June 7, 2023

కరోనాకి అంతం ఉందా లేదా?

కరోనాకి అంతం ఉందా లేదా?

ఒక వైరస్‌ ప్రపంచం మీద యుద్ధం చేస్తోందా? కొవిడ్‌-19 ‍(కరోనా వైరస్‌). శతాబ్ద కాలంలో ఎన్నో వైరస్‌లు వచ్చాయి. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కరోనాఇది వైరస్‌ మాత్రమే కాదుప్రపంచాన్ని ముంచేస్తున్న రాక్షసి. కరోనా వైరస్‌ ప్రపంచ విపత్తుగా మారింది. ప్రపంచ మార్కెట్లన్నీ కరోనా దెబ్బకి కుదేలయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే ఇండియన్‌ మార్కెట్లలో 5 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. మార్కెట్‌ ప్రారంభమైన ఐదు నిమిషాల్లో 4 లక్షల కోట్ల మదుపరుల సొమ్ముని కరోనా మింగేసింది. కారణం.. డెత్‌ వైరస్‌ భయం.

చైనాను ఓ దశాబ్దం వెనక్కు తీసుకెళ్లిన కరోనా వైరస్‌ ఆ దేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో కరోనా విధ్వంసానికి 2 వేల 700 మందికి పైగా మరణించారు. ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి ఆగిపోయాయి. చిన్న చితక పరిశ్రమలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కార్ల పరిశ్రమ దాదాపు షట్‌ డౌన్ స్టేజ్‌కి చేరింది. ఈ పరిణామాలతో చైనా మార్కెట్లు కుప్ప కూలాయి. ఇప్పుడు కరోనా సోకిన మిగిలిన దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్న భయాలు మార్కెట్‌ని పట్టుకున్నాయి. ఫలితంమొత్తం మార్కెట్లు నేల చూపులు చూశాయి.

మక్కాకు రాకపోకలను సౌదీ అరేబియా నిలిపేసింది. దాదాపు యూరప్‌ దేశాలన్నీ అబ్జర్వేషన్లో ఉన్నాయి. ఇటలీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దక్షిణా కొరియా చైనా తర్వాత ఎక్కువ కరోనా ఎఫెక్ట్‌ ఉన్న దేశం. కరెక్ట్‌గా వీకెండ్‌ మార్కెట్‌కి ఈ దెబ్బ గట్టిగానే తగిలింది. 2008 తర్వాత మార్కెట్లు ఇంతలా వణికిన సందర్భం ఇదే. అప్పటి ప్రపంచ మాంద్యం కన్నాఇప్పటి కరోనా ఎఫెక్టే ఇంకా ఎక్కువని చెప్పాలి. ఆనాటి మాంద్యం రోజుల్లోనూ భారత్‌ గట్టిగానే నిలబడింది. కానీ.. కరోనా భయం ముందు మన మార్కెట్లు నిలబడలేకపోయాయి.

కరోనా వైరస్‌ కేవలం మనుషుల ఆరోగ్యాల మీద మాత్రమే కాదు.. అంత కన్నా ఎక్కువగా ప్రపంచ ఆర్థిక వ్వవస్థ మీద ప్రభావం చూపించింది. వైరస్‌ కారణంగా ప్రపంచ సప్లై చెయిన్ దాదాపు తెగిపోయింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు తగ్గాయి, కరోనా అనుమానాలున్న దేశాలకు నౌకలు వెళ్లడం లేదు. ఆ దేశాల నుంచి నిత్యం జరిగే వ్యాపారాలన్నీ దాదాపు నిలిచిపోయాయి.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, మొబైల్స్‌, టీవీ, ఏసీ.. ఇంట్లో నిత్యం ఉపయోగించే వస్తువులన్నిటికీ రా మెటీరియల్‌ సప్లై చేసేది చైనా. అంతగా ఇతర దేశాలు చైనా మీద ఆధారపడ్డాయి. కరోనా దెబ్బకి అక్కడి పరిశ్రమలు మూత పడ్డాయి. 70 శాతం ఉత్పత్తి తగ్గింది. ఎగుమతులు ఆగిపోయాయి. చైనా నుంచి ఇప్పుడో నౌక వస్తే అందులోకి వెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. అలా చైనా మీద ఆధారపడే ప్రోడక్ట్స్‌ అన్నిటి మీద మార్కెట్‌ ఎఫెక్ట్‌ ఘోరంగా పడింది. కరోనా మెల్లగా ఇతర దేశాల్లో విస్తరించింది అన్న భయాలు ప్రపంచ దేశాలకు పట్టుకున్నాయి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా కరోనాని ప్రపంచ సమస్యగానే గుర్తిస్తోంది.

కరోనా వైరస్‌ ప్రపంచ, అమెరికా డిప్రెషన్‌కి బీజం అవుతుందని మూడీస్‌ సంస్థ హెచ్చరించింది. పరిస్థితులు అందుకు భిన్నంగా ఏమీ లేవు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ని అరికట్టే మందు లేదు. త్వరలో వస్తుందన్న నమ్మకాలూ లేవు. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రభావం ఆ దేశంలో నెమ్మదిగా తగ్గుతోంది. కానీ ఇతర దేశాల్లో విస్తరిస్తోంది. ఈ భయమే మార్కెట్లను వెంటాడుతోంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య లక్షకు చేరుతోంది. ఈ రాకాసికి అంతం ఉందా లేదా?

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *