ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ కాకలు తీరిన మీడియా వాళ్లకు కూడా అంతుచిక్క లేదు. కేసీఆర్ ఎప్పుడే ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరూ అంచనా వేయలేకపోయరు. మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగించారు. మొదట కేబినేట్ మాత్రమే రద్దు చేసి అసెంబ్లీ రద్దుని హోల్డ్ చేద్దామనుకున్నారని సమాచారం. కాకపోతే ఆ తర్వాత అన్ని సమాలోచనలు చేసిన తర్వాత అసెంబ్లీ రద్దుకి మొగ్గు చూపారని తెలిసింది. ఎన్నికలు జరిగే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
మరి… ఇంతకు ముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ముందస్తులు జరిగాయా? జరిగాయి. 1989లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా అసెంబ్లీ రద్దు చేయకుండానే గవర్నర్ నివేదిక మేరకు సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను కలిపేశారు. 2003లో చంద్రబాబు ముందస్తుకి వెళ్లినప్పుడు కూడా కేవలం కేబినేట్ రద్దు చేశారా? అసెంబ్లీని రద్దు చేశారా అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ రెండు టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ కేబినేట్ రద్దు చేయాలని మొదట అనుకున్నారు. అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రభుత్వం రద్దయినట్టే. ప్రభుత్వం లేనప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వం అన్న మాటే లేదు. కాబట్టి ఎన్నికలకు రికమండ్ చేసే అధికారం గవర్నర్‌కి ఉంటుంది.
నిజానికి ఈ టెక్నికల్ అంశాల గురించి చాలా రోజులుగా అధికారులు కుస్తీలు పడుతున్నారు. క్లారిటీ రాకపోవడం వల్లే ప్రగతి నివేదన సభలో అనౌన్స్ చేయలేదని భావించవచ్చు. అందుకే అన్ని రకాలుగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లి, పక్కా టెక్నికల్‌గా కేసీఆర్ ముందస్తు వ్యూహాన్ని అమలు చేశారని చెప్పొచ్చు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ముందస్తుకి వెళ్లిన ప్రభుత్వాలకు వైఫల్యాలు తప్పలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ముందస్తు అచ్చిరాలేదని ట్రాక్ రికార్డ్ చెప్తోంది. సెంటిమెంట్‌కి బాగా విలువ ఇచ్చే కేసీఆర్.. ఈ సెంటిమెంట్ గురించి ఆలోచించారో లేదో మరి.