ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి. ఇదే శయన ఏకాదశి, విష్ణు శయనోత్సవం. ఈ ఏకాదశి అతి ముఖ్యమైన పర్వదినం. ఈ రోజు శంఖ చక్రగదాపద్మాలను ధరించి ఆది శేషువుపై శయనించిన లక్ష్మీ సమేత విష్ణువు ప్రతిమను పూజించాలి. ఈ ఏకాదశీ వ్రతం 3 రోజులు చేయాలి. రోజూ శేషశాయిని అర్చించడం, ఏకాదశినాడు ఉపవాసం, ద్వాదశి పారయణ, త్రయోదశినాడు అర్చన చేయాలి. కొందరు ఈ రోజునుండే చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. కొన్ని సంప్రదాయాలలో ద్వాదశి నుండి ఆచరిస్తారు. ఇవి గృహస్థులకు చాతుర్మాస్య వ్రతారంభ దినాలు.
త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం!
విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరాచరమ్!!
ఏకాదశి అత్యంత విశిష్ఠ తిథి. సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా భావిస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక హరి వాసరమని కూడా పిలుస్తారు. క్షీరాబ్దిలో శేషుని మీద శ్రీ మహా విష్ణువు ఈ పర్వదినాన శయనిస్తాడు. కనుక ‘శయన ఏకాదశి’అని అంటారు. సైంటిఫిక్‌గా చూస్తే తొలి ఏకాదశి నాడే కాలంలో, గ్రహ గమనాల్లో మార్పులు వస్తాయి. ఈ రోజునుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు అనిపిస్తాడు. తొలి ఏకాదశి నాడు ‘గోపద్మ వ్రతం’ చేస్తారు. ఈ వ్రతాన్ని ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు.. ద్వారకలో స్త్రీలందరితో చేయించాడని ప్రతీతి.
ఇక పురాణ గాధగా చెప్పాలంటే కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ వరం వల్ల దేవతలు, ఋషులను హింసించేవాడు. శ్రీహరి అతడిని పోరాడి, అలసి , ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన దేహం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ అసురుణ్ని సంహరించిందని చెబుతారు. సంతోషించిన విష్ణు భగవానుడు ఆ కన్యకు ‘ఏకాదశి’ తిథిగా, విష్ణుప్రియగా లోకారాధ్య అవుతావని‘ వరమిస్తాడు. అప్పటి నుంచి ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని పురాణ కథనం.
అంబరీష మహారాజు తొలి ఏకాదశి వ్రతం వల్ల దుర్వాస మహర్షి శాపం నుంచి తప్పించుకున్నాడు. బ్రహ్మహత్యాది పాతకాలన్నింటినీ తొలగించి, ముక్తి ప్రసాదించే మహత్తర వ్రతమిది. ఆషాఢ మాసాన తొలకరి జల్లులు, అన్నదాతల లోగిళ్లలో కోటి ఆశలు నింపుతాయి. అందుకే వ్యవసాయ అనుకూల సమయాన్ని పండుగలుగా చేసుకునే సంప్రదాయం మన దగ్గర కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైంది ఈ తొలి ఏకాదశి. వర్ష ఋతువు నుంచి శరదృతువు వరకు 4 నెలలు శ్రీహరి… శేషశయనం మీద యోగ నిద్రలో ఉండి… ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలోపండగలు ఎక్కువ. ఈ పండుగలో ఆచారాలన్నీ ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలోనివే. వ్రత సమయంలో పిప్పల వృక్షానికి ప్రదక్షిణ, దేవాలయాల్లో దీపారాధన ఇవన్నీ ఆరోగ్య ప్రధాన ఆచారాలు. ఆయుర్వేదంలో పిప్పల వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆ గాలి తగిలినంతనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంత శక్తివంతమైన వృక్షం పిప్పల.
ఈ వ్రతాచరణ ప్రకారం – నారాయణుని పూజించి ఈ శ్లోకం చదవాలి
త్వయి సుప్తే జగన్నాథ, జగత్సుప్తం భవేదిదం!
విబుద్ధే చ విబుధ్యేత, ప్రసన్నో మే భవాచ్యుత!!
చతురో వార్షికాన్ మాసాన్ దేవ స్యోత్థాపనావధి!
శ్రావణే వర్జయేచ్ఛాకం దధి భాద్రపదే తథా!!
దుగ్ధమాశ్వయుజే మాసి కార్తికే ద్విదళం త్యజేత్!
ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేచ్యుత!!
ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ!
నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసాదాత్త రమాపతే!!
గృహీతేస్మిన్ వ్రతేదేవ పంచత్వం యదిమే భవేత్!
తదా భవతు సంపూర్ణం ప్రసాదాత్తే జనార్దన!!