ఒక థియేటర్లో సినిమా ముగియగానే బయటకు వచ్చిన ఓ స్త్రీ, అదే థియేటర్ల షో చూడ్డానికి వచ్చిన సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిని, నటుడు దర్శన్ కుమార్‌ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కాలం నాటి పరిస్థితులను చూసిన ప్రత్యక్ష సాక్షిగా తన గుండెలోని బాధను దించుకుని చాలా సేపటివరకు ఏడుస్తూనే ఉన్నారు ఆ మహిళ. ఓదార్చడం వివేక్, దర్శన్‌కి కూడా చాలా కష్టమైంది.
మరో చోట… ఒక వ్యక్తి సినిమా చూసి బయటకు వస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఎమోషన్‌ని ఆపుకోలేకపోయాడు. ఎవరో ఓ ఛానల్ వారు అభిప్రాయం అడిగితే.. ఉద్వేగం ఆపుకోలేక ఆనాటి అరాచకాలను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశాడు. అప్పటి పరిస్థితికి కారణం ఎవరో చెప్తూ చాలా సేపు ఆ ఎమోషన్ నుంచి బయటపడలేకపోయాడు.
చాలా థియేటర్లలో సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకులు సీట్లలోంచి లేవలేక ఉద్వేగానికి గురై అలాగే కూర్చుండిపోయారు. కంటతడి లేకుండా బయటకు వచ్చినవారి సంఖ్య తక్కువేనని మీడియా రాస్తోంది. ఎంతో మంది భారత్ మాతాకి జై, శివాజికీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ బయటకు వస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు.. ఒక సినిమా కాదు. భారతీయుడి భావోద్వేగంగా మారింది.
ప్రజలు అసలైన చరిత్రను తెలుసుకోవాలనుకుంటున్నారు. అన్వేషిస్తున్నారు. దశాబ్దాల క్రితం కళ్ల ముందు జరిగిన కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి వెతికినా ఒక్క పేజీ కూడా అఫీషియల్ చరిత్రలో కనిపించదు. దాచేశారు అంటే బాగుంటుందేమో. ఆనాడు జరిగిన ఊచకోతలో… ఎంతో మంది కశ్మీరీ హిందూలు ఇల్లు వదిలి ప్రాణ భయంతో పారిపోయారు. ఎన్నో వేల కుటుంబాలు చెల్లచెదురయ్యాయి. వేల మందిని అతి దారుణంగా చంపేశారు. ఎన్నో మానభంగాలు, ఎన్నో అత్యాచారాలు. భారత దేశ అధునిక చరిత్రలో చెరిగిపోని నెత్తుటి మరక కశ్మీరీ హిందువుల ఊచకోత. ఈ ఇతివృత్తంతోనే వివేక్ అగ్నిహోత్రి ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన సినిమా కశ్మీరీ ఫైల్స్.

ఈ సినిమా సహజంగానే హిందూ వ్యతిరేక వర్గాలకు నచ్చలేదు. ప్రజలకు నచ్చితే ఏ వర్గమూ ఏమీ చేయలేదు. ఏ పబ్లిసిటీ లేకుండా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు పదుల సంఖ్యల్లో థియేటర్లలోనే రిలీజైంది. కానీ ఇప్పుడు కొన్ని వందల థియేటర్లలో, వందల షోలు ప్రదర్శితమవుతున్నాయి. దాదాపు అన్ని షోలు హౌస్‌ఫుల్ రన్‌తో నడుస్తున్నాయి. IMDB 9.9 రేటింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. ఇంత రేటింగ్ ఇచ్చినా మొదటి రోజు నుంచి చాలా నేషనల్ పత్రికలు చెత్త రేటింగ్ ఇచ్చి.. ఆ సినిమా ప్రజల దృష్టిలో పడకుండా శాయశక్తులా ప్రయత్నించాయి. ఈ సినిమా రివ్యూలను ప్రజలు అసలు పట్టించుకోలేదు. జస్ట్… మౌత్ టాక్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మూడు రాష్ట్రాలు వినోదపు పన్ను రద్దు చేశాయి. ఈ సినిమా ప్రజల్లోకి ఇంతలా వెళ్లడానికి అసలైన కారణం సోషల్ మీడియా.

ఈ సినిమాను ఆపేందుకు కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నించాయి. పిల్ కూడా వేశాయి. కానీ అవేవీ ఫలించలేదు. ఇది ఫిక్షన్ సినిమా కాదు… వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. కశ్మీరీ పండిట్లపై ఆనాటి వేర్పాటువాదులు మతం పేరిట సృష్టించిన అరాచకాలను కళ్లకు కట్టినట్టు చూపించిన హిస్టోరికల్ మూవీ ఇది. ఆనాడు కొన్ని వేల మంది మరణించారు. లక్షల మంది కశ్మీర్ వదిలి పారిపోయారు. ఇప్పటికీ వారి ఆస్తులు అక్కడ శిథిలమై కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆస్తులను కశ్మీరీ పండిట్లు వెళ్లిపోగా… మిగిలిన ప్రజలు దొరికిన కాడికి దోచుకున్నారు. అన్నిటికి లౌకికవాదం అని తెగ మొత్తుకునే మేధావులు…. ఆనాడు లౌకికవాదం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక రకంగా నరమేధాన్ని సమర్ధించినట్టే. ఆనాడు కశ్మీరీ బాధితుల తరపున ఏ రాజకీయ నాయకుడు నిలబడలేదు. ఏ మేధావీ నోరు విప్పలేదు. కనీసం ఖండించలేదు. వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటికీ ఆనాటి అరాచకాలు గుర్తొచ్చినప్పుడల్లా ఉలిక్కిపడే కశ్మీరీ పండితులు ఎందరో. ఈ కథనే చూపించారు వివేక్ అగ్నిహోత్రి. గత ఏడాది దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో షికారా అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా అంతగా జనంలోకి వెళ్లలేదు. కానీ ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్సే ఎక్కువగా నటించారు. ప్రతీ ఒక్కరూ నటనలో ప్రాణం పెట్టేశారు. ఆ ఎమోషన్ ప్రేక్షకులను హృదయాలను తడిమింది. ఒక సినిమా చూసి ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎమోషన్ అవడం ఈ మధ్య కాలంలో చూడని సన్నివేశం అంటున్నారు అంతా.