రయోజనం లేదు. అన్ని పార్టీల్లాగే మిగిలిపోతుంది. జనసేన ఇప్పుడున్న విల్ పవర్‌తో ఈ సిద్ధాంతాలు అమలు చేస్తే… ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పడతారు. హామీలు కూడా సమాన్యులకు వరాలే. అన్నీ కలిసొచ్చి… పవన్ కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా… తన భావజాలం ఇలాగే ఉంటే… ప్రజాకర్ష నేతగా నిలుస్తాడు. ఏది ఏమైనా.. అంచనాలే లేని స్థాయి నుంచి సంచలనాల వరకు జనసేన ప్రయాణాన్ని విస్మరించలేం. లోపాలు కూడా ఉన్నాయి. అభిమానులే ఆయనకు బలం, బలహీనత అన్న విమర్శలున్నాయి. నిజమే. వ్యక్తి ఆరాధన.. సామాజిక బాధ్యతగా మారితే.. ఆ అభిమానానికి అర్థం ఉంటుంది. ఆ దిశగా పవన్ మోటివేట్ చెయ్యగలిగితే… నో డౌట్… జనసేన అద్భుతాలు సాధిస్తుంది. అందుకేనేమో మొదట్లో టీడీపీకి, వైసీపీకి లేని కలవారపాటు ఇప్పుడిప్పుడే మొదలైంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు భారీగా వస్తున్నారు. జనసేన ఓ మామూలు పార్టీగా మొదలై ప్రస్తుతం ప్రభంజనం దిశగా పరిగెడుతోంది. చంద్రబాబు, జగన్‌లు… పవన్‌ను తేలిగ్గా తీసుకుంటే… వారు చారిత్రక తప్పిదం చేసినట్టే.