June 7, 2023

ద్వారక…. మహా భారతంలో అద్వితీయ నగరంగా వివరించబడిన నగరం. సాగర మధ్యలో నిర్మించబడిన ద్వీప నగరం. ఐలాండ్‌ సిటీ. శ్రీ కృష్ణుడి రాజ్యం. ఆ అవతార పురుషుడు నడిచిన నేల. శ్రీ కృష్ణుడి అవతారం పూర్తి కాగానే ఆ బంగారు నగరం కూడా సముద్రంలో మునిగిపోయింది. 2001లో జరిగిన ఆర్కియాలజీ సర్వేలో ఆనాటి ద్వారక నగరం బయటపడి… ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ఇప్పటికి 6 వేల ఏళ్ల క్రితం అంత గొప్ప నగరాన్ని ఎలా నిర్మించారన్నది ఒక పెద్ద మిస్టరీ. మహా భారతంలో అన్ని రాజకీయ ఎత్తులకు కేంద్ర స్థానం ద్వారక. భారతాన్ని శ్రీ కృష్ణుడే నడిపించాడు. అలాంటి ద్వారక గురించి తెలుసుకోవడం ఈ తరానికి ఖచ్చితంగా అవసరం. భారతీయుల నాగరికతకు, ఆనాటి టెక్నాలజీకి ద్వారక ఒక గొప్ప ఉదాహరణ. ఆనాటి లగ్జరియస్‌ నగర జీవనానికి ద్వారక, హస్తినాపురాలు సాక్ష్యాలు. 2001లో అప్పటి మెరైన్‌ ఆర్కియాలజిస్ట్‌ S.R.రావు గారి సాహసోపేతమైన అన్వేషణలో దొరికిన అద్భుత నగరం ద్వారక. శ్రీ కృష్ణుడు ఉన్నాడని, మహా భారతం జరిగిందని చెప్పడానికి దొరికిన తిరుగులేని ఆధారం ద్వారక. శ్రీకృష్ణుని మరణానంతరం కలియుగం ప్రవేశించిందని, అలా క్రీ.పూ.3102 వ సంవత్సరంలో కలియుగం ప్రారంభమైందనీ చరిత్ర చెప్తోంది. మహా భారతంలో మౌసల పర్వంలో ఈ శ్లోకం ఉంది.

నిర్యతె తు జానె తస్మిన్ సాగరోమకరాలయః
ద్వారకాం రత్నసంపూర్ణం జలేనాప్లావయత్తదా 

ఈ శ్లోకం అర్థం…. జనమంతా వదిలేసిన తరువాత సముద్రం పొంగి సర్వసంపదలతో నిండిన ద్వారకను ముంచివేసింది. మాజీ పురావస్తుశాఖ శాస్త్రవేత్తయైన డా. ఎస్. ఆర్. రావు గారు, మెరైన్ ఆర్కియాలజీలో నిష్ణాతులు. ఆయన చేసిన పరిశోధనల వలన 2001లో జలగర్భంలో ఆనాటి ద్వారకా నగరంతో పాటు, అనేక శిధిలాలు దొరికాయి. హరివంశం అనే గ్రంథంలో చెప్పినట్టు ద్వారకా నగరవాసులు ధరించే ముద్రిక దొరికింది. శంఖంపైన మూడు తలలు ఉండే చిహ్నాన్ని ద్వారక పౌరులు ధరించేవారు. వీటిని బట్టి ద్వారక అనే నగరం నిజంగానే వుండేదనీ, అది భారతంలో చెప్పబడ్డ శ్రీకృష్ణుని నగరమేననీ తెలుస్తోంది. ద్వారకా నగరం మునిగిపోవడం కూడా భారతంలో వుంది. మునిగిపోతున్న ద్వారకను అర్జునుడు చూసినట్టు కూడా భారతం చెప్తోంది.

