భారత దేశం అద్భుతాలకు నిలయం. భారత దేశంలో ఉన్న ప్రతీ పురాతన ఆలయం ఏదో ఒక చరిత్రను దాచుకునే ఉంటుంది. అలాంటి ఆలయాల్లో ఒకటి నిష్కళంక్ మహాదేవ్ ఆలయం. అసలు సముద్రం పక్కనే ఆలయం నిర్మించడమే మహాద్భుతం. మరి ప్రతీరోజూ ఆ ఆలయాన్ని సముద్రుడే దాచేసుకుంటే, భక్తుల కోసం ఆ సముద్రుడు కాసేపు ఆ ఆలయాన్ని దర్శించుకునేందుకు దారి ఇస్తే.. వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది కదా. అదే నిష్కళంక్ ఆలయంలో ఉన్న రహస్యం. సముద్రం లోపల ఉండే ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ లో భావనగర్ అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి ఓ 20 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం అరేబియా మహాసముద్ర తీరంలో ఉంటుంది. ఈ సముద్ర తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో, అదీ సముద్ర గర్భంలో నిష్కళంక్ మహాదేవ్ ఆలయం కొలువై ఉంది. కానీ ఈ ఆలయంలో శివయ్యను ఎప్పుడు పడితే అప్పుడు దర్శించడం కుదరదు. ప్రతీ రోజూ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ తీరంలో విపరీతంగా అలలు వస్తాయి. అలా వచ్చిన అలలు ఆలయాన్ని ముంచేస్తాయి. దూరం నుంచి చూస్తే సముద్రంలో లోపల ఆలయం ఉందని కూడా తెలియదు. అంతలా ఆలయం మునిగిపోతుంది. మళ్లీ రోజూ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాతంలో నెమ్మదిగా అలలు వెనక్కు వెళ్తాయి. ఆలయానికి సముద్రుడు దారి ఇస్తాడు. అలా రాత్రి ఏడు గంటల వరకు శివయ్య ఆలయం దర్శనమిస్తుంది. ఆ సమయంలో భక్తులు నిష్కళంక్ మహాదేవుని దర్శనానికి సముద్ర మార్గంలో నడిచి భక్తులు వెళ్తారు. ఇలాప్రతీ రోజు సముద్రుడు ఆలయాన్ని తన ఒడిలో దాచుకోవడం, మళ్లీ ఓ ఆరుగంటల పాటు ఆలయాన్ని భక్తులకు వదిలేయడం ఓ అద్భుతం. ఈ అద్భుతాన్ని చూసేందుకు చాలా మంది యాత్రికులు వస్తుంటారు.
నిష్కళంక్ ఆలయంలో ఐదు శివలింగాలు ఉంటాయి. సముద్రంలో ఆలయం ఎక్కడ ఉందో చెప్పేందుకు ఓ స్థూపం కనిపిస్తుంది. ప్రతీ అమావాస్యకు, పౌర్ణమికి స్థానిక గ్రామస్తులు నిష్కళంక్ మహాదేవ్ కు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతీ రోజూ ఈ ఆలయాన్ని సముద్రుడు అభిషేకించడం వెనుక ఉన్న భౌగోళిక రహస్యం ప్రకృతికి మాత్రమే తెలుసు.
ఇక ఈ ఆలయం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మహా భారత యుద్ధంలో కౌరవులను సంహరించి పాండవులు విజయం సాధించారు. ఆ పాపభయం వారిని వెంటాడింది. ఆ పాపం నుంచి విముక్తి కల్పించమని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. అప్పుడు ఒక నల్లని ఆవుకి నల్లని రంగు జెండాను కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం పాండవులను వెళ్లమన్నాడు. ఆవు, జెండా రంగు తెల్లగా మారితే పాప ప్రక్షాళన జరిగినట్టేనని చెప్తాడు. అలా కృష్ణుడి సూచన మేరకుఆ ఆవు వెనుక పాండవులు చాలా దూరం నడిచాడు. చివరికి ఈ కొలియాక్ గ్రామానికి రాగానే ఆవు తెల్లగా మారిందట. అక్కడే పాండవులు శివుని కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చిన శివుడు పంచ పాండవుల ముందు పంచ స్వయంభువు లింగాలుగా వెలిశాడని కథ. ఆ ఐదులింగాలను పాండవులు ప్రతిష్టించారు. పాండవుల కళంకాలు తొలగిన ప్రాంతం కాబట్టి… ఈ ఆలయానికినిష్కళంక్ మహాదేవ ఆలయం అని పేరు వచ్చిందని ఇక్కడి కథ.
పాండవులు తపస్సు చేసిన నాటికి అప్పటి సముద్రం వెనక్కు ఉండి ఉండవచ్చు. అయితే ఆ తర్వాత కాలక్రమేణా సముద్రం ముందరకు వచ్చినా… ఆలయం కోసం సముద్రుడే రోజూ వెనక్కు వెళ్లడం ఎక్కడా లేని విచిత్రం. అందుకే గుజరాత్ వెళ్లే పర్యాటకులు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ప్రాంతానికి వెళ్లడానికి విజయవాడ, సికింద్రాబాద్ నుంచి భావనగర్ ఎక్స్ ప్రెస్ ఉంది. భావనగర్ నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు బస్సులు, ఆటోలు,టాక్సీలు ఉంటాయి. విమానంలో వెళ్లేవారు నేరుగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగి భావనగర్ చేరుకోవాలి. అహ్మదాబాద్ నుంచి భావనగర్ 170 కిలోమీటర్లు. కార్లో వెళితే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతుంది.