నెట్‌ఫ్లిక్స్‌లో మార్చ్ 5న ఏలే (తమిళ సినిమా) రిలీజైంది. తండ్రి చనిపోయాడని కొడుకు పార్థీకి కబురు వస్తుంది. చెన్నై నుంచి కొడుకు వస్తాడు. తండ్రి చనిపోయాడన్న ఫీలింగ్ ఏ మాత్రం అతనిలో ఉండదు. పైగా ఆకలేస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అని అక్కను అడుగుతాడు. తలకొరివి పెట్టే టైమ్‌లో తిండేంట్రా అని అక్క తిడితే పక్క ఊళ్లో హోటల్‌కి వెళ్లి పరోటా తిని వస్తాడు. నిజానికి ఇక్కడి వరకు సినిమా చూస్తే ఆ కొడుకే విలన్‌లా కనిపిస్తాడు. కానీ… అక్కడి నుంచి తండ్రి శవాన్ని చూస్తూ పార్థీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తాడు. ఇలాంటి గొప్ప కథలు అప్పుడప్పుడే వస్తాయి. ఐస్ అమ్ముకునే ఓ పేద తండ్రి. ఇద్దరు పిల్లలను పెంచేందుకు అతను చేసే చిన్న చిన్న మోసాలు. అప్పుల వాళ్లు వస్తే అప్పటికప్పుడు ఏ గుండెనొప్పో వచ్చినట్టు ఆస్కార్ రేంజ్‌లో నటించే తెలివి. ఇలాంటివి నచ్చని కొడుకు పార్థీ. ఓ వయసు వచ్చాక తండ్రితో మాట్లాడటమే మానేస్తాడు. నిజానికి ఏలే సినిమా చూస్తే మన చుట్టూ ఉన్న క్యారెక్టెర్లే కనిపిస్తాయి. పిల్లలను పెంచడం తండ్రి బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చేందుకు ఏం చేసినా తప్పులేదనుకుంటాడు తండ్రి ముత్తుకుట్టి. నీ తండ్రి మోసగాడు అని స్కూల్లో పిల్లలు ఎగతాళి చేస్తుంటే… తండ్రిని అన్నారన్న కోపం, తండ్రి తాగుబోతు-మోసగాడు అన్న బాధ ఇవన్నీ కలిపి పార్థీకి తండ్రికి మధ్య గ్యాప్ పెంచేస్తాయి. మధ్యలో పార్థీ లవ్ స్టోరీ. లవ్ ఫెయిల్యూర్. ఇంకా కథ ఎమోషననల్‌గా వెళ్లిపోతుంది అనుకునే టైమ్‌కి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. అదిరిపోయే స్క్రీన్ ప్లే. ట్విస్ట్ చెప్తే అస్సలు కిక్కు ఉండదు. కానీ… 100 పర్సంట్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. తండ్రి బాధ్యతలను, కొడుకు ఆలోచనలను అద్భుతంగా చూపిస్తూ సాగే ఈ కామెడీ థ్రిల్లర్ మస్ట్ వాచ్.
తండ్రి క్యారెక్టర్‌లో సముద్ర ఖని విశ్వరూపం చూపించాడు. నేషనల్ అవార్డు స్థాయి యాక్షన్‌ని ఆసువుగా చేసుకుంటూ పోయాడు. కొడుకు క్యారెక్టర్‌లో తమిళనాడులో పేరున్న రచయిత మణికందన్ గుర్తుండిపోయే నటన చేశాడు. కథ మొత్తం వీరిద్దరి మధ్యే తిరుగుతుంది. ఒక రెండు క్యారెక్టర్ల మధ్య జరిగే కథని రెండు గంటల పాటు కూర్చోబెట్టేలా చూపించాలంటే గట్స్ ఉండాలి.ఆ విషయంలో ఈ సినిమా కథని రాసి, డైరెక్ట్ చేసిన హలితా షమీమ్ పూర్తిగా సక్సెక్ అయ్యారు. సిల్లూ కరుపట్టి.. అదే ఆహాలో నారింజ మిఠాయిగా వచ్చిన ఆంథాలజీలో ఓ కథను హలితా షమీమ్ డైరెక్ట్ చేశారు. ఆ కథకు గాను ఆమెకు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు కూడా వచ్చింది. పళనిలో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీసిన ఈ మూవీ చూసినంత సేపూ హాయిగా ఉంటుంది. ముఖ్యంగా సముద్ర ఖని నటనకు ఫిదా కాని వారు ఉండరు. ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ స్టార్ విజయ్ టీవీలో ఫిబ్రవరి 28న నేరుగా రిలీజ్ చేశారు.అలా ఒక ఛానెల్‌లో నేరుగా రిలీజ్ అయిన సినిమా ఇదే. మార్చ్ 5 న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.