కంసుడిని సంహరించాక మధురను వసుదేవుడు పాలించాడు. ఆ సమయంలో జరాసంధుడు ఎన్నో సార్లు మధురపై దాడి చేశాడు. అన్ని సార్లూ బలరాముడు జరాసంధుడి సైన్యాన్ని ఓడించాడు. అయితే ప్రతీసారి యుద్ధంలో మధుర ప్రజలు ఇబ్బంది పడేవారు. వారిని ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉంచేందుకు శ్రీ కృష్ణుడు ఏకంగా రాజ్యాన్నే మార్చేశాడు. అదే ద్వారక. గుజరాత్‌ సముద్ర తీరానికి దగ్గరలో ఒక విశాలమైన దీవిని సముద్రుడు ఇచ్చాడని, దాని మీద విశ్వకర్మ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుత నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించాడని భారతం చెప్తుంది. ద్వారక నగరం గురించి భారతం, హరివంశం గ్రంథాల్లో అద్భుత వర్ణనలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడి అవతార సమాప్తి కూడా అక్కడే జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక శ్రీ కృష్ణుడి మీద కోపం గాంధారి శాపం పెట్టింది. క్రీస్తు పూర్వం 3138లో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్తారు. అక్కడి నుంచి 36 ఏళ్ల లోపు కృష్ణుడి వంశం కూడా నాశనం అయిపోతుంది అన్నది ఆ శాపం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన సరిగ్గా 36 ఏళ్లకే ద్వారక మునిగిపోయింది. శ్రీ కృష్ణుడు 120 ఏళ్లకు తన అవతారం ముగించాడు. ఇది ద్వారక కథ. అయితే ఇప్పుడున్న ద్వారకలో ఆ శ్రీ కృష్ణుడిని మాత్రమే పూజిస్తారు. ద్వారాకధీశ్‌గా కొలుస్తారు. మరి అసలు ద్వారక ఎక్కడ?

డాక్టర్‌ ఎస్. ఆర్. రావు గారు… గుజరాత్‌లోని ప్రఖ్యాత క్షేత్రం ద్వారకాధీశుని గుడి దగ్గర 1979 ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. అక్కడ 15, 12, 9వ శతాబ్ది నాటి గుళ్ళు దొరికాయి. ఆ మందిరాలకు 10 మీటర్ల కింద రెండు నగరాల శిధిలాలు కనపడ్డాయి. అక్కడ దొరికిన పింగాణి పాత్రల వంటివే హస్తినాపురంలోనూ దొరికాయి. కనుక ద్వారకాధీశ్‌ ఆలయం దగ్గరలోనే ద్వారక కూడా వుండి వుంటుందన నమ్మకంతో రావు గారు సముద్ర జలగర్భంలో పరిశోధన చేస్తే ఏకంగా ద్వారకే దొరికింది. సముద్ర గర్భంలో పెద్ద పెద్ద ద్వారాలు, కోట గోడలు, పోర్టులు దొరికాయి. అవి మహాభారత కాలానివేనని నిర్థారించడం జరిగింది. వాటితో పాటుగా కంచు, ఇనుప పరికరాలు, రాతి లంగరులు, శంఖు ముద్రలు ఎన్నో దొరికాయి. ఈ నాగరికతకూ, హరప్పా నాగరికతకు మధ్య సంబంధం కూడా ఉంది. గుజరాత్‌లో బెట్‌ ద్వారక అనే ద్వీపం ఉంది. అక్కడ మత్స్యావతారం ఆలయం ఉండేదని, ఆ మందిరానికి శ్రీకృష్ణుడు తరచు వెళ్తూ వుండేవాడని పురాణాలు చెప్తున్నాయి. అక్కడ దొరికిన శిధిలాలో ఆ ఆలయానికి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. మహాభారతంలో చెప్పబడిన గ్రామాలు, చెరువులు, కొండలను కూడా గుర్తు పట్టగలిగారు. మొత్తానికి గుజరాత్ దగ్గర సముద్రంలో దొరికిన నగరం శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకానగర ప్రాంతమేనని పరిశోధకులు నిరూపించగలిగారు.

