రోహిత్– కోహ్లీ మధ్య ఏం జరుగుతోంది? ఆస్ట్రేలియా టూర్‌కి రోహిత్ దూరం కావడం వెనుక ఫిటనెస్సే కారణమా? క్రికెట్ పోలటిక్స్ కారణమా? వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి నుంచి… వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. పెరుగుతూనే ఉంది. ఒకరు కెప్టెన్, మరొకరు వైస్ కెప్టెన్. ఇద్దరి మధ్య విభేదాలున్నాయన్న న్యూస్… క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఈ మొత్తం వివాదంలో అసలేం జరిగింది?
వరల్డ్ కప్ ముందు నుంచే కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయని అందరూ అంటున్నా రివీల్ కాలేదు. క్రికెట్‌లో ఇవన్నీ కామన్ అనుకున్నారు. వరల్డ్ కప్‌లో కోహ్లీ అండ్ రవిశాస్త్రి ఒన్‌సైడ్ నిర్ణయాలతో అసలు వార్ మొదలైందని ఆ మధ్య ప్రచారం జరిగింది. టీమ్‌లో మిగిలిన సభ్యుల నిర్ణయాలకు అసలు విలువే లేదని… రోహిత్ ఫైర్ అయినట్టు న్యూస్ బయటకు వచ్చింది. వరల్డ్ కప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో… ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టి… కోహ్లీ అండ్ శాస్త్రి… వాళ్లకు నచ్చిన వాళ్లను సెలెక్ట్ చేశారని టాక్. అప్పుడు రోహిత్ వారించినా వినలేదని సమాచారం. అప్పటి నుంచే రోహిత్ కోహ్లీల మధ్య కోల్డ్ వార్ మొదలైందని చెప్పాలి. వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోరంగా ఫెయిలైంది. దీనికి కారణం కూడా కోహ్లీ-రోహిత్ మధ్య సరైన సమన్వయం లేకపోవడమే అని అర్థమవుతోంది. ఆ విబేధాలు ఇప్పుడింకా ముదిరినట్టే కనిపిస్తున్నాయి. ఏకంగా హిట్‌మ్యాన్‌ని పక్కన పెట్టేంతగా ఆ విభేదాలు ముదిరాయా? ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ లేకుండా ఆస్ట్రేలియా వెళ్లడం రిస్క్ చేయడమే?
ఆస్ట్రేలియా టూర్‌కి రోహిత్‌ని ఎంపిక చేయలేదు. హిట్‌మ్యాన్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేనందువల్లే ఎంపిక చేయలేదని సెలెక్టర్ల మాట. కానీ జట్టుని ఎంపిక చేసిన మర్నాడే రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చాడు. ఆయన పూర్తి ఫిట్‌తో ఉన్నట్టే కనిపించిన వీడియోలు ట్విట్టర్లో కనిపించాయి. ఆ వీడియోలతో డౌట్స్ స్టార్టయ్యాయి. టోర్నీకి ఇంకా దాదాపు నెల సమయం ఉంది. ఇప్పటి నుంచి ఫిట్‌నెస్ ఎలా డిసైడ్ చేస్తారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదే ప్రశ్న గవాస్కర్ కూడా రైజ్ చేశాక అప్పుడు అసలు డిస్కషన్ మొదలైంది. రోహిత్ లాగే, మయాంక్ కూడా గాయపడ్డాడు. కానీ అతన్ని సెలక్ట్ చేశారు. అదే టైమ్‌లో మాంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ని పక్కనపెట్టారు. కోహ్లీకి, సూర్యకుమార్‌కి మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లో జరిగిన స్లెడ్జింగ్ వివాదం వైరల్ అయిన విషయం తెలిసిందే. పైగా సూర్యకుమార్ ముంబయ్ టీమ్‌లో ఉన్నాడు. అందువల్లే సూర్యకుమార్‌ను పక్కన పెట్టారని డిస్కషన్ నడుస్తోంది. ఇవన్నీ కోహ్లీ-రోహిత్ మధ్య కోల్డ్ వార్ ఉందనే చెప్తున్నాయి.

మరో ఇంట్రస్టింగ్ చర్చ నడుస్తోంది. కోహ్లీకి గుబులు మొదలైందా? ధోనీ లాగే రోహిత్ శర్మ చాలా కూల్. కోహ్లీ అంత కూల్ కాదని, చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఫీలవుతాడని చాలా మంది అంటుంటారు. ఒక్కోసారి అది గ్రౌండ్స్‌లో కనిపిస్తుంది కూడా. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు కోహ్లీ కెప్టెన్సీ చేసిన బెంగళూరు టీమ్ ట్రోఫీ గెలవలేదు. అదే టైమ్‌లో రోహిత్ లీడ్ చేసిన ముంబై టీమ్ 4 సార్లు ట్రోఫీ గెలిచింది. IPLలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్. వీటితో పాటు… ఇండియన్ క్రికెట్‌లో ఇప్పుడు కెప్టెన్సీకి పోటీ పెరిగింది. కోహ్లీ… టీమ్ ఇండియా కెప్టెన్ అయ్యేనాటికే… రోహిత్ కూడా పోటీలో ఉన్నాడు. ఇప్పుడు… KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు కూడా టీమ్స్‌ని కూల్‌గా నడిపిస్తున్నారు. వీరిద్దరూ భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్లేవారే. మొత్తానికి నిర్ణయాలు, అధికారాల విషయంలో ఇద్దరి మధ్యా ఏదో గొడవ జరుగుతోందనే వార్తలే ఎక్కువ వస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ బాస్ గంగూలీ కూడా గమనిస్తున్నారు. స్ప్లిట్ కెప్టెన్సీ అనే మాట కూడా వినిపిస్తోంది. అంటే 20-20లకు రోహిత్, మిగిలిన ఫార్మేట్‌లకు కోహ్లీ కెప్టెన్‌గా ఉంచాలన్నా డిమాండ్లూ ఉన్నాయి. మొదట్లో ధోనీ ఈ విధంగానే… 20-20 కెప్టెన్ అయ్యి ఏకంగా వరల్డ్ కప్ తెచ్చాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ అయ్యాడు. ధోనీ, రోహిత్ కెప్టెన్సీలకు… దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇదీ కోహ్లీని కంగారు పెట్టే అంశమే.

ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇండియన్ క్రికెట్‌లో చాలా ట్విస్టులు ఉండొచ్చు. ఆస్ట్రేలియా టూర్ కోసం సీనియర్ టీమ్‌తో కోహ్లీ వెళ్తున్నాడు. దీని వెనుక కూడా గంగూలీ స్ట్రాటజీ కనిపిస్తోంది. ఒక వేళ టీమ్ ఇండియా అస్ట్రేలియాని చిత్తు చేస్తే.. కోహ్లీ మరికొన్నాళ్లు ఎదురు ఉండకపోవచ్చు. ఒక వేళ రిజల్ట్ తేడా కొడితే కోహ్లీకే ఎక్కువ డ్యామేజ్. మొత్తానికి రోహిత్–కోహ్లీల కోల్డ్ వార్ వెనుక పెద్ద కథే నడుస్తోంది.