ఇప్పుడున్న ద్వారక గుజరాత్‌ తీర ప్రాంత పట్టణం. జామ్‌నగర్‌ జిల్లాలో ఉంది. ఇప్పటికీ ఇక్కడి ప్రజల ఆరాధ్య దైవం ద్వారకాధీశుడు. అంటే శ్రీ కృష్ణుడు. మహా భారత కాలం నుంచి ద్వారక… సముద్ర వ్యాపారంలో చాలా ప్రఖ్యాతి చెందింది. 1963 నుంచి సాగరంలో ఉన్న ద్వారక అన్వేషణ కొనసాగుతునే ఉంది. 1979 నుంచి ఎస్‌.ఆర్‌.రావు ఆధ్వర్యంలో మెరైన్‌ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ చేసింది. ఎస్‌.ఆర్‌.రావు ప్రఖ్యాతి చెందిన మెరైన్‌ ఆర్కియాలజిస్ట్‌. హరప్పా తవ్వకాలు, గుజరాత్‌లోని అత్యంత ప్రాచీన లోథల్‌ ఓడరేవుని ప్రపంచానికి పరిచయం చేసింది ఎస్‌.ఆర్‌.రావు టీమే. 1981 నుంచి 20 ఏళ్ల పాటు రావు బృందం సముద్రంలో ద్వారక కోసం అన్వేషణ చేసింది. ఎంతో శ్రమ, మరెన్నో ప్రమాదాల మధ్య 2001లో శ్రీ కృష్ణుడు నడయాడిన ద్వారకను రావు టీమ్‌ కనుక్కోగలిగింది. ద్వారక అన్వేషణలో అన్నిటికన్నా ముఖ్యమైదని 2001లో జరిగిన గల్ఫ్‌ ఆఫ్‌ కాంబాట్‌ పరిశోధన. గుజరాత్‌లో ముఖ్యమైన తీర ప్రాంతం ఇది. ఇది గుజరాత్‌ నుంచి అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. ముంబయ్‌ సీ కోస్ట్‌కి కూడా ఇది దగ్గర. ఆ సముద్ర తీరం నుంచి 7 మైళ్ల దూరంలో అండర్ వాటర్‌ పొల్యుషన్‌ సర్వే చేస్తున్న మరైన్‌ విద్యార్థులకు పెద్ద షాక్‌. అక్కడ ఏవో పెద్ద పెద్ద నిర్మాణాలు బురద, ఇసుకలో కూరుకుపోయి వారికి కనిపించాయి. ఏకంగా 5 మైళ్ల దూరం వరకు ఆ నిర్మాణాల శిథిలాలు వారికి కనిపించాయి. డైవర్స్‌ ఆ శిథిలాల రాళ్లను, శాంపిల్స్‌ని, అక్కడ దొరికిన రాగి నాణాలను సేకరించారు. అవి దాదాపు 4 వేల ఏళ్ల నుంచి 9 వేళ్ల ఏళ్ల పురాతనమైనవి రీసెర్చ్‌లో తేలింది. అంటే ద్వారక ఎంత పెద్ద సామ్రాజ్యమో చెప్పడానికి ఇది సాక్ష్యం. అక్కడి నాగరికత సింధూ నాగరికత కంటే పురాతనమైనది 2001లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Dr. S. R. Rao, Indian archaeologist

సముద్ర గర్భంలో దొరికిన అపురూప నగరం ద్వారక. ఎన్నో అద్భుత శిల్పాలు, అద్భుతమైన నిర్మాణ శైలి, ఎన్నో రాతి కట్టడాలు దొరికాయి. ముఖ్యంగా అప్పటి నౌకలకు లంగర్లు వేసే యాంకర్లు వందల్లో దొరికాయి. వీటిని బట్టి ఆ రోజుల్లో ద్వారక అత్యంత బిజీగా ఉండే పోర్ట్‌ సెంటర్‌ అని ఆర్కియాలజిస్ట్‌లు నిర్ధారించారు. రోజు వందల నౌకలు ద్వారకు వచ్చేవి. ప్రధాన నౌకలు ద్వారకకు వస్తే, చిన్నా చితక నౌకలు గోమతీ నదీ తీరంలో లంగరు వేసేవి. అంటే దాదాపు 100 కిలోమీటర్ల మేర ద్వారక విస్తరించింది. పురాణాల్లో కూడా ద్వారక గురించి ఇలాంటి వర్ణనే ఉంది. భాగవతంలో ద్వారక గురించి ఉన్న వివరణ ఇప్పుడు చూద్దాం. ద్వారకను దర్శించిన నారదుడు ఆ నగరాన్ని ఇలా వర్ణించాడు. ద్వారకా నగరం అంతా అందమైన పార్కులు, గార్డెన్లు, అడుగడుగునా సరస్సులతో అద్భుతంగా ఉండేది. ద్వారకలో చిన్నపెద్దా కలిపి 9 లక్షల భవనాలు ఉన్నాయని భాగవతం వర్ణిస్తోంది. అన్ని భవనాలను ఖరీదైన మణులతో అలంకరించారట. ఇంటిరీయర్‌ కోసం బంగారం, రత్నాలను భారీగా ఉపయోగించారట. నగరం పాపులేషన్‌ కూడాఎక్కువే. వారికి తగ్గట్టుగానే అందమైన రోడ్లున్నాయి. మార్కెట్లు, ఆలయాలు, కమర్షియల్‌ కాంప్లెక్సులు, సభా మండపాలు ఇలా వేటికవి విభజించి ఉన్నాయని నారదుడు ద్వారకను వర్ణించాడు. శ్రీ కృష్ణుడి ఆలోచనకు అనుగుణంగా విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించినట్టు భాగవతంలో వర్ణించారు. సముద్రంలో దొరికిన ఆధారాలు చూస్తే భాగవత వర్ణనకు సరిగ్గా సరిపోతోంది. సముద్ర గర్భంలో ఉన్న ద్వారకలో ఎన్నో అద్భుత వస్తువులు బయట పడ్డాయి. అద్భుత శిల్పకళతో ఉట్టి పడే గోడలు, స్తంభాలు, రాతి లంగరులు బయటపడ్డాయి. సముద్రాన్ని తట్టుకునే విధంగా ఆనాటి నిర్మాణాలు ఉన్నాయని ఆర్కియాలజిస్టులు వివరించారు. ముద్రలు మహా భారత కాలం నాటివేనని తేలింది. ముఖ్యంగా ఆనాడు ద్వారకలో వాడిన మట్టి కుండలు క్రీస్తు పూర్వం 3528 నాటివి. మట్టితో పాటు కంచు, రాగి, ఇనుము వస్తువులు కూడా చాలా దొరికాయి. మొత్తానికి గుజరాత్‌లో దొరికిన ద్వారకను బట్టి మన భారత దేశ నగర చరిత్ర కనీసం 9 వేల ఏళ్ల పురాతనమైనదని అర్థమవుతోంది.

హరివంశం ప్రకారం ద్వారక ప్రధాన నగరం ద్వీపంలో ఉంటుంది. దాదాపు 12 యోజనాలు.. అంటే 108 కిలోమీటర్ల మేర నగరం విస్తరించి ఉంటుందని హరివంశం చెప్తోంది. ద్వారక ద్వీపం నుంచి ..గోమతి నదీ, సముద్రంలో కలిసే వరకు ఒక స్ట్రిప్‌ ద్వారా నగరం విస్తరించి ఉందని పురాణాలు వివరించాయి. ద్వారావతి ద్వారక అసలు పేరు. అంటే అన్ని వైపు ద్వారాలు ఉంటాయి. కట్టు దిట్టమైన కోట గోడలు ఉండేవి. ఈ విషయాన్ని ఎస్‌.ఆర్‌.రావు గారు చెప్పారు. శంఖు ముద్ర ఉంటేనే లోపలికి అనుమతించే సిస్టమ్‌ ఉండేది. ఆ శంఖు ముద్రలు సముద్రంలో దొరికాయి. మొత్తానికి ద్వాపర యుగం చివరిలో మునిగిన ద్వారక… అలా మునుగుతూ మునుగుతూ క్రీస్తు పూర్వం 2 వేల నాటికి పూర్తిగా కనుమరుగైందని మెరైన్‌ ఆర్కియాలజిస్ట్‌లు చెప్పారు. మహాభారతం, హరివంశం, మత్స్య, వాయు పురాణాల్లో వర్ణించిన ద్వారక ఊహ కాదు, కల్పనా కాదు. నిజం…ఆనాడు శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారక అద్భుతమైన నిజం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్ర మట్టాలు పెరిగాయి. రామాయణ కాలం నాటి రామసేతు కూడా అలానే మునిగిపోయింది. మహా భారతం ప్రకారం ద్వారక మునిగిన రోజు ఏమైంది. ద్వారక మునిగి పోతోందని శ్రీ కృష్ణుడికి ముందే తెలిసింది. అర్జునుడిని పిలిచి ద్వారకలో ఉన్న ప్రజలను హస్తినాపురానికి తరలించమని చెప్పాడు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడు, బలరాముడు ఇద్దరూ అవతరాలు చాలించారు. అర్జునుడు ద్వారక ప్రజలను హస్తినకు తరలిస్తుండగా… పెద్ద పెద్ద అలలు ద్వారకను ముంచాయని వివరించడం భారతంలో ఉంది. శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన 7వ రోజు ద్వారక మునిగిపోయింది. సునామీనే దీనికి కారణం అని కొందరు సైంటిస్టులు చెప్తుంటారు. మొత్తానికి మహా భారతం నిజం. భారతంలో చెప్పిన ప్రతీ ప్రాంతం నిజం. భారతాన్ని నడిపించిన ద్వారక, ద్వారకలో శ్రీ కృష్ణుడు కూడా నిజం.

SATISH KOTTHURI

